టెట్, ఎంసెట్ వాయిదా
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఏప్రిల్ 28(జనంసాక్షి): తెలంగాణలో టెట్, ఎంసెట్ వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే 20లోపు టెట్, ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్,ఎంసెట్‌కు సహకరించమన్న ప్రైవేటు కళాశాలల ఐకాసా నిర్ణయం నేపథ్యంలో మంత్రి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మే20 లోపు ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. మరో పక్క విజిలెన్స్ దాడులు ఆపేవరకు సహకరించమని ప్రైవేటు విద్యాసంస్థల ఐకాస పేర్కొంది.
బెదిరింపులకు లొంగేది లేదు: కేసీఆర్
హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల బెదిరింపులకు లొంగేది లేదని.. తనిఖీలు కొనసాగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. విద్యాప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల సంఘం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. టెట్ ఎంసెట్ పరీక్షలు బహిష్కరించాలనుకోవడం శోచనీయమన్నారు. విద్యా సంస్థల్లో తనిఖీలు వద్దనడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. బోగస్ విద్యాసంస్థలను ఏరివేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థను నీరుగార్చేలా వారి ప్రవర్తన ఉందని కేసీఆర్ తెలిపారు. కొన్ని ప్రైవేటు సంస్థల్లో పరిస్థితి చూసి చలించినట్లు ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని కడియం శ్రీహరికి ఆదేశాలు ఇచ్చానన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.