జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం

3

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి22(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వారికి హెల్త్‌ కార్డులు జారీ చేస్తున్నామని  శాసనమండలిలో ఆయన వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం 20 కోట్లు విడుదల చేశామన్నారు. జర్నలిస్టుల ఫండ్‌ కోసం మొత్తం వంద కోట్లు కేటాయించామన్నారు. హెల్త్‌ కార్డులు తీసుకున్న జర్నలిస్టులకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. జర్నలిస్టుల ఇండ్ల కోసం బుద్వేల్‌లో స్థల పరిశీలన చేశామన్నారు. జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులకు కూడా హెల్త్‌ కార్డులు వర్తిస్తాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 2556 అక్రిడేషన్‌ కార్డులు, జిల్లాల్లో 11,831 అక్రిడేషన్‌ కార్డులను ఇచ్చామన్నారు. జిల్లాల్లో ఉన్న జర్నలిస్టులకు కూడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయిస్తామన్నారు. హౌజింగ్‌ సొసైటీ కోసం రూ.2 లక్షలు కట్టిన జర్నలిస్టులకు ఆ డబ్బును రిఫండ్‌ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జర్నలిస్టుల హెల్త్‌ కార్డులు పనిచేయడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ మాట వాస్తవమే అని కేటీఆర్‌ అంగీకరించారు. అయితే మరో రెండు నెలల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులతో సమావేశం నిర్వహించి ఆ అంశాన్ని కూడా స్పష్టం చేస్తామని మంత్రి వివరించారు.