చేనేతకు మోదీ మరణశాసనం

` జీఎస్టీ ఎత్తేయాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ఉద్యమం
` మంత్రి కేటీఆర్‌ మరో వినూత్న పోరాటం
హైదరాబాద్‌(జనంసాక్షి):చేనేత ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, నేతన్నల ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిన్న పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ ఇవాళ ఆన్‌లైన్‌ పిటిషన్‌ మొదలు పెట్టారు.చేనేత కార్మికుల జీవితాన్ని కాపాడేందుకు, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు చేనేత ఉత్పత్తులపై వస్తు, సేవల పన్నుని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మంత్రి కేటీఆర్‌ ఛేంజ్‌ డాట్‌ ఆర్గ్‌లో ఆన్‌లైన్‌ పిటిషన్‌ మొదలు పెట్టారు. చేనేతరంగం అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటని.. గ్రావిూణ, పాక్షిక గ్రావిూణ జీవనోపాధిల్లో అంతర్భాగమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారత దేశంలో చేనేత రంగం కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో కొట్టుమిట్టాడుతోందని, ఈ క్రమంలో పన్నును పెంచే ఏ చర్య అయినా ఆ రంగానికి మరణ మృదంగం మోగిస్తుందని అన్నారు.

(కార్పొరేట్‌ కమలం కావాలా..?
గరీబోడి గులాబీ కావాలా?
` దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమపథకాలు
` గట్టుప్పల్‌ రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌ )
రంగారెడ్డి(జనంసాక్షి):నేతన్నల సమస్యల గురించి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2018లో రాజగోపాల్‌ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు ప్రజలను మోసం చేసిండు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీజేపీతో అంటకాగిండు. డబ్బులు పంచి ఉప ఎన్నికలో గెలవాలని రాజగోపాల్‌ రెడ్డి భావిస్తున్నడని మండిపడ్డారు. మునుగోడులో పంచేందుకు గుజరాత్‌ నుంచి డబ్బులు తెస్తున్నరన్నారు.మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. గతంలో మునుగోడు ప్రాంతంలో పరిస్థితి ఎంట్ల ఉందో గుర్తు తెచ్చుకోండి. మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ పాపం గత పాలకులదే. ఉద్యమసమయంలోనే మునుగోడుకు వచ్చి ఫ్లోరోసిస్‌ బాధితుల బాధలు చూసిన. మునుగోడు నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టినం. ఫ్లోరోసిస్‌ మట్టుబెట్టి ఇంటింటికి మంచినీరు ఇస్తున్నాం. కూసుకుంట్లను గెలిపించండి..మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తమన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోవర్ట్‌ రాజకీయాలు చేస్తున్నారు. మునుగోడు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలుపలేదు. మళ్లీ ఇవాళ డబ్బులతో గెలిచేందుకు రాజగోపాల్‌ రెడ్డి యత్నిస్తున్నాడని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రూ.18 వేల కోట్ల రూపాయలకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన్రని మండిపడ్డారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి మునుగోడు తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో కార్పొరేట్‌ కమలం గెలవాల్నా.. గరీబోళ్ల గులాబీ గెలవాల్నా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా..? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇప్పటివరకు 50 వేల వరకున్న రైతు రుణాలు మాఫీ చేసినం. త్వరలో మిగతా రుణాలు మాఫీ చేస్తం. మోదీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. పెట్రోలో, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచేశారు. రాజగోపాల్‌ రెడ్డికి ఓటేస్తే సిలిండర్‌ ధరను రెండు వేలు చేస్తడన్నారు.గట్టుప్పల్‌ ను కొత్త మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్‌ షోకు తరలివచ్చారు.  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

(గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తాం: మంత్రి కేటీఆర్‌ )
రంగారెడ్డి(జనంసాక్షి):ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ కుల వృత్తులను బలోపేతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మంత్రి.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నదని చెప్పారు. ప్రతి కులవృత్తికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. వైన్‌ షాపుల్లో గీత కార్మికులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అదేవిధంగా గౌడన్నలకు చెట్ల పన్నును రద్దు చేశామని, కల్లు డిపోలను తెరిపించి గౌడన్నలకు అండగా నిలిచామని, చెట్ల పన్నును రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెన్షన్లను రూ.200 నుంచి రూ.2016కు పెంచామని, గీత కార్మికులకు కూడా నెల రూ.2016 పెన్షన్‌ ఇస్తున్నామని, ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామని తెలిపారు. గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తామని ఆయన హావిూ ఇచ్చారు.అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కానీ కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్‌ కటకట ఉండేదని, సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో కరెంట్‌ సమస్య పరిష్కారమైందని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని, ప్రాజెక్టులు, ఉచిత కరెంటుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని మంత్రి చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగు నీరు అందించామని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, 975 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులను చేస్తున్నామని ఆయన చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రతి గ్రామంలో నర్సరీ, ట్రాక్టర్‌, నీళ్లు, కరెంటు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌, మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.