చేవ చచ్చిన కేంద్రమంత్రులు

విభజన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాల్సి ఉందన్న ధ్యాస కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి లేకుండా పోతోంది. అనేకానేక సమస్యలు ఉన్నా వాటిని ఎందుకనో చూసీచూడనట్లుగా ఉండడం బిజెపి నేతలు అలవాటు చేసుకున్నారు. పూర్తిగా మొద్దుబారి పో యారు. ఆందోళనలు చేస్తున్నా  పట్టించుకోవడం లేదు. ఇందులో కృష్ణాజజలాల పంపిణీ, హైకో ర్టు విభజన వంటి సమస్యలు మళ్లీ తాజాగా అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీ గడప దొక్కినా తక్షణంగా నివారించే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర జలవనరుల శాఖమంత్రిగా ఉన్న ఉమాభారతి, న్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానందగౌడలు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయారు. వారిలో ఏ మాత్రం చలనం లేదా చొరవ లేదా చురుకుదనం కానరావడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించాలి అన్న సంకల్పం కనిపించడం లేదు. రెండేళ్లుగా ఈ రెండు శాఖల మంత్రులు తీసుకున్న నిర్ణయాలు ఏమో కానీ రెండు తెలుగు రాస్ట్రాలకు సంబంధంచి మాత్రం శూన్యహస్తా లుగా ఉన్నాయి. ఇలాంటి మంత్రులు ఉంటే బిజెపి నావ ఎలా నడుస్తుందో మోడీ గుర్తించాలి. మాటలతో కాకుండా చేతలతో చూపించాల్సిన మంత్రులు అసలు సమస్యలపై అధ్యయనం చేయడం లేదు. రెండేళ్ల పాలన అమోఘం అంటూ జబ్బలు చరుచుకుంటున్న బిజెపి నేతలు సిగ్గుతో తలదించుకోవాలి. రెండు రాష్టాల్ర విభజన సమస్యలను పరిష్కరించలేని వారు దేశ సమస్యలను ఏ విధందంగా పరిష్కరిస్తారో తెలుసుకోవాలి. నదీజలాల విధానం రూపొందిం చడంలో, ఇరురాష్టాల్ర మధ్య ఉన్ననీటి పంచాయితీలను అదుపు చేయడంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి పూర్తిగా విఫలమయ్యారు. ఆమె సన్యాసిగా ఉండి కూడా సమస్యలను పట్టించుకోకపోవడం ద్వారా తాత్విక చింతన పొందుతున్నట్లుగా ఉన్నారు. ఇక కృష్ణానీటి వ్యవహారమే తీసుకుంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా కర్నాటకతో పేచీ ఉండేది. ఆల్మట్టి ,నారాయణపూర్‌తో పాటు అనేకానేక ప్రాజెక్టులు కట్టి ఎపికి చుక్కనీరు రాకుండా అడ్డుకున్నారు. ఆనాడు ఏలికగా ఉన్న చంద్రబాబు ఇప్పటిలా పోరాడి ఉంటే కర్నాటక ఆనకట్టలకు అడ్డుకట్ట పడేది. కానీ అలా చేయకుండా రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు తెలంగాణతో నీటి కయ్యాలకు దిగుతున్నారు. అలాకాకుండా ఇరురాష్టాల్రు సమస్యను కేంద్రం దాకా తీసుకెళ్లకుండా కూర్చుని చర్చించి ఉన్నా బాగుండేది. కానీ సమస్య ఇప్పుడు కేంద్రం వద్దకు వెల్లింది. ఇప్పటికే విభజన సమస్యలను పక్కన పెట్టిన కేంద్రం దీనిని పరిష్కరిస్తుందన్న  నమ్మకం లేదు. కృష్ణా బోర్డుకు నీటిని రెగ్యులేట్‌ చేసే అధికారం మాత్రమే ఉందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఉమాభారతి దృష్టికి తీసుకుని వచ్చారు.  డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే అధికారం బోర్డుకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు.నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు డ్రాఫ్ట్‌నోటిఫికేషన్‌ పంపించిందన్నారు. డ్రాప్ట్‌నోటిఫికేషన్‌ చట్ట వ్యతిరేకమని కేంద్ర మంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 800 టీఎంసీల నీటిని కేటాయించడం జరిగిందన్నారు. సీమాంధ్రకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని, నీటి కేటాయింపులపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రెబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో కృష్ణాబోర్డు నీటి కేటాయింపుల పరిధిపై నోటిఫికేషన్‌ ఇవ్వడం సరి కాదని, నీటి కేటాయింపులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం రివర్‌ బోర్డు కార్యదర్శి ఆర్కేగుప్తాను ఆ పదవి నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరినట్లు సమాచారం. ఇరు తెలుగు రాష్టాల్రు ఎవరికి వారుగా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్న తరుణంలో బోర్డు కార్యదర్శి ఆర్కే గుప్తా రెండు రాష్టాల్ర  మధ్య విభేదాలు సృష్టించినట్లు హరీశ్‌రావు బృందం ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణా ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా అక్రమంగా నిర్మించడంలేదన్న విషయాన్ని ఉమాభారతికి హరీశ్‌రావు వివరించారు. ఇక హైకోర్టు విభజనపై రెండేళ్లుగా సమస్యను నాన్చుతూ వస్తున్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. దీనిపై కనీసంగా చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. ఇదిలావుంటే ఆంధ్ర ప్రాంత జడ్జిలు ఆప్షన్‌ వెనక్కి తీసుకుని తెలంగాణ జడ్జిలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు నిరసన బాట పట్టారు. సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. ఆంధ్ర ప్రాంత జడ్జిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలోని జడ్జిల ఖాళీలను తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులతోనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర జడ్జిలు తమ నిర్ణయం మార్చుకోకపోతే ఈ నెల 7 నుంచి ఆంధ్ర ప్రాంత జడ్జిల ఆధ్వర్యంలో కొనసాగుతున్న న్యాయస్థానాల్లోకి ఉద్యోగులను, కిక్షదారులను వెళ్లనీయకుండా కోర్టు కార్యకలాపాలను స్తంభింపజేస్తామన్నారు. సానుకూల స్పందన రాకపోతే 13న చలో హైకోర్టు చేపడతామని హెచ్చరించారు. ఇదంతా కేవలం హైకోర్టు విభజన జరపకపోవడం,  సమస్యలను పరిష్కరించే చొరవచూపకపోవడం వల్లనే అని కేంద్రానికి తెలుసు. కానీ సమస్య లను పరిష్కరించాలన్న సంకల్పం కేంద్ర నాయకత్వంలో లేకపోవడం, పక్షపాతంగా ఉండడం వంటి అనేకానేక కారణా కారణంగా ఈ సమస్యలు రాజుకుంటున్నాయి. గతానికి భిన్నంగా పాలన సాగిస్తున్నా మన్న మోడీ టీమ్‌ అలసత్వంలో కూరుకుని పోయిందనడానికి విభజన సమస్యలు చాలు. ఈ రెండు సమమస్యలను పరిష్కరించే చొరవ చూపితే మంత్రులుగా ఉమాభారతి, సదానంద గౌడ సక్సెస్‌ అయినట్లే. కానీ అలా జరగుతుందని భావిస్తే అత్యాశే అవుతుంది.