తక్షణం హైకోర్టు విభజించండి

4

– మహాధర్నాలో ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌

హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జీల ఆప్షన్ల రద్దు కోసం లాయర్లు పోరుబాట పట్టారు. ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులు మహాధర్నా చేపట్టారు.  న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది శ్రీరంగారావు మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు న్యాయం జరగదు అని చెప్పారు. తెలంగాణ న్యాయవ్యవస్థపై పెత్తనం కోసమే చంద్రబాబు హైకోర్టు విభజనపై మాట్లాడటం లేదన్నారు.  ఈ మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా అడ్వకేట్లు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ ధర్నాలో పాల్గొనేందుకు వెయ్యి మంది అడ్వకేట్లకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని, తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తెలంగాణ న్యాయవ్యవస్థపై పెత్తనాలు, జడ్జీలు, న్యాయశాఖ నియామకాల్లో స్థానిక పోస్టులను కొల్లగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని న్యాయవాదులు సమరానికి సిద్ధమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రెండేండ్లు గడిచినప్పటికీ, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై స్పష్టమైన హావిూ ఇవ్వకపోవడంతోపాటు ఉమ్మడి ముసుగులో దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామకాలు, కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుండటాన్ని ప్రశ్నించడానికి న్యాయవాదులు సంఘటితమవుతున్నారు. న్యాయవాదులు చేపట్టే మహాధర్నా కార్యక్షికమానికి నగర పోలీసుల నుంచి న్యాయవాద జేఏసీ నేతలు టీ శ్రీరంగారావు, కే గోవర్ధన్‌డ్డి అనుమతి తీసుకున్నారు.

ఈ కార్యక్రమానికి రాజకీయపార్టీల నేతలు, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మేధావులు ప్రజాసంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ఉమ్మడి హైకోర్టు విభజన లక్షంతోపాటు, న్యాయాధికారుల కేటాయింపుల జాబితాను రీకాల్‌ చేయాలనే డిమాండ్లు ప్రధాన ఎజెండాగా ధర్నా సాగుతుంది. అన్యాయంపై గళమెత్తిన తెలంగాణ న్యాయాధికారులను ఉమ్మడి హైకోర్టు సస్పెండ్‌ చేయడాన్ని న్యాయవాదులు చాలెంజ్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల నుంచి భారీగా న్యాయవాదులు ఇందిరాపార్క్‌కు తరలి వచ్చినట్లు కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. న్యాయాధికారుల కేటాయింపు వ్యవహారంపై తెలంగాణ న్యాయవాదుల నిరసనలు కొనసాగాయి. విధుల

బహిష్కరణతోపాటు ర్యాలీలు, రిలే నిరహారదీక్షలు, దిష్టిబొమ్మల దహనాలతో ఆందోళనలు చేపట్టారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.