జామై నిజామియా వర్సిటీ నిర్లక్ష్యం

3

పూర్వవైభవం తీసుకొస్తాం..సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి20(జనంసాక్షి): హైదరాబాద్‌ లోని జామై నిజామియా వర్సిటీకి పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వర్సిటీ వ్యవస్థాపకుడు హజ్రత్‌ మౌలానా శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచంలో కైరో యూనివర్సిటీ తర్వాత అరబిక్‌ నేర్చుకోవడానికి ఉత్తమమైంది హైదరాబాద్‌ జామై యూనివర్సిటీనే అని ముఖ్యమంత్రి కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఈ ఉత్సవాలకు రాలేదని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. జామై నిజామియాలో రూ. 9.60 కోట్లతో ఆడిటోరియం నిర్మిస్తామని ఆయన ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు.

ఎన్నో పోరాటాల తర్వాత రాష్ట్రం సిద్ధించిందని, అల్లా దయతో బంగారు తెలంగాణను నిర్మించుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోని రెండు ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రానిది గంగా జమున సంస్కృతి అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌ సంస్కృతికి పూర్వవైభవం రావాలని ఆయన ఆకాంక్షించారు.

ఓల్డ్‌ సిటీ అభివృద్ధి కోసం త్వరలో అన్ని బస్తీల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పేద ముస్లింల బతుకుల్లో వెలుగులు రావాలని ఆయన అభిలషించారు. ముస్లింల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు.

ముస్లింల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ చెప్పారు. నెత్తురు చుక్క చిమ్మకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ ముందుకు నడిపించిన్రని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌ పాలనలో ముస్లింల ఆత్మగౌరవం పెరిగిందని మహమూద్‌ అలీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దిన్‌, జామై నిజామియా పాలకవర్గం నుంచి మౌలానా అక్బర్‌ నిజాముద్దీన్‌, హజ్రత్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.