టేకులపల్లి లో కురుస్తున్న వర్షాలకు

మిర్చి, పత్తి మొక్కలకు ప్రాణం –ఊపిరి పీల్చుకున్న రైతన్నలు

టేకులపల్లి, సెప్టెంబర్ 7 (జనం సాక్షి): పది రోజులుగా వర్షాలు మొఖం చాటేయడంతో దానికి తోడు ఎండలు మండుతుండడంతో పత్తి చేలు వడబడి బెట్ట కొచ్చే విధంగా, మిర్చి సాగు సమయం ఆసన్నం అవడంతో మొక్కలు నాటే ప్రక్రియ రైతులు ప్రారంభించారు. మండుతున్న ఎండలకు తోడు వ్యవసాయ విద్యుత్ సరఫరా కూడా అంతరాయాలు ఏర్పడడంతో నాటిన మిర్చి మొక్కలను బ్రతికించుకోవడం కోసం రైతులు నానా కష్టాలు పడుతున్న తరుణంలో రెండు రోజులుగా టేకులపల్లి మండలంలో వర్షాలు కురుస్తుండడంతో మొక్కలకు ప్రాణం పోసినట్లయింది. దీంతో రైతాంగం ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. టేకులపల్లి మండలంలో పత్తి పంట పూత కాపు దశలో ఉండగా మిర్చి సాగు నాటే ప్రక్రియ ఇప్పటికే 60% పూర్తి చేశారు. ఈ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మరంగా మిర్చి మొక్కలను నాటే ప్రక్రియ కొనసాగుతోంది. వర్షాలు కురవడంతో రైతులు ఒక్కసారిగా మిర్చి నాటే ప్రక్రియను ముమ్మరం చేయడంతో కూలీల కొరత ఏర్పడింది. ఇతర గ్రామాల నుండి మండలాల నుండి కూలీలు వాహనాల ద్వారా వచ్చి మిర్చి మొక్కలను నాటుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.