చిత్రం భళారే విచిత్రం
తెలుగు చిత్రసీమ నుంచి జాతి గర్వించదగ్గ ఎన్నో సినిమాలు తెరపైకి వచ్చాయి. ఎన్నో ఉత్తమ చిత్రాలను మన నిర్మాతలు, దర్శకులు కష్టపడి ఎంతో ఇష్టంతో తీసారు. ఎన్నో ఏళ్లుగా ఉదాత్తమమైన, ఉత్తమమైన, సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చాయి. చిత్రానికి కావలసిన అన్ని నగిషీలు అద్దుతూనే వస్తున్నారు. పాతతరం నుంచి నేటితరం వరకు అద్భుత కళాఖండాలను తెలుగు జక్కన్నలు ఆవిష్కరించినా వాటికి సరైన గుర్తింపు దక్కలేదు. వాటిని చక్కగా చూసి ఆదరించిన దాఖలాలు లేవు. ఆలస్యంగా ఇప్పుడు బాహుబలి సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు రావడం తెలుగుచిత్రసీమ చేసుకున్న పుణ్యంగా భావించాలి. ఇంతటి ఉదాత్తమైన చిత్రాన్ని నిర్మించినందకు తెలుగుజాతి ఇప్పటికే గర్విస్తోంది. ఈ అవార్డుతో మరింతగా పులకరించింది. మన తెలుగు చిత్రసీమ గొప్పతనానికి ఇదో మచ్చుతునక కాక మరోటి కాదు. జాతీయ స్థాయిలో మన సినీపతాకను రెపరెపలాడించినప బాహుబలికి శాల్యూట్. స్వర్ణకమలాల తోటలో తెలుగు బాహుబలిని గుబాళింపచేసిన అపర జక్కన్న రాజమౌళి నిజంగా అభినందనీయుడు. ఈ అవార్డుకు ముందే ప్రపంచ ప్రజలు ఆయనకు ఘనమైన అభినందన మందారాలు అందించారు. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ భళా అన్నారు. ఆహా అనని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఇదంతా ఒక ఎత్తయితే తొలిసారిగా జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని బాహుబలి’ సాధించిన ఘనత దక్కించు కోవడం మరో ఎత్తు. ఇదంతా మన సత్తాకు నిదర్శనంగా చెప్పుకోవాలి. సాధారణంగా కళాత్మక చిత్రాలే దక్కించుకునే ఈ పురస్కారాన్ని వాణిజ్య హంగులు, భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో రూపొందించిన బాహుబలి గెలవడం ఈసారి ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను పొందడంతోపాటు తాజాగా ప్రఖ్యాత సినీ దర్శకుడు రమేశ్‌సిప్పీ నేతృత్వంలోని జ్యూరీ సభ్యుల మనసుల్నీ గెలిచి తెలుగు సినిమాను శిఖర స్థాయికి చేర్చింది. అసలుకు కొసరు అన్న చందంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచ కూడా మన తెలుగు చిత్రాల స్థాయిని పెంచింది. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో ఒక సైనికుడి ప్రేమగాథను దృశ్యకావ్యంలా తెరకెక్కించి తెలుగు సినిమా స్థాయిని కొత్తబాట పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగువారికి అవకాశం ఉంటే ఎంతటి మహత్తర చిత్రాలనైనా దృశ్యకావ్యంగా మలచగలరని గతంలోనే నిరూపించారు. ఇప్పడుఉ బాహుబలి దానికి కొనసాగింపుగానే చెప్పుకోవాలి. మొత్తంగా జాతీయస్తాయిలో గుర్తింపు దక్కించుకోవడమే ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. 63 ఏళ్లుగా తెలుగు సినిమా ప్రపంచం ఎదురు చూస్తున్న జాతీయ ఉత్తమ చిత్ర అవార్డును బాహుబలి ద్వారా మనకు అందడం గర్వకారణం కాక మరోటి కాదు. ఆస్కార్ అవార్డు వచ్చినా రాకున్నా, జాతీయ స్థాయి ఉత్తమ చిత్రంగా అవార్డు అందకపోయినా తెలుగు సినిమా వన్నె ఏనాటికీ తగ్గలేదు. అంతేగాక తెలుగు సౌరభం గుబాళిస్తూనే ఉంది. అవార్డుల గురించి ఆలోచించకుండా ప్రేక్షకాదరణెళి పెద్ద అవార్డుగా తెలుగుచిత్రసీమ ఇంతకాలం ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించింది. అయితే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవాలన్న కల ఉన్నా అది నెరవేరడం లేదు. చివరికి మనకా అదృష్టం ఉందంటూ ‘బాహుబలి’ రూపంలో దూసుకుని వచ్చింది. రికార్డుల్లో ‘భళా’ అనిపించి.. వసూళ్లలో కనీవినీ ఎరుగని ప్రభంజనం సృష్టించడమే కాదు ఇప్పుడు మన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల్లో ‘బాహుబలి’ ఉత్తమ చిత్రంగా నిలవడం తెలుగు ప్రేక్షకులకు, సినీ అభిమానులకు నిజంగానే అద్భుతమైన అనుభూతే. తెలుగు సినిమా యావత్ సగర్వంగా తలెత్తుకొనే తరుణమిది. తెలుగు సినిమాకి ‘బాహుబలి’ చేసిన పట్టాభిషేకం ఇది. హిట్లు, సూపర్
హిట్లు, బ్లాక్‌బ్లస్టర్ విజయాలూ తెలుగు సినిమాకి కొత్త కాదు. ఏడాదికి నూట యాభైకి పైగానే చిత్రాలు, కాకలు తీరిన కథానాయకులు, దిగ్గజాల్లాంటి దర్శకులు, మేధావులైన నిర్మాతలు.. ఇలా ఎంతమంది ఉన్నా జాతీయ అవార్డుల్లో మాత్రం తెలుగు సినిమాపై చిన్నచూపు చూస్తూ వచ్చారు. తెలుగు మార్కెట్‌లో పదోవంతు చేయని చిన్నాచితకా భాషల చిత్రాలు సైతం ‘జాతీయ అవార్డులు’ ఎగరేసుకుపోతుంటే మనకు మాత్రం వెలితిగా అనిపించేది. అంటే జ్యూరి ఎంపికలో ఎక్కడో మనకు పొరపాటు జరుగతూ వచ్చింది. నిర్లిప్తంగా చూస్తుండిపోయేవాళ్లం. అవరోధాల్నీ, అవమానాల్ని దాటుకొంటూ ‘బాహుబలి’ స్వర్ణ కమలాన్ని సగర్వంగా అందుకుని తెలుగు సినిమా ఖ్యాతిని జాతికి పరిచయం చేసింది. ఏ కమర్షియల్ ఫార్ములాకి తీసపోకుండా రాజమౌళి పడిన కషా/-టానికి ఫలితం దక్కింది. ఆయన పడిన తపన కారణంగా న భూతో న భవిష్యత్ అన్నట్లుగా బాహుబలి తెరపైన ప్రత్యక్షమయ్యింది. ఇంతకన్నా గొప్ప సినిమా ఉండదన్న రీతిలో ఉంది కాబట్టే ఈ సారి జ్యూరీ సభ్యులు బాహుబలికి తలవంచక తప్పలేదు. పక్కా ప్రణాళికతో, అంతర్జాతీయ స్థాయిలో ఓ తెలుగు చిత్రాన్ని రాజమౌళి మలచిన తీరు అపూర్వం అనిపించింది. ఇంతటి మహత్తర చిత్రాన్ని గుర్తించనందుకు ముందుగా జ్యూరీకి వందనాలు. ఆలస్యంగా అయినా తెలుగు కీర్తికి దక్కిన అరుదైన గౌరవం ఇది. అందుకు మనమంతా గర్వపడాలి.