తాను కట్టించిన జైళ్లో తానే ఖైదీ
ముంబై,ఏప్రిల్ 6(జనంసాక్షి): ఒకప్పుడు మహా పాలిటిక్స్‌లో ఓ వెలుగు వెలిగి, అధికారం చలాయించిన ఛగన్‌భుజ్‌బల్ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. కాలం కలిసిరాకపోతే కర్రే పాములా మారి కాటేస్తుందన్నది నానుడి. మహారాష్ట్ర రాజకీయ నాయకుడు, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కు ఇపుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. తాను దగ్గరుండి కట్టించిన జైలు గదిలోనే ఇప్పుడు ఆయన ఉండడం విధి వైచిత్రి కాక మరోటి కాదు. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు ఆర్థర్ రోడ్డు జైలులో 12వ నంబర్ గదిని కేటాయించారు. ‘బేరక్ నంబర్ 12’గా పిలిచే ఈ బుల్లెట్ ప్రూఫ్ గదిని 26/11 దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మాల్ కసబ్ కోసం 2008లో ప్రత్యేకంగా కట్టించారు. లష్కర్-ఈ-తోయిబా నుంచి కసబ్ ముప్పు పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు ప్రజాపనుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న భుజ్ బల్ ఇన్ చార్జిగా వ్యవహరించి ఈ జైలు గది నిర్మాణ బాధ్యలు పర్యవేక్షించారు. కాలం గిర్రున తిరిగింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన 68 ఏళ్ల భుజ్ బుల్ ఇప్పుడు ఇదే జైలు గదిలో గడపాల్సి వచ్చింది. సవతి కుమార్తె షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న విూడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియా ఇదే సెల్ లో ఉన్నారు. వీరు ‘బేరక్ నంబర్ 12’ ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి బిపిన్ కుమార్ సింగ్ ధ్రువీకరించారు. అయితే 2012లో కసబ్ ను ఉరి తీసిన తర్వాత దీన్ని పలు విభాగాలుగా విడదీసి హైప్రొఫైల్ ముద్దాయిలకు ప్రత్యేకించినట్టు వెల్లడించారు.