చీపురు పట్టిన ఫడ్నవీస్
ముంబై,సెప్టెంబర్ 3(జనంసాక్షి):మహారాష్ట్రలోని 50 నగరాలను అక్టోబర్ 2 నాటికి క్లీన్ సిటీలుగా మార్చుతామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. మహారాష్ట్రను స్వచ్ఛ నగరాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం ‘మహా క్లీనథాన్’కి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ముంబయిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్వయంగా చీపురు చేతబట్టిన ఫడణవిస్, అమితాబ్‌లు జేజే ఆసుపత్రి ప్రాంగణం, అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను ఏరివేశారు. శనివారం ముంబైలో నిర్వహించిన ‘డెటాల్ మహా క్లీనథాన్’ కార్యక్రమంలో ఆ కార్యక్రమ ప్రచారకర్త అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ విూడియాతో మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 7000 గ్రామాలు ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా మారాయని తెలిపారు. పరిశుభ్ర నగరాల విషయంలో ముందుండేలా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఆయన వెల్లడించారు. ఘన వ్యర్థాల మేనేజ్మెంట్ విషయంలో సైతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని ఫడ్నవిస్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేకపోతే పరిశుభ్రత సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం అన్నారు. డెటాల్ మహా క్లీనథాన్ కార్యక్రమంలో అమితాబ్, ఫడ్నవిస్ చీపుర్లు పట్టుకుని రోడ్లు శుభ్రపరిచారు. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో 50 స్వచ్ఛ నగరాలను తీర్చిదిద్దుతామన్నారు.అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. తాము ఇక్కడికి ప్రసంగాలు ఇచ్చేందుకు రాలేదని, స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటూ.. అవగాహన కల్పించేందుకే వచ్చామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ పాటుపడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ 10 గజాలు శుభ్రం చేసుకుంటే.. పూర్తి నగరం పరిశుభ్రమవుతుందని బిగ్‌బీ అన్నారు.