డ్రస్సింగ్‌ రూంలో నిఘా కెమెరా

3

గోవాలోని ఓ స్టోర్‌లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి షాక్‌

పోలీసులకు ఫిర్యాదు, నిందితుల అరెస్టు

గోవా,ఏప్రిల్‌3(జనంసాక్షి): సెలవు దినాలు గడపడానికి గోవా వచ్చిన కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈరోజు మధ్యాహ్నం కండోలిమ్‌లోని ఫ్యాబ్‌ ఇండియా వస్త్ర దుకాణానికి వెళ్లారు. ట్రయల్‌ రూంలో పైన వెలుతురు కోసం వదిలిన ఖాళీలో గోడకు రహస్య కెమెరా అమర్చి ఉన్నట్లు గుర్తించిన ఆమె భర్తకు సమాచారం అందించి సీసీ టీవీ ఫÛటేజీలను చూపవల్సిందిగా దుకాణం సిబ్బందిని ఆదేశించారు. అవన్నీ ఓ కంప్యూటరులో రికార్డు అవుతుండటాన్ని గమనించి వాటిని పరిశీలించగా అందులో ఆమె ఫÛటేజీలు సైతం ఉన్నాయి. దీంతో ఆమె భర్త జుబిన్‌ ఇరానీ, స్థానిక భాజపా ఎమ్మెల్యే మిచెల్‌ లోబో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇది చాలా అనుచిత చర్య అని, ఇలాంటి మోసాలు అన్ని చోట్లా జరుగుతూనే ఉన్నాయని, స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఇలాంటి పనులు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని, ఈ ఘటన జరగడం విచారకరమని స్థానిక ఎమ్మెల్యే లోబో అన్నారు. అయితే దుకాణంలో దొంగతనాలను అరికట్టడానికే సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, ట్రయల్‌ రూమ్‌లో పెట్టలేదని యాజమాన్యం తెలిపింది. అయితే ప్రస్తుతం వివాదం రేకెత్తించిన కెమెరా ట్రయల్‌రూంపై ఫోకస్‌ చేసివుండడమే కాక అక్కడి దృశ్యాలు మేనేజర్‌ గదిలోని కంప్యూటర్‌లో కనిపించడం ఎమ్మెల్యే లోబో చూశారు. ఎవరో కావాలనే ఇలా చేశారని ఆయన ఆరోపించారు. సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.