తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల, జూన్ 30 : ఆషాఢశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ అధికమైందని అధికారులు తెలిపారు. ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. భక్తుల రాకతో 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామికి ప్రీతికరమైన శనివారం కూడా ఏకాదశి కలసి రావడంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. రూ. 50, 100 ఉచిత గదులు దొరక్క భక్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ తమ విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచి మొక్కుబడులను తీర్చుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఇదే సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల సుదర్శన దర్శనం, కాలినడకన వచ్చే భక్తులు దివ్య దర్శనానికి సుమారు 8గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. 31 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులకు టిటిడి నిత్యాన్న ప్రసాద సముదాయం నుంచి అధికారుల అనుమతితో ఉదయం పాలు, మధ్యాహ్నం భోజనం అందించారు. ఆలయం లోపల భక్తులకు మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.