టీ కాంగ్రెస్‌ మీటింగులు బోగస్‌

ఆంధ్రా పాలకులు ఆడిచ్చినట్లు ఆడుతున్నరు
ఇక వేచి చూడలేం : కోదండరామ్‌
ఆదిలాబాద్‌/మంచిర్యాల, జూన్‌ 19 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం టీ కాంగ్రెస్‌ నేతలకు చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టం అయిందని, ఆంధ్రా పాలకుల అనుమతితోనే సమావేశాలు నిర్వహించుకున్నారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆరోపించారు. టీ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ కోసమంటూ నిర్వహిస్తున్న మీటింగులు బోగసేనని అభివర్ణించారు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీ కాంగ్రెస్‌ నేతలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలేదన్నారు. తెలంగాణకు ప్యాకేజీలు అవసరం లేదని, కేవలం హైదరాబాద్‌తో కూడిన 1956 నాటి తెలంగాణ ఏర్పాటే కావాలన్నారు. తెలంగాణ సాధన కోసం చలో అసెంబ్లీ నిర్వహిస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా అణగదొక్కాలని చూసిందో తెలంగాణ ప్రజలు కళ్లు తెరుచుకుని చూశారన్నారు. ప్రత్యక్షంగా లక్షలాది మంది సీమాంధ్ర ప్రభుత్వ దురహంకారానికి బలయ్యారన్నారు. ఇంకా ఇంకా ఎన్ని రకాలుగా తెలంగాణా ప్రజలను మోసం చేస్తారని ద్వజమెత్తారు. ప్యాకేజీల వల్ల కాంగ్రెస్‌ నేతలకు ఏమైనా లాభం జరిగితే జరుగొచ్చు కాని తెలంగాణ ప్రజలకు మాత్రం నయాపైసా లాభం చేకూరదన్నారు. ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లు ఇవన్నీ కాలం చెల్లినవేనన్నారు. ఎంతమందిని బైండోవర్లు, అరెస్ట్‌లు చేసి ప్రజలను ఇక్కట్లపాలు చేశారో ప్రజలు స్వయంగా అనుభవిం చి నా కూడా కాగ్రెస్‌ నేతలు సీఎం వద్దకు వెళ్లి నిలదీసిన పాపాన పోలేద ని, దాంతోనే వారి చిత్తశుద్ధి ప్రజలకు అర్థం అయిందన్నారు. హైదరాబాద లో సమావేశాలు పెట్టుకోవడం వల్ల మరోసారి ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పనికి వస్తుందన్నారు. జూలై నాలుగో తేదీ నుంచి పల్లెలకు రానీయకుండా అడ్డుకుంటామని కోదండరామ్‌ హెచ్చరించారు. గ్రామాల్లో రచ్చబండలు నిర్వహించి రిటైర్డ్‌ జడ్జీలతో ప్రజాకోర్టులు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌కు తమను రానీయని కాంగ్రెస్‌ నేతలను పల్లెల్లోకి ఎందుకు రానివ్వాలని ప్రజలే ప్రశ్నించనున్నారన్నారు. లక్షలాది మందిని సీమాంద్ర ప్రభుత్వం అరెస్ట్‌లు చేసినా బైండోవర్లు చేసినా కూడా ఎందుకు అడ్డుకోలేదని టీ కాంగ్రెస్‌ నేతలను కోదండరామ్‌ నిలదీశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగి తీరుతుందన్నారు.ఈ విూడియా సమావేశంలో ఆదిలాబాద్‌ తూర్పుజిల్లా ఐకాస చైర్మన్‌ శ్యాంసుందర్‌రావు, కన్వీనర్‌ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.