జాట్ల రిజర్వేషన్లకు హర్యానా అసెంబ్లీ ఆమోదం

2

చండీగఢ్‌,మార్చి29(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే జాట్‌ల రిజర్వేషన్‌ బిల్లును హర్యాణా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.  హర్యాణా మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం  అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని జాట్‌ వర్గీయులు తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ హావిూతో ఆందోళన విరమించినా ఎటువంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో తిరిగి ఆందోళనకు దిగుతామని ఉద్యమ నేతలు ఆదివారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జాట్‌ రిజర్వేషన్‌ బిల్లుకి ఆ రాష్ట్ర కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. త నెలలో జాట్‌ల ఆందోళనల వల్ల ఎన్నో ప్రభుత్వ

ఆస్తులు ధ్వంసమయ్యాయి. తీవ్ర ఆస్తినష్టం జరిగింది. రైల్వేకి, స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లింది. ఆందోళన సెగ దిల్లీకి కూడా తగిలింది. ఆందోళనకారులు దిల్లీకి నీటి సరఫరా చేసే కెనాల్‌ను మూసివేయడంతో రెండు రోజులపాటు నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొంది. మొత్తానికి ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న హావిూని నిలబెట్టుకుంది. విద్యా, ఉద్యోగరంగాల్లో జాట్లు సహా మరో ఐదు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో జాట్లకు బీసీ జాబితాలోనే మరో కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించే అంశానికి పూర్తి ఆమోదం లభించింది. జాట్‌, సిక్కు జాట్‌, రాడ్‌, మౌలా జాట్‌, త్యాగి, బిష్ణోయ్‌ కులాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ బిల్లును ఆమెదించింది. మంగళవారంనాడు అసెంబ్లీ ఈ  బిల్లును ఆమోదించింది. రాష్ట్ర  బడ్జెట్‌ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఈ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పొందింది.  దీంతో జాట్‌ వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కాగా ఏప్రిల్‌ 3లోగా తమను బీసీజాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు డెడ్‌ లైన్‌ విధించడంతో ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేసింది.