ఢిల్లీలో గుట్కా, పాన్‌మసాలా నిషేధం
– ఢిల్లీలో తగ్గిన ట్రాఫిక్
ఢిల్లీ,ఏప్రిల్ 15(జనంసాక్షి):పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు మందడుగు వేసింది. పాన్ మసాలా, గుట్కా, ఖైనీలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నమలడానికి అనువుగా ఉండే పొగాకు పదార్థాలన్నింటినీ నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక విూద పాన్ షాపుల్లో గానీ మరే ఇతర ప్రాంతాల్లోగానీ.. పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాతోపాటు.. జైలుశిక్ష కూడా తప్పదని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. నిషేధిత పొగాకు ఉత్పత్తులను అమ్మకుండా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అమల్లోకి రెండో విడత సరి-బేసి విధానం
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం నుంచి నుంచి రెండో దశ సరి-బేసి విధానం అమల్లోకి వచ్చింది. అయితే సరి-బేసి విధానాన్ని కొందరు వాహనదారులు పాటించలేదు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చాలా మంది వాహనదారులు నిబంధనలను ఉల్లంఘించారు. 5 గంటల్లో 500 మంది వాహనదారులు సరి-బేసి విధానాన్ని పాటించలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానం ఈ ఏడాది జనవరిలో అమల్లోకి వచ్చిన విషయం విదితమే. మొదటి దశలో భాగంగా జనవరి 1 నుంచి 15 వరకు సరి-బేసి విధానాన్ని పాటించారు. శుక్రవారం నుంచి దేశరాజధాని దిల్లీలో రెండో విడత సరి-బేసి వాహన విధానం అమల్లోకి వచ్చింది. విపరీతంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆప్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. పది హేను రోజుల పాటు ఈ విధానం అమల్లో ఉండనుంది.ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ సమష్టి కృషితో ఈ విధానాన్ని విజయవంతం చేద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ విధానం ప్రైవేటు వాహనదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారికి మోటార్ వాహనాల చట్టం కింద రూ.2వేల జరిమానా విధిస్తారు. ఈ విధానం అమలు పక్రియలో భాగంగా 2వేల మంది ట్రాఫిక్ పోలీసులు, 580 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 5వేల మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను రంగంలోకి దించారు. రెండు వందల మెట్రోరైళ్లు ప్రతిరోజు 3,248 ట్రిప్పులు తిరగనున్నాయి. దీని వల్ల కొంతమేర కాలుష్యం తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం వెల్లడించింది. దిల్లీ వాసులకు ఈ సదుపాయం వల్ల ట్రాఫిక్ కష్టాలు కూడా తీరనున్నాయి. ఈ విధానం నుంచి మహిళలకు, యూనిఫాం ధరించిన చిన్నారులను తీసుకెళ్లే వాహనాలకు, సీఎన్‌జీ వెహికల్స్‌కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నెంబరు ప్రకారం ఒకరోజు సరిసంఖ్య ఉన్న వాహనాలు, మరో రోజు బేసి సంఖ్య వాహనాలను రోడ్లవిూదకు అనుమతించనున్నారు.