జగన్ వైపు వలస నేతల చూపు!
2014 లక్ష్యంగా కప్పదాట్లకు సిద్ధం
హైదరాబాద్, జూలై 6 (జనంసాక్షి): కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్ సీపీ వైపు వలసలు ప్రారంభమయ్యాయా ? అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల తరువాత రెండు రోజుల పాటు ప్రశాంతంగా కనిపించిన రాజకీయ వాతావరణం ఆ తరువాత ఒక్కసారిగా వేడిక్కింది. ఉప ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నేతలు తమ వైపు భారీగా వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే మొదట రాజకీయ వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో అవన్నీ వట్టి మాటలే కావొచ్చునని కొట్టి పారేశారు. అయితే మూడు రోజులుగా రాజకీయ వాతావరణం మాత్రం మరోసారి వేడెక్కింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ని వరుసగా నేతలు కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు ముప్పయ్యేళ్లుగా నమ్మకమైన మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కలవడం జగన్‌ను కలిశారు. విషయం పక్కన పెడితే ఆ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని చెబుతూనే ఈ మధ్యలో ఏమైనా అయితే తమను బాధ్యులను చేయవద్దన్నారు. అంటే ఒక వేళ భవిష్యత్తులో టీడీపీకాని, టీఆర్‌ఎస్‌తో కలిసి వైఎస్సార్ సీపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎంఐఎం ఈసారి మద్దతిచ్చేది అనుమానమే అని అంటున్నారు. ఆరు నెలల క్రితం టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎంఐఎం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేసినప్పటికీ ఆ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ అక్బరుద్దీన్ విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు జగన్‌ను అసదుద్దీన్ కలవడం వారి వైపు వెళ్లే ఆస్కారం ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని నిత్యం టార్గెట్ చేసిన స్వర్గీయ పి.జనార్దన్‌రెడ్డి తనయ విజయారెడ్డి కూడా జగన్‌ను కలిశారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన తండ్రి మృతి అనంతరం వైఎస్ తమను బాగా ప్రోత్సహించారని, తనను రాజకీయాలలోకి ఆహ్వానించారని, అయితే తాను సమయం చూసుకుని వస్తానని చెప్పానని వివరించారు. ఈ నేపథ్యంలో విజయారెడ్డి 2014లో జగన్ పార్టీ తరుఫున పోటీకి సంసిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు జగన్‌ను ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయి నేతలు కలవక పోయినప్పటికీ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో క్రమంగా వారు కూడా జగన్ పంచన చేరే అవకాశం ఉందని అంటున్నారు. జగన్‌ను కలిసిన అనంతరం వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ తమ పార్టీలోకి టీడీపీ, కాంగ్రెస్ నుంచి వలసలు త్వరలో ప్రారంభమవుతాయని మరోసారి చెప్పారు. ఇప్పటికే జగన్ పార్టీతో నిత్యం టీడీపీకి చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో జగన్ వైపు మొగ్గి ఆ తరువాత వివిధ కారణాల రీత్యా కాంగ్రెస్‌లోనే ఉండిపోయిన పలువురు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల ఫలితాలు జగన్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో వారు మళ్లీ పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, నీరజారెడ్డి, ఖమ్మం జిల్లాలో కుంజా సత్యవతి ఇలా తదితరులు గతంలో జగన్ వైపునకు వెళ్లి ఆ తరువాత యూ టర్న్ తీసుకున్నారు. జగన్ పార్టీ ఘన విజయంతో పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ జగన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు తదితర జిల్లాలలో నేతలు వైఎస్సార్ సీపీ వైపు వెళ్లేందుకు గోడ మీది పిల్లుల్లా చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, మరో సంవత్సరంన్నర పదవులు ఉండటంతో జంప్ అవుదామనుకుంటున్న నేతలు ప్రస్తుతం మిన్నకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వం పడిపోయేపరిస్థితి వస్తే మాత్రం పలు జిల్లాల నుంచి చాలా మంది నేతలు జగన్ పార్టీ వైపు కచ్చితంగా క్యూ కడతారనే ప్రచారం జరుగుతోంది. నేతలు అందరూ 2014 లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే వీరిని ఎలా అడ్డుకోవాలా అని ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నట్టుగా సమాచారం.