చెత్త ఊడ్చేవారే దేవుళ్లు

C

వారికి సెల్యూట్స్‌

పారిశుద్ధ కార్మికులు తల్లులకంటే తక్కువేంకాదు

సఫాయి కర్మచారులను గౌరవిద్దాం

స్వచ్ఛ హైదరాబాద్‌ను లాంఛనంగా ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మే16(జనంసాక్షి):

హైదరాబాద్‌లో చెత్తను ఊడ్చే వారే దేవుళ్లు.. హైదరాబాద్‌ పారిశుద్ధ్య కార్మికులకు సెల్యూట్‌ చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారు మనను కన్న తల్లులకు తక్కువేవిూ కాదన్నరు. హెచ్‌ఐసీసీలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘తల్లిదండ్రుల తర్వాత సఫాయి కర్మచారీలే గౌరవింపదగినవారు. పొద్దున లేస్తే సఫాయి కర్మచారీలకు సెల్యూట్‌ చేయాలి. రోజు చెత్తను ఊడ్చి హైదరాబాద్‌ నగరాన్ని శుభ్రపరుస్తున్న మున్సిపాలిటీ కార్మికులే మనకు దేవుళ్లు. వారి శ్రమను గుర్తిద్దాం.. స్వచ్ఛ హైదరాబాద్‌ ద్వారా వారికి వీలైనంత శ్రమ తగ్గిద్దాం అని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారతమే నిర్మలమైన భారతమని బాపూ మనకు చెప్పారు. బాపూ మాటలను స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టింది. నేడు మనం కూడా స్వచ్ఛ హైదరాబాద్‌ – స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం చేపట్టాం. ఒక మంచి కార్యక్రమం తలపెడితే భగవంతుడే దానికి బాటలు వేస్తడు అనేది ఇవాళ రుజువైందన్నారు.  స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో సరిపడ పౌర సదుపాయాలు లేకపోవడం బాధాకరం. ఎంతో గొప్ప నగరం ఉండాల్సిన స్థితిలో లేదు. హైదరాబాద్‌ నగరాన్ని అందరి భాగస్వామ్యంతో అందంగా తీర్చిదిద్దాలి. స్వచ్ఛ హైదరాబాద్‌లో అందరూ భాగస్వామ్యం కావాలి. ప్రజల్లో ఉన్న సంఘటిత శక్తి ఏంటో తెలియజెప్పాలి. వారిలో ఉన్న ఫైర్‌ ఏంటో తెలియచేయాలి. ప్రజలకు సంఘటిత శక్తిలోని మేలును గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం. బస్తీల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో ముందు వరుసలో నిల్చిన గవర్నర్‌ నరసింహన్‌కు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం నీతి ఆయోగ్‌తో మాట్లాడి రూ. 75 కోట్లు మంజూరు అయ్యేలా దత్తాత్రేయ కృషి చేశారని చెప్పారు. ఆదివారం ప్రజలు ఇళ్లల్లో ఉంటారు కాబట్టి స్వచ్ఛహైదరాబాద్‌ కార్యకలాపాలు రేపటి నుంచి ప్రారంభిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.ప్రజలంతా ఐక్యమైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియచెప్పాలని ఆకాంక్షించారు. స్వచ్ఛహైదరాబాద్‌కు కేంద్ర నుంచి నిధులు మంజూరు చేయించిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకుకేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రపంచంలోనే అరుదైన, రక్షణాత్మకమైన నగరమని.. భూకంపాలకు అతీతమైన నగరమని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో స్వచ్ఛ హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. స్వచ్ఛ హైదరాబాద్‌ నినాదం కాదని, ఒక విధానమని కేసీఆర్‌ పేర్కొన్నారు. గొప్ప నగరమైన హైదరాబాద్‌ అంత బాగా లేదన్న విషయం మనందరికీ తెలుసునన్నారు. భూకంపాలకు అతీతమైన నగరమైన హైదరాబాద్‌లో పౌర సదుపాయాలు మెరుగుపడాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మదాపూర్‌ హెచ్‌ఐసీసీలో గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. జ్యోతి ప్రజల్వన కార్యక్రమంలో గవర్నర్‌, సీఎంతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్‌ మధుసూదనాచారితో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో సిఎం ఎసిఆర్‌ స్వచ్ఛ హైదరాబాద్‌ లోగోను ఆవిస్కరించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్‌లో అందరూ పాల్గొనాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మదాపూర్‌ హెచ్‌ఐసీసీలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ఒక్క రోజు కార్యక్రమం కాదు.. నిరంతర పక్రియ అని స్పష్టం చేశారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ

హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్‌ స్వయంగా డిజైన్‌ చేశారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం నగరాన్ని 425 యూనిట్లుగా విభజించిందన్నారు. ప్రతి మెంటర్‌కి ఒక కిట్‌ ఇవ్వడం జరిగిందని, స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం కిట్‌లో సమాచారం ఉంచామని తెలిపారు. చెత్తపై సమరం మొదలైందన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌ ప్రాంతంలోని బస్తీలు, కాలనీల్లో వీరు పర్యటించి పారిశుద్ధ్య పనులు చేపడతారని అధికారులు తెలిపారు. మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్‌టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ, బాలకృష్ణ, వెంకటేశ్‌, జగపతిబాబు, రామ్‌చరణ్‌ తదితరులతోపాటు పలువురు నటులు  కూడా ఇందులో పాల్గొంటారని వారు పేర్కొన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా నగరాన్ని 425యూనిట్లుగా విభజించగా, ఒక్కో యూనిట్‌కు రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి సహా మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర అధికారులు, వివిధ విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలు నేతృత్వం వహించనున్నారు. పారిశుద్ధ్యం పనులే కాకుండా ఇతర సమస్యలను కూడా అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు.

గవర్నర్‌ నరసింహన్‌ సర్కిల్‌-10లోని ఆనంద్‌నగర్‌ యూనిట్‌ ప్యాట్రన్‌గా ఉంటారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కిల్‌-9లోని పార్సిగుట్ట ప్యాట్రన్‌గా వ్యవహరించనున్నారు.  ఇందులో 36వేలమందితో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  456మంది వీవీఐపీలు, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు,

1800మంది నోడల్‌ అధికారులు, బిల్‌కలెక్టర్లు, పోలీసు, వాటర్‌బోర్డు, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు ఉంటారు.  ఆరువేల మంది స్థానిక పౌరులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.  1200మంది తక్షణ మరమ్మతు బృందసభ్యులు, 400మంది మేస్త్రీలు, 800మంది లేబర్‌ అందుబాటులో ఉంటారు.

1061ఎస్‌ఎఫ్‌ఏలు, 23వేలమంది శానిటరీ వర్కర్లు , 2010ఐలా, కంటోన్మెంట్‌ అధికారులు

జేసీబీలు-34, డంపర్‌ ప్లేసర్లు-35, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా రోజువారీ కార్యాచరణ నివేదికల సమర్పణ చేస్తారు.  ప్రత్యేక ఆప్‌ ద్వారా స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాల నివేదిక  500మంది కళాకారుల ద్వారా ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు, విూడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేస్తారు.