చెప్పులు


”అరే పోశాలు, ఈ చెప్పులు దొరింట్ల ఇచ్చుకుంట బడికి పోరా!” కొడుకు పోచయ్యతో చెప్పాడు భూమయ్య.భూమయ్య మోచీ.నలభై ఏళ్లుంటాయి. పూర్వం చెప్పులు తయారుచేసేవాడు. ఇప్పుడు మానే శాడు. మానేశాడు అనే బదులు తక్కువ చేశాడు అంటే బాగుం టుందేమో. హైదరాబాద్‌ నుంచి చెప్పులు తెచ్చి అమ్ముతున్నాండు. కొందరికి మాత్రం చెప్పులు తయారుచేసి ఇస్తూ ఉంటాడు. చెప్పులు తయారు చేసి చేసి అతని చేతులు నాడాల్లాగా మారిపోయినవి. నాలుగెకరాల వరి పోలం. బజార్లో చెప్పుల దుకాణం. ఇద్దరు బిడ్డ లు. ఒక కొడుకు. తన కొడుకు తనలాగా మోచీ కాకుండా బాగా చదువుకోవాలని పోచయ్యని చదివిస్తున్నాడు.పోచయ్యకి పదమూడు సంవత్సరాలుంటాయి. చురకైన కళ్లు. బక్కపల్చగా ఉంటాడు. ఎని మిదవ తరగతి చదువుతున్నాడు. ఎవరికైనా ఎందుకు లొంగి ఉం డాలనే మనస్తత్వం. చదువులో బాగానే ఉన్నాడు. స్కూలుకి పోయే తొందరలో ఉన్నాడు. గూట్లో నుంచి పుస్తకాలు తీసుకొంటూ తండ్రి మాట విని అతని వైపు చూశాడు. భూమయ్య చెప్పులని కాగితంలో చడుతున్నాడు.
”ఏంది నాయన నేను స్కూలుకి పోయ్యేటప్పుడు పని చెప్పుతవు. నువ్వు దుకాణమే పడ్తివి. అవసరం వున్నవాళ్ళు దుకాణానికి వచ్చి తీసుకొనిపోరా? మనమెందుకు వాళ్లింటిక పొయ్యి ఇవ్వాలి” ప్రశ్నించాడు తండ్రిని.కొడుకు ప్రశ్నకు ఆశ్యర్యపోయాడు భూమయ్య. అప్పుడప్పుడు కొడుకు ప్రశ్నలు అతన్ని ఆశ్యర్యపరు స్తుంటాయి. ఆలోచింపజేస్తుంటాయి. కొడుకు ప్రశ్నలో నిజ ముంది. దుకాణానికి వచ్చి వాళ్లు తీసుకపోవచ్చు. తన తండ్రి కాలం నుంచి ఊళ్లో దొరలందరి ఇండ్లకు వెళ్లి చెప్పులు ఇవ్వడం అలవాటైపోయింది. ఇ్వకపోతే ఏమిటీ? ఆలోచిస్తేనే భయ మేసింది.


”తొవ్వలనే గదరా! ఈ చెప్పులు దొర ఇంట్లో ఇచ్చుకుంట పోరాదు” మళ్లీ చెప్పాడు.
”ఇయ్యకపోతే ఏమైతది నాయిన. నువ్వు అన్నిటికి బుగులు పడతవు” అన్నాడు పోచయ్య పుస్తకాలని చేతిలోకి తీసుకొంటూ.
”పోశాలూ! నాలుగక్షరాలు రాంగనే నువ్వు గిట్ల మాట్లాడుతున్నావుగానీ, నీకు తెలియదురా దొరల సంగతి. అన్నీ మనసుల పెట్టుకుంటరు. ఎక్కన్నో చూసి తొక్కుతరు. నామాట విని ఇచ్చుకుంటూ పోరా!నువివ్వయ్యకపోతీఏ దుకాణం బంద్‌ జేసి నేనే ఇచ్చివస్తాను”
”ఏం జేస్తరు నాయినా?”
”ఏమైనా జేస్తరు. భూముల కాగితాలన్నీ గాళ్ల దగ్గర వుంటాయి చిడ్డా?మన భూములల్ల ఎవలిదన్నా ఖబ్జారాస్తే సరిపోదా!నీకివ్వన్ని సమజుగాదురా నా మాట విను” భూమయ్యకి లక్ష్మీనారాయణ గుర్తకొచ్చాడు. అతని భూమి గుర్తుకొచ్చింది. అతను ఎట్లా భూమి నుంచి బయటకు నెట్టివేయబడ్డాడో గుర్తొచ్చి భయమేసింది.తండ్రి మాటలు పోచయ్యకి అర్థం కాలేదు. తండ్రి భయంలో ఏదో నిజము ందనిపించింది. ఏమీ మాట్లాడకుండా చెప్పుల్ని కుడిచేతిలోకి తీసు కుని, ఎడమచేతిలో పుస్తకాలు పెట్టుకుని బయటికి నడిచా డు. పాముని కూడా చూసి భయపడని తండ్రి దొరికి భయపడ్డం అతని కి ఆశ్యర్యం వేసింది. ఆలోచిస్తూ మూల మలుపు దాటి దొర ఇం టివైపు దారి తీశాడు పోచయ్య. దొర ఇల్లు దాటే బడికి వెళ్లాలి. దొర ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా అక్కడి వాతావరణం వింతగా అన్పిస్తుంది. దొర పేరు రాంకిషన్‌రావు. అతను పట్వారీ. అతని అన్న జగన్మోహనరావు. అతను పటేల్‌. ఊరికి ఏ అధికారి వచ్చినా వాళ్లింటికి వెళ్లాల్సిందే. గిరిధావర్‌ నుంచి ఆర్డీవో వరకి, మోరీల్‌ సాబ్‌ నుంచి డియస్సీ దాక అందరూ అక్కడే మాకాం. సర్పంచ్‌ కూడా వాళ్ల మనిషే. ఆలోచిస్తూ మెయిన్‌రోడ్డు మీదకొచ్చా డు పోచయ్య. తన క్లాస్‌ పిల్లలందరూ స్కూలుకి పోతున్నారు. చెప్పు లిచ్చి స్కూలుకి వెళ్లే సరికి రెండో బెల్‌ అయిపోతుందేమో. తండ్రి మీద కోపమొచ్చింది పోచయ్యకి.ఊళ్లో ముందటి పరిస్థితులు లేవు. హరిజనులు వెనుకబడ్డ తరగతుల వాళ్ళు అందరూ చదువుకొంటు న్నారు. అయినా ఊరి మీద రాంకి షన్‌రావు కుటుంబం పట్టు ఇంకా పోలేదు.దొర ఇంటి వద్దకొచ్చాడు పోచయ్య. ముందు పెద్ద పాటాకు. లోపల ఇల్లు. ఇంటి ముందు గూర్ఖాల్లాగా ఇద్దరు సుంకర్లు కూర్చొని ఉన్నారు. బీడిలు కాలు స్తూ ఏదో ముచ్చట్లు పెట్టుకొం టున్నారు. పోచయ్య అక్కడికి వచ్చి కోర్టు ముందు ఖైదీలా నిల్చు న్నాడు.
”ఏమిరా పిల్లగా ఎటో వచ్చినవు” అన్నాడు ఓ సుంకరి. ఒరిసె లాం టి ఆయుధం అతని పక్కన ఉన్న ది.
”దొరకి చెప్పులు ఇయ్యమన్నడు మా అయ్య. అవి తెచ్చిన” సమాధానమిచ్చాడు పోచయ్య, చేతిలోని చెప్పులను చూపిస్తూ.
”ఉండు దొర ఏం జేస్తున్నడో చూసి వస్తా” లేస్తూ అన్నాడు సుంకరి.
”నువ్వు ఇచ్చేయ్యరాదు. నేను స్కూలుకి పోవాలే” చెప్పులు అతనిక్విబోతు పోచయ్య అన్నాడు.
”ఏమిరో పొగరా, నీకు పైత్యమున్నట్టుంది దొరకి చెప్పులు ఇవ్వకుండానే పోతావా! సదివినవు తీ వుండుండు” అంటూ లోపలికి పోయిండు సుంకరి.ఏం చెయ్యాలో తోచలేదు పోచయ్యకి. అట్లాగే నిల్చున్నాడు. కాళ్లు పీకుతున్నాయి. ఆరోజు క్లాసు పోతుం దని బాధగా ఉంది. తండ్రి మీద, దొర మీద కోపమొచ్చింది. ఏమీ చెయ్యలేక అట్లాగే నిల్చున్నాడు.
అరగంట గడిచింది.
”కొంచం చూసి రారాదు. నేను బడికి బోవాలె” సుంకరితో అన్నాడు పోచయ్య.
సుంకరి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు. అతనివైపు ఆత్రుతగా చూశాడు పోచయ్య.
”రా!రా! పొల్లగా, దొర కచేరిల కొచ్చిండు” అంటూ లోపలికి దారి తీసిండు సుంకరి. అతని వెంట నడిచాడు పోచయ్య పుస్తకాలని చెప్పులని పట్టుకొని ఒక చేత్తో నిక్కరును సవరించుకొన్నాడు. గుబు లు గుఉలుగా అన్పించింది. హోమ్‌వర్క్‌ చేయనప్పుడు కూడా అలా అన్పించలేదు.
పాటాకు దాటి లోపలికి పోయినారు. పడగలాగా కన్పించింది లోపల బంగ్లా. పెద్ద దర్వాజా దాటి కచేరి దగ్గరికి పోయినారు. మడత కుర్చీలో కూర్చొని ఉన్నాడు రాంకిషన్‌రావు ముప్పై అయి దు దాటి ఉంటాయి. మనిషి సాత్వికంగానే ఉన్నాడు.
”ఎందా పోల్లగా మీ అయ్య రాలేదా? నీతిని పంపిండు” అన్నాడు దొర.
”రాలేదయ్యా” అంటూ చెప్పులు దొర కాళ్ల దగ్గర పెట్టిండు పోచయ్య.
దొర కుర్చీ నుంచి లేచి చెప్పులు వేసుకున్నాడు అటూ ఇటూ నడిచి చూశాడు.
”కొంచెం కుత్తెమయినయిరా పొల్లగా తీస్కపోయి వొదలు చేయించుకు రా”
పోచయ్య దొర దగ్గరి నుంచి చెప్పులు తీసుకొన్నాడు. కాగితంలో చుట్టుకొని సుంకరితో పాటు బయటికి వచ్చాడు. బడికి పోలేడు. తండ్రి మీద కోపమొచ్చింది. చెప్పులతో బాటూ ఇంటి మొఖం పట్టాడు.పది సంవత్సరాలు గడిచి పోయాయి. ఈ పదేళ్ల కాలంలో ఊళ్లలోకి అన్నలొచ్చింరు. రాంకిషన్‌రావు పట్వారీతనం పోయింది. దొరతనం పోయింది. ఆయన భూములన్నీ పడావుపడ్డాయి. అ మ్ముకోవడానికి అవకాశం లేదు. ఊళ్లో ఉండే పరిస్థితి అంతకన్నా లేదు. ఊరు వదిలి కరీంనగర్‌ జేరిండు. ఈ పదేళ్ల కాలంలో పోచ య్య డిగ్రీ చదువైపోయింది. కాంపిటిటివ్‌ పరీక్షలు రాశాడు. ఎమ్మార్వో అయ్యాడు.క్లాక్‌ టవర్‌ పక్కన ఓ పెద్ద చెప్పుల షాప్‌. దాన్నిండా రకరకాల చెప్పులు. సాయంత్రం ఏడవుతోంది. రష్‌గా ఉండి ముగ్గురు సేల్స్‌మెన్స్‌ కస్టమర్లకి హాజరవుతున్నా, ఇంకా కొంతమంది యజమానిని ఏదో అడుగుతున్నారు. అతను వచ్చి వాళ్లకు చెప్పులు చూపిస్తున్నాడు. అవి నచ్చకపోతే వేరే మాడల్స్‌ చూపిస్తున్నాడు. ప్పుడే పోచయ్య జీపులోక్లాక్‌టవర్‌ వద్దకొచ్చాడు చెప్పులు కొనుక్కోవడానికి. రోడ్డు పక్కన జీప్‌ ఆపి షాపులోకి వచ్చా డు. ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఎవరో కస్టమర్‌కి చెప్పులు తొడుగుతున్న యజమాని పోచయ్యని గుర్తుపట్టి కౌంటర్‌ వద్దకి వెళ్లిపోయాడు. పోచయ్యకూడా అతన్ని గుర్తుపట్టాడు. ఆశ్చర్య పోయాడు. అతను రాంకిషన్‌రావు. ‘ఎలాంటి మనిషి ఎలా అయిపో య్యాడు!’ అనుకొన్నాడు.పోచయ్య చెప్పులు సెలక్టు చేసుకొని కౌం టర్‌ దగ్గరకొచ్చాడు బిల్‌ కట్టడానికి.
”ఎంరా పోచయ్య ఇప్పుడు ఇక్కడే ఎమ్మార్వోగా పని చేస్తున్నావట కదా!” అన్నాడు. రాంకిషన్‌రావు పోచయ్య దగ్గరి నుంచి డబ్బులు తీసుకొంటూ. రాంకిషన్‌రావు పలకిరింపుతో పోచయ్య గుండె కలుక్కుమంది. తను రాగానే కట్టమర్‌కి చెప్పులు చూపిస్తున్న రాంకిషన్‌రావు కౌంటర్‌ దగ్గరికి వెళ్లిపోవడం యాదృశ్చికంగా జరిగింది కాదు. అప్పటివరకు మర్చిపోయిన తన కులం గుర్తుకు వచ్చింది పోచయ్యకి. వృత్తులు మారిపోయినవి. తమ వృత్తి రాంకిషన్‌రావు చేస్తున్నాడు. అతని వృత్తి తను చేస్తున్నాడు. 30 గ్రామలకు తను అధికారి అయినప్పటికీ రాంకిషన్‌ ప్రవర్తన తన పట్ల మారలేదు. అతని వృత్తి మారింది. ప్రవృత్తి మారలేదు. చెప్పు లు తీసుకొని బయటకు నడిచాడు పోచయ్య.