జల్లెడ పడుతున్న పోలీసులు

2
అనుక్షణం అప్రమత్తత, సమన్వయం

కొడుకు శవం కోసం వచ్చిన మిలిటెంట్‌ తండ్రి

అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌6(జనంసాక్షి): మరో ముగ్గురి సిమీ ఉగ్రవాదులు జిల్లాలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో సోమవారం కూడా పోలీసుల తనిఖీలు కొనసాగాయి. ఆరు బృందాలుగా విడిపోయిన పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. అర్వపల్లి, దర్గ సవిూపంలో రెండు సెల్‌ఫోన్లు, ఒక బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేటలో ఎస్‌ఐబి, ఎన్‌ఐఏ, ఏటిఎఫ్‌ బృందాలు మకాం వేశాయి. మరోవైపు పోలీస్‌ ఉన్నతాధికారులతో డిజిపి సమావేశమయ్యారు. మరోవైపు ఉగ్రవాదు సృష్టించిన బీభత్సం నుంచి స్థానికులు తేరుకోలేకపోతున్నారు. ఎటువైపు నుంచి ఎవరు వస్తారో తెలియక బిక్కు బిక్కు మంటున్నారు. తప్పించుకున్న మరో ముగ్గురి కోసం పోలీసులతోపాటు నిఘావర్గాలు నల్గొండ జిల్లాను జ్లలెడపడుతున్నాయి. సీతారాంపురం నుంచి శనివారం తెల్లవారుజామున బయలుదేరిన సిమి ఉగ్రవాదులు ఆటోలో అర్వపల్లికి చేరినట్లు పోలీసులకు కీలకమైన సమాచారం అందింది. ఆ ఆటో ఎవరిదో ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు అస్లామ్‌ అయూబ్‌, మహ్మద్‌ ఎజాజుద్దీన్‌ల మృతదేహాలను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఏటీఎస్‌ బృందం ఆదివారం నార్కట్‌పల్లి ఆసుపత్రిలోని శవాలను పరిశీలించి వారి వేలిముద్రలను సేకరించింది. సిమి కార్యకర్తలుగా నిర్దారించడంతో పాటు పేర్లను కూడా ప్రకటించింది.  ఎన్‌కౌంటర్‌లో అస్లామ్‌ అయూబ్‌తో పాటు జాకీర్‌ బదరుల్‌ హతమయ్యాడని పోలీసులు భావించారు. కానీ, జాకీర్‌ బతికే ఉన్నాడని.. మహ్మద్‌ ఎజాజుద్దీన్‌ మృతిచెందాడని ఏటీఎస్‌ బృందం ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ బృందం.. సూర్యాపేట బస్టాండుకు కూడా వెళ్లింది. ఈ నెల 1న అర్ధరాత్రి తాండూరు- గుడివాడ బస్సు ఆగిన ప్రదేశం, కాల్పులు జరిగిన ప్రదేశం, కాల్పులు ఎలా జరిగాయి? సంఘటనా స్థలం నుంచి తీవ్రవాదులు ఎలా పారిపోయారు? అనే అంశాలను పరిశీలించారు. ఇక డీజీపీ అనురాగ్‌ శర్మ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో అడిషనల్‌ డీజీ ఎల్‌అండ్‌ఓ సుదీప్‌ లక్తాకియ, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌, ఐజీ సజ్జనార్‌ పాల్గొన్నారు. డీజీపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సూర్యాపేట కాల్పుల ఘటన, జానకీపురం ఎన్‌కౌంటర్‌, కూంబింగ్‌ అంశాలపై చర్చించారు. నల్లగొండ జిల్లాలో గ్రేహౌండ్స్‌ బలగాలు, పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నరు.

మరోవైపు నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో మృతి చెందిన ఎండీ ఎజాజ్‌ మృతదేహాన్ని తీసుకువెళ్లేందకు అతని తండ్రి అజీజుద్దీన్‌ నల్గొండకు చేరుకున్నాడు. సోమవారం మధ్యప్రదేశ్‌ పోలీసులతో కలిసి వచ్చిన అజీజూద్దీన్‌ నార్కట్‌ పల్లి కామినేని ఆస్పత్రికి చేరుకున్నాడు. తన కుమారుడి మృతదేహాన్ని ఇస్తే దహన సంస్కారాలు నిర్వహించుకుంటామని అన్నాడు. ఈ మేరకు నల్లగొండ డిఎస్పీని కలిసి వినతి చేశాడు.  ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు దుండగులను  మధ్య ప్రదేశ్‌కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ ‘సిమి’ ఉగ్రవాదులు ఎండీ ఎజాజుద్దీన్‌, ఎండీ అస్లం అలియాస్‌ బిలాల్‌గా పోలీసులు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.  ఉగ్రవాది అబు ఫైజైల్‌ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు, హత్యలు, బ్యాంకు దోపిడీలకు పాల్పడిన ఆరుగురి ముఠాలో వీరిద్దరు సభ్యులుగా ఉన్నట్లు నిర్ధారించారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో గత బుధవారం అర్ధరాత్రి కాల్పులకు తెగబడి రెండు రోజులపాటు తప్పించుకుని తిరిగిన దుండగులు శనివారం ఉదయం ఆత్మకూరు(ఎం) మండలం జానకీపురం వద్ద ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడ్డారు.