తాగునీటి ప్రాజెక్టులన్నీ మా హయంలో ప్రారంభించినవే

3

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినవన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైనవేనని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. 112 లక్షల ఎకరాలకు నీరందించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల్లో సుమారు 65 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టులను తామే రూపకల్పన చేశామన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు కూడా తమ హయాంలోనే ప్రారంభమైందని.. పాలమూరు.. డిండి ప్రాజెక్టులు మాత్రమే కొత్తగా నిర్మించనున్నారని జానారెడ్డి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు తమ హయాంలోనే 50 నుంచి 90 శాతం నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యాల సాధన కోసమే ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని జానారెడ్డి అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు.. దుమ్ముగూడెం.. రుద్రమకోట ప్రాజెక్టులకు రీ ఇంజినీరింగ్‌ చేస్తామని ప్రభుత్వం ప్రజెంటేషన్‌లో తెలిపిందన్నారు. తెరాస ప్రభుత్వం కేవలం మూడు.. నాలుగు ప్రాజెక్టుల పునరాకృతి.. రెండు కొత్త ప్రాజెక్టులు మాత్రమే చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తమ్మిడిహట్టి నుంచి నీటిని మళ్లించే విషయంపై అధ్యయనం చేస్తూ.. ప్రైవేటుగా బ్లూప్రింట్‌.. మ్యాపులు తయారు చేస్తున్నామని దానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నామని అన్నారు. ఇది పూర్తయ్యాక ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇస్తామన్నారు. అధికారం ఉంది కదా అని అహంకారంతో వ్యవహరించడం సరికాదని సిఎల్పీనేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారినప్పుడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.. పార్టీ మారే వారు తమ వద్దకు వస్తుంటే రాజీనామా చేసి రావాలని కేసీఆర్‌ చెప్పకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఫిరాయింపుదారుల్ని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు.. ఫిరాయింపుల చట్టంలో లొసుగులను కేంద్రం సరిచేయాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. చట్టం మార్పునకు కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని, అధిష్టానంతో ఈ విషయమై చర్చిస్తామని జానారెడ్డి వ్యాక్యానించారు..మేమే శాశ్వతమని ప్రభుత్వపెద్దలు ఆలోచన చేయడం మంచిదికాదని హితవు పలికారు..