డీఎంకేతో కాంగ్రెస్‌ చర్చలు పోత్తుపై ఆశలు

5

చెన్నై,మార్చి25 (జనంసాక్షి):

తమిళనాట పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో సీట్ల సర్దుబాటుపై  కరుణానిధితో కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ శుక్రవరాం చర్చించారు. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తెలిపారు.  డీఎంకే అధినేత కరుణానిధితో చెన్నైలో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ భేటీ కేవలం ఎన్నికల వ్యూహానికి సంబంధించినది మాత్రమేనని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై కరుణానిధితో మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. నంతరం డీఎంకే నేత ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటుపై చర్చించామని, కాంగ్రెస్‌ పలు కీలక డిమాండ్లను తమ ముందు ఉంచిందన్నారు. చర్చలు ఇంకా కీలక దశలోనే ఉన్నాయని స్టాలిన్‌ తెలిపారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇదిలావుంటే డీఎంకేలో ఇప్పుడు కనిమొళి హవా నడుస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ అన్నింటా తానున్నాననే భావనను ఆమె శ్రేణుల్లో కల్పిస్తున్నారు. ఈ ఎన్నికల వ్యవహారాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తూ కరుణానిధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. డీఎంకేలో ప్రస్తుతం కరుణ వారసత్వానికి మరొక నేత తెరపైకి వస్తుండటంతో ఆ పార్టీ అంతర్గత రాజకీయాలు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు కరుణానిధి తనయురాలిగా కనిమొళి సుపరిచితురాలు. 2007లో ‘చెన్నై సంగమం’ పేరిట నగరంలో భారీ ఎత్తున కళలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించి ఆ కార్యక్రమానికి సమన్వయకర్తగా మారారు. తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా అప్పటి డీఎంకే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య గట్టి మైత్రికి వారధిగా వ్యవహరించారు. ఇవన్నీ కరుణానిధి సూచనల మేరకు ఆమె చేపట్టిన చర్యలే. ప్రస్తుతం డీఎంకేలో ఆమె స్థాయి అందుకు విభిన్నంగా మారుతోంది. రాజకీయ చాణక్యుడు కరుణానిధికి సైతం సలహాలు ఇచ్చే స్థాయికి ఆమె చేరుకున్నారు. కరుణానిధికి వయోభారం పెరగడంతో పార్టీ బాధ్యతలను స్టాలిన్‌ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. కనిమొళి కూడా అందుకు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కీలక పాత్రతోపాటు క్రీయాశీల రాజకీయాల్లోకి దిగి కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ పార్టీ వర్గాలను ఆకట్టుకుంటున్నారు. మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ జయలలిత వైఖరిని ఎండగడుతున్నారు.డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి పదవిని చేపట్టిన కనిమొళి ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ డీఎంకే ఓటర్ల మద్దతు కూడగట్టారు. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం దస్త్రంపైనే తొలిసంతకం ఉంటుందని వాగ్దానం చేశారు. రేపటి  శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టే గురుతర బాధ్యతలను కనిమొళికి కరుణానిధి అప్పగించినట్లు వినికిడి.మేనిఫెస్టో రూపకల్పన బృందంలో ఆమెనూ సభ్యురాలిగా చేర్చారని పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలు ఆరోగ్యవంతమైనవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తండ్రికి దగ్గరగా ఉంటూ వ్యూహాలను పన్నుతున్నారు.