తిరుపతిని ముంచెత్తిన వరద


` స్తంభించిన జనజీవనం
` తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు
` జిల్లాలో విద్యాసంస్థలకు గురు,శుక్రవారాలు సెలవు
` రేణిగుంటలో దిగని విమానాలు
తిరుపతి,నవంబరు 18(జనంసాక్షి): చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తిరుపతిని అతలాకుతలం చేస్తున్నాయి. తిరుపతి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం 3గంటల నుంచి తిరుపతిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. లక్ష్మీపురం కూడలి, ఎమ్మార్‌పల్లి కూడలి, లీలామహల్‌ సెంటర్‌, కొర్లగుంట ప్రాంతాల నుంచి వచ్చిన వరదనీరు పూర్తిగా రోడ్లపైకి చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తూర్పు పోలీస్‌ స్టేషన్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి, వెస్ట్‌ చర్చి రైల్వే అండర్‌ బ్రిడ్జి నీటమునిగాయి. మధురానగర్‌, సంజయ్‌నగర్‌ ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు, కార్లు వరదనీటిలో మునిగిపోయాయి.శ్రీనివాస మంగాపురం వద్ద వాహనాలు కొట్టుకుపోతుండటంతో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. దీంతో తిరుపతికి వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకంబాడి మార్గంలో భారీగా వరదనీరు చేరింది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కల్యాణి జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2015 తర్వాత కల్యాణి జలాశయం పొంగడం ఇదే మొదటిసారి. సోమల మండలంలో వాగులు పొంగడంతో 57 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి వాగు ఉద్ధృతికి రెండు స్కూటర్లు, ఆటో కొట్టుకుపోయాయి. ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు.
తిరుమల కనుమదారిలో విరిగిపడిన కొండచరియలు
చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో తిరుపతి నగరం జలమయం అయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే అండర్‌ బ్రడ్జ్‌లు వర్షపు నీటితో మునిగిపోయాయి. తిరుపతి నగరంలోని వెస్ట్‌ చర్చి, తూర్పు పోలీస్‌ స్టేషన్‌ వద్దనున్న అండర్‌ బ్రిడ్జ్‌లు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.భారీ వర్షాలతో తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తిరుమల రెండో కనుమదారిలో హరిణి వద్ద రాళ్లు పడ్డాయి. భారీ వర్షంతో పాపవినాశనం రహదారిని తిరుమల తిరుపతి దేవస్థానం మూసేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు.తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. కనుమ దారులు, మెట్ల మార్గంలో భారీగా వరద ప్రవహిస్తుంది. భారీ వర్షంతో రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. మరోవైపు రహదారిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరిణి సవిూపంలో రహదారిపై చెట్టు కూలింది. కొండపై నుంచి రహదారిపైకి మట్టి, రాళుకొట్టుకొచ్చాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి సైతం వరద నీరు చేరింది.భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ సెలవు ప్రకటించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామనీ.. జిల్లాలో ఎక్కడైనా అవసరమైతే సేవలను వినియోగించుకుంటామన్నారు.
రేణిగుంటలో దిగని విమానాలు
ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో విమానాలు దిగడం లేదు. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నాయి. రేణిగుంటలో దిగాల్సిన హైదరాబాద్‌`రేణిగుంట ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌ విమానాలు హైదరాబాద్‌కు వెనుదిరిగాయి.