జిల్లాకో మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల

3

-కడియం శ్రీహరి

హైదరాబాద్‌,మార్చి 19 (జనంసాక్షి):

ప్రభుత్వ మహిళా కాలేజీల్లో అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యా సంస్థల్లో ఆడపిల్లల భద్రత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతీ జిల్లాకు మహిళా రెసిడెన్సియల్‌ డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే వాటిని ప్రారంభిస్తామని ప్రకటించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు  అడగిన ప్రశ్నలపై మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యుడు సున్న రాజయ్య మాట్లాడుతూ… భద్రాచలంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ నియోజకవర్గం హెడ్‌క్వార్టర్స్‌లో మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొండా సురేఖ కోరారు. ప్రతీ నియోజకవర్గంలో మహిళా రెసిడెన్సియల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత కోరారు. దీనికి  సమాధానం ఇస్తూ సభలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక మార్పులు లేకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో విద్యార్థుల ఫీజుల కోసం విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. 41,403 మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు రిజస్టేష్రన్‌ చేసుకున్నారని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే లోపే విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందస్తామన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం చేయవద్దని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇక శాసనసభలో జీరో అవర్‌  సందర్బంగా బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కడియం శ్రీహరి సమాధానం ఇస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు పదో పీఆర్సీ ద్వారా 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామన్నామని తెలిపారు. మాదీ ఎంప్లాయిస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం హెల్త్‌కార్డులు జారీ చేశామని దానిలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటించారు. అయితే ఉద్యోగలు హెల్త్‌ కార్డులు పనిచేయడం లేదన్నారు.