ఠారెత్తిస్తున్న ఎండలకు తోడు నీటి ఎద్దడి
ప్రచండ భానుడి పతాపానికి దేశం అల్లాడుతోంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచినీటి సమస్య తీవ్రం అయ్యింది. దేశం ఎడారిగా మారుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదేమో. దశాబ్దాలుగా దేశంలో పర్యావరణ హితమైన చర్యలకు పాలకులు కట్టుబడి ఉండకపోవడం వల్ల పచ్చదనం మాయమయ్యింది. పచ్చదనం అన్నది లేకుండా పల్లెల్లో ఉన్న చెట్లను ఎక్కడిక్కడ నరికి వేశారు. గతంలో ఇంటిముందు ఉండే చెట్లను కూడా డబ్బుకోసం అమ్ముకున్నారు. ఇప్పుడు చాలా గ్రామాల్లో కోతుల బెడద కారణంగా చెట్లను ఉంచనీయడం లేదు. తెలుగు రాష్ట్రాలు ఎండవేడిమికి అతలాకుతలం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వడగాడ్పులు ఇందుకు తోడవడంతో ప్రజలు శారీరక రుగ్మతల బారిన పడుతున్నారు. మండే ఎండలకు తోడు రెండు రాష్ట్రాల్లోను తాగునీటికి కటకట ప్రారంభం అయింది. వడదెబ్బధాటికి మృతుల సంఖ్యకూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన నాలుగైదురోజుల్లో 45 మందికిపైగా మృత్యువాత పడ్డారంటే వేసవి తాపం ఎంతతీవ్రస్తాయిలో ఉందో అవగతం అవుతుంది. రోహిణీ కార్తె రాకముందే ఎండలు మండిపోతున్నాయి. చూస్తుంటే ఈ వేసవి మొత్తం వేసవి ఉష్ణోగ్రతలతో అట్టుడికిపోయేలా కనిపిస్తోంది. అన్నింటిని మించి మంచినీటి సమస్య ఈ యేడు తీవ్రంగా ఉంది. ఏటా ఎండాకాలం బాధలను వానాకాలంటో గుర్తుంచుకోక పోవడం వల్ల మంచినీటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. అనంత మొదలుకుని ఆదిలాబాద్ వరకు మంచినీటి సమస్య లేని జిల్లా లేదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బోర్లు ఎండిపోయాయి. తాగునీరు కాదుకదా రోజువారీ నీటికి కటకట తప్పడం లేదు. ప్రధాన జలాశయాలు అడుగంటి పోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకున్నాయి. మెట్రో నగరంలోనే శివారు ప్రాంతాల్లో మూడు నుంచి వారం రోజులకు ఒకపర్యాయం మాత్రమే అందుతోంది. భూగర్భజలాలు అడుగంటడం, భూతాపం పెరిగిపోవడంతో మంచినీటిసమస్య కూడా అధికం అవుతున్నది. బోర్లువేసి నీటిసమస్య కొంత తగ్గించాలని భావించినా ఎంత లోతుకు తవ్వినా నీళ్లు రాని పరిస్థితులు అలుముకున్నాయి. ఇప్పటికే నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటివసతిలేక ఇళ్లు సైతం ఖాళీచేసి జనం తరలిపోతున్నారు. ఇదే పరిస్థితి మేనెల వరకూ కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందన్నది అంచనా. వేసవి తాపంనుంచి ఉపశమనం పొందేందుకు ప్రభుత్వాలపరంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలనేవి ఏనాటినుంచో లేవనే చెప్పాలి. వీటికితోడు రాష్ట్రంలోని జలాశయాల్లో కూడా నీటివనరులు వేసవి తాపానికి ఆవిరి అవుతున్నాయి. మేనెల సవిూపించే తరుణంలో మండుతున్న ఎండలు అటు శారీరక అస్వస్థతలు పెంచడంతో పాటు ప్రజల దాహార్తిని కూడా పెంచుతున్నాయి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తంచేసి వడదెబ్బసోకకుండా జాగ్రతలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సీమజిల్లాల్లో ఉష్ణోగ్రత 41 నుంచి 43 డిగ్రీల వరకూ ఉంది. సీమలో మూడునుంచి నాలుగు డిగ్రీలు సాధారణ ఉష్ణోగ్రతలకు అదనంగా నమోదవుతుండటంతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఉదయం నుండే మొదలవుతున్న వడగాడ్పులు సాయంత్రం అయినా ఎక్కడా తగ్గకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తెలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవ్ఞతున్నాయి. నాలుగన్నర దశాబ్దాల తర్వాత ఇంతటి ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఉష్ణోగ్రతకు పక్షులు, పశువులు అశువులు బాస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 500 మంది పైగా వడగాడ్పులకు మరణించినట్లు అనధికార వర్గాలే పేర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని కొన్ని ప్రాంతాల్లో 50ం చేరుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కోస్తాలో సాధారణ డిగ్రీలకు అటుఇటుగా
నమోదవుతున్నా గత రెండురోజుల నుంచి వేడిగాలులు పెరిగాయి. సాధారణంగా మండే ఎండలు అంటేనే మే నెల గుర్తుకు వస్తుంది. అటువంటిది ప్రస్తుతం ఏప్రిల్‌నెలలోనే మండే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వడదెబ్బకు ఒక్కరోజులో 27 మంది మృతిచెందారంటే పరిస్థితులు ఎంత తీవ్రస్థాయిలో అలుముకున్నాయో అవగతం అవుతుంది. హైదరాబాద్‌లో పదిదాటితే నమోదయిందంటే బైటకు నడవలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం పదిగంటలు దాటినప్పటినుంచీ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వచ్చే రెండునెలలపాటు 45-50 డిగ్రీలు ఖచ్చితంగా ఉంటుందని, అంతేకాకుండా మరో నెల రోజులపాటు వడగాడ్పులు కూడా ఉండే ప్రమాదం లేకపోలేదని వాతావరణశాఖ ఇప్పటినుంచే అప్రమత్తం చేస్తోంది. మరో పక్క రుతుపవనాలు ప్రవేశిస్తే తప్ప రెండు రాష్టాల్ల్రోను భూగర్భజలాలు పెరిగే అవకాశం లేదు. జూన్, జూలైనాటికి కానీ రుతుపవనాలు వచ్చే అవకాశం లేదు. ఎండలు ఇలాగే మండిస్తే వయోవృద్ధులకు సంక్లిష్టపరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. మార్చి, ఏప్రిల్ నెలలే వేసవి తాపానికి కీలకంగా మారాయా అన్నట్లు కనిపిస్తోంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేస్తోంది. ఉష్ణోగ్రత ప్రభావం, వడగాడ్పులు తీవ్రతరం కావడంతో రాష్ట్రంలో రేడియేషన్ ప్రభావం కూడా పెరుగుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దుస్తితి నుంచి దూరం కావాలంటే పర్యావరణ హితమైన చర్యలకు ఇప్పటి నుంచే పూనుకోవాలి.