టూరిజానికి వరంగల్‌ కేరాఫ్‌..గవర్నర్‌ నరసింహన్‌

2

వరంగల్‌, మార్చి 25 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్య మరియు వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ తెలిపారు. వరంఘల్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హరిత కాకతీయలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో గవర్నర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ, ఆసరా, వాటర్‌ గ్రిడ్‌, పారిశ్రామిక విధానం, విద్యుత్‌ ఉత్పాదన తదితర కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. మిషన్‌ కాకతీయ ద్వారా జిల్లాలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, వీటిలో తాను రెండు చెరువులను సందర్శించినట్లు తెలిపారు. ప్రభుత్వం పునరుద్దరణ చేసిన అనంతరం ఆయా గ్రామస్తులు కమిటిగా ఏర్పడిన చెరువును రైతులందరికి ఉపయోగపడే విధంగా చూసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం 9 వేల చెరువులు పునరుద్దరించడం జరుగుతుందని అన్నారు. అలాగే త్వరలో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా త్రాగునీరందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై రూపొందించిన బిల్లులో నిర్ణీత గడువులో పరిశ్రమల స్థాపనకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆసరా పథకం క్రింద ఫించన్లు, నూతన విద్యుత్‌ ప్రాజెక్టులు, పంచాయితీ రోడ్లు ఏర్పాటు లాంటివి కూడా ప్రజల కొరకు అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో మంచి యంత్రాంగం ఉందని వారికి అందరు సహకరించి ఇది మన ప్రభుత్వం అని అనుకొని సహకరించి అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందరికి అందేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా కొంత మంది విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుపుతూ శాసనసభ, మండలిలలో జరిగే విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సింది. సంబంధిత స్వీకరేనని, అలాగే రాష్ట్ర విభజనను ఒక కుటుంబం విడిపోవడంలా పొలుస్తూ కొంత కాలం సమస్యలు వస్తాయని కాలక్రమంగా అవిసద్దుకుంటాయని అన్నారు. విశ్వ విద్యాలయాలకు ఉప కులపతులను నియమించి త్వరలో పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి రోగులకు మంచి వైద్య సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ నగరాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా త్వరలో కానుందని, దీనిలొ భాగంగా కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా గుర్తించడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కాకతీయులు పాలించిన ఈ ప్రాంతంలో తాను పర్యటించి వారి కట్టడాలను చూడటం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. రాజులు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తారని కాకతీయులను వారికి మంచి ఉదాహరణని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా, వరంగల్‌ మున్సిపల్‌ కవిూషనర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, సమాచార శాఖ, ఉప సంచాలకులు ఎం.బాలగంగాధర్‌ తిలక్‌, సహాయ సంచాలకులు డి.ఎస్‌. జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఛాయచిత్ర ప్రదర్శన ప్రారంభించిన గవర్నర్‌

వరంగల్‌ పర్యటన వేయి స్థంబాల దేవాలయ ప్రాంగణంలో సమాచార పౌరసంబంధాల శాఖ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయచిత్ర ప్రదర్శనను గవర్నర్‌ ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలతో పాటు, వివిధ దశలలో నున్న కళ్యాణ మండప పునర్‌ నిర్మాణపు పనుల వివరాలు గల ఫోటోలను గవర్నర్‌ ఆసక్తిగా తిలకించారు. పునర్‌ నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలను తిలకించిన సందర్భంగా ప్రభుత్వ సలహదారు పాపారావు, ఇంటాక్‌ కన్వీనర్‌ ఆచార్య పాండు రంగారావు వాటి గురించి గవర్నర్‌ కు వివరించారు. అనంతరం మంగళవారం గవర్నర్‌ జిల్లా పర్యటన తాలుకు ఫోటోలను చూసి గవర్నర్‌ ఆశ్చర్యచకితులయ్యారు. మేడారం జాతర సందర్భంగా వివిధ ఘట్టాల పై తీసిన ఫోటోల గురించి జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ గవర్నర్‌ కు వివరించారు. అనంతరం 9.30 గంటలకు గవర్నర్‌ వేయి స్థంబాల దేవాలయం నుండి బయలుదేరి హరిత కాకతీయకు చేరుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ అంబర్‌ కిషోర్‌ ఝా, జాయింట్‌ కలెక్టర్‌ ప్రశాంత జీవన్‌ పాటిల్‌, వరంగల్‌ మున్సిపల్‌ కవిూషనర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్‌, పురావస్తు, దేవాదాయ, పర్యాటక, సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు.

రుద్రేశ్వరాలయ సందర్శన

వరంగల్‌ కోట నుండి ఉదయం 8.40 గంటలకు హన్మకొండలోని చారిత్రక నేపధ్యం కల్గిన వేయి స్థంబాల దేవాలయం చేరుకున్న గవర్నర్‌ దంపతులకు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ బృందం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రుద్రేశ్వస్వామి సన్నిదిలో ఆలయ అర్చకులు గవర్నర్‌ దంపతుల పేర విశేష పూజలు నిర్వహించారు. తదుపరి పునర్‌ నిర్మాణంలో వున్న ఆలయ కళ్యాణ మండపాన్ని గవర్నర్‌ సందర్శించారు.