చెన్నపట్నంల చూడర తమాషా..
కూలీల కాల్చివేతతో భగ్గుమంటున్న తమిళ తంబీలు
చెన్నైలో మాది తెలంగాణ అని చెప్పుకుంటున్న ఆంధ్రులు
హెరిటేజ్ సహా ఆంధ్రులపై భౌతికదాడులకు దిగుతున్న తమిళులు
తాము ఉచ్ఛరించటానికి ఇష్టపడని తెలంగాణ పదమే నేడు ఆంధ్రులకు రక్షణ కవచం
చెన్నై,ఏప్రిల్12(జనంసాక్షి): :
శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో 20 మంది తమిళనాడు కూలీలు మృతి చెందటంతో తమిళనాడు భగ్గుమంది. అమాయకులైన కూలీలను పొట్టనబెట్టుకున్నారని ఆంధ్రా పోలీసులు, ప్రభుత్వంపై తమిళనాట తీవ్ర విమర్శలు గుప్పుమన్నాయి. పొట్టకూటి కోసం కూలిపని చేసుకునేవారిని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారంటూ పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగాయి. పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పక్షాలు ఎన్‌కౌంటర్‌పై నిరసనలకు దిగాయి. పోలీసు కాల్పుల ఘటనకు నిరసనగా చెన్నైలోని ఆంధ్రా క్లబ్ ఎదుట తమిళనాడు కాంగ్రెస్ సహా పలు పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై బస్టాండు వద్ద ఆందోళనకు దిగిన నిరసనకారులు ఏపీ బస్సులను నిలిపివేశారు. ఐదు ఆంధ్ర బస్సులను ధ్వంసం చేశారు. కూలీల ప్రాణాలు బలిగొన్న ఆంధ్రులపై ప్రతీకారం తీర్చుకుంటామని తమిళర్ కచ్చి అనే సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలోని ఆంధ్రుల ఆస్థులపై, బ్యాంకులపై, వ్యాపార సంస్థలపై హోటళ్లపై దాడులు జరిగాయి. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై కోయంబేడు వద్ద 9 బస్సులపై ఆందోళనకారులు దాడిచేశారు. నెల్లూరు నుంచి చెన్నైకి వచ్చే బస్సులను అడ్డుకున్నారు. పలు బస్సులపై పెట్రోల్ బాంబులు విసిరారు. ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం సీరియస్‌గా స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖాస్త్రం సంధించారు. ఘటనపై తగు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఘటనపై నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని తిరువొట్రియూరులో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తమిళ పార్టీ ఎండీఎంకే నేత వైగో చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పలువురు ఆంధ్రులపై భౌతిక దాడులకు దిగారు. దీంతో బెదిరిపోతున్న ఆంద్రోళ్లు భౌతికదాడుల నుంచి తప్పించుకునేందుకు ”మాది తెలంగాణ” అని చెప్తున్నరు. ఇప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణికి చెందిన హెరిటేజ్ సూపర్ మార్కెట్‌పై దాడిచేసి బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక పలువురు మృతులు కుటుంబసభ్యులు శవాలతో రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైనే భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఆంధ్రులపై భౌతిక దాడులు పెరిగిపోయాయి. ఇక ఏంచేయాలో పాలుపోక చెన్నైలోని ఆంధ్రులంతా వాళ్లది తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 3లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.
ఇక మృతుల కుటుంబ సభ్యులు మాత్రం ఎన్‌కౌంటర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదో బూటకపు ఎన్‌కౌంటరని, బస్సులో ప్రయాణిస్తున్న వారిని కిందకు దించి మరీ చంపేశారని ఆరోపిస్తున్నారు. గొడ్డళ్లు, రాళ్లతో దాడికి ప్రయత్నించారని నిరూపించటానికి సాక్ష్యాధారాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక ఘటనాస్థలంలో దొరికిన దుంగలు తాజావి కాకపోవడం, పాతవి కావడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో ఇదో బూటకపు ఎన్‌కౌంటర్ అని నిర్ధారించుకున్న తమిళ తంబీలు ఏపీ సర్కారుపై, ఆంధ్రోళ్లపై గుర్రుగా ఉన్నారు. అందుకే భౌతిక దాడుల ఘటనలు జరుగుతున్నాయి. ఓ వైపు ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని తమిళులు వాదిస్తుంటే, మరోవైపు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులుగా ఆంధ్రా పోలీసులు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడు ఆంధ్రా, తమిళనాడు మధ్య మాత్రం పూడ్చలేని అగాధం ఏర్పడింది. చెన్నైలో ఆంధ్రులపై భౌతిక దాడులు జరగటం, మేం ఆంధ్రులం కాదు, తెలంగాణ వాళ్లం అని అక్కడ బతుకుతున్న ఆంధ్రోళ్లు చెప్పుకోవాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. ఏదేమైనా తాము ఉచ్ఛరించటానికి ఇష్టపడని తెలంగాణ అన్న పదం నేడు వారికి రక్షణ కవచంగా మారడం జరగాల్సిన పరిణామమే.