తీవ్రస్థాయిలో పలు ప్రమాదాలు
దుర్మిఖి నామ సంవత్సరంలో ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయన్న పండితుల అభిప్రాయాలను నిజం చేసేలా పలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే మరోవైపు రోడ్డు, అగ్ని ప్రమాదాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఆదివారం నాటి ప్రమాదాలు ఆందోళన కలిగించే దశకు చేరుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బకు కనీసం 50నుంచి 60 మంది వరకు మృత్యువాత పడ్డారు. అలాగేవేర్వేరురోడ్డు ప్రమాదాల్లో కనసీం ఓ 20 మంది దుర్మరణం చెందారు. ఇక కేరళలో పుట్టుంగి ఆలయంలో అగ్ని ప్రమాదానికి కనీసం 108 మంది మృత్యువాత పడ్డారు. చెరువుల్లో ఈతకు వెల్లిన బాలలు మృత్యువాత పడుతున్నారు. ఎందరో క్షతగాత్రులయి ఆస్పత్తరుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే పంచాంగ హెచ్చరికలు ఎలా ఉన్నా ప్రజల్లో నిర్లక్ష్యం, జాగ్రత్తలు లేకపోవడం ప్రమాదాలకు కారణంగా భావించాలి. వరుస ఘటనలను పరిశీలిస్తే ఇవన్నీ కూడా అజాగ్రత్తల వల్ల జరిగినవే ఎక్కువని చెప్పక తప్పదు. రెండు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు, వడగాడ్పులతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఎండ తీవ్రతకూ, వడదెబ్బకూ గురై అనేకమంది పిట్టల్లా రాలుతున్నారు. ఎపిలో కనీసం ఓ 30 మంది, తెలంగాణలో అంతే సంఖ్యలో వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఏడుగురు, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మండుటెండలకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఎండవేడిమిని తట్టుకోలేక తెలంగాణలో ఒక్క ఆదివారమే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ జిల్లాలో ఏడుగురు మృతిచెందారు. వరంగల్ జిల్లాలో ఆరుగురు మృతిచెందారు. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తలు తీసుకోని కారణంగానే అని చెప్పాలి. ఎండల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. ఇకపోతే విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడిన దుర్ఘటన కలచివేసిదిగా ఉంది. ప్రమాదం కారణంగా కారులో ప్రయాణిస్తున్న 9 మంది, బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇకపోతే బాణాసంచా కాల్చాలన్న పోటీ కేరళ ఆలయంలో విషదం నింపింది. కేరళ రాష్టరంలోని కొల్లంలోని వందేళ్ళనాటి పుట్టింగల్ అలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 110 మంది మృతి చెందారు. 400 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. విూనా భరణి వేడుకల సందర్భంగా పెద్దసంఖ్యలో ఆలయం వద్ద కు చేరుకున్న భక్తుల్లో కొందరు బాణాసంచా కాల్చడమే ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని భావిస్తున్నారు. ఆల య నిర్వాహకులు పెద్దఎత్తున నిలువ చేసిన బాణాసంచా దీనికి తోడుకావడంలో మంటలు దావానంలా వ్యాపించాయి. భారీ శబ్ధాలు, పేలుళ్లు, ఒక్కసారిగా అగ్నికీలలను చూసి ఠారెత్తిన భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాటకు దారితీసి పెను విషాదం సంభవించింది. విషయం తెలిసిన వెంటనే కేరళ ముఖ్యమంత్రితో పాటు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంఘటనా స్థలానికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. దీనిపై కేరళ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. కేరళలో కొల్లాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం కనీవిని ఎరుగని ఘోరంగా భావించాలి. కొల్లాం జిల్లా పర్వూర్ ప్రాంతంలోని వందేళ్ల చరిత్ర కలిగిన పుట్టింగల్ దేవి ఆలయ వేడుకల్లో భారీగా కాల్చిన బాణ సంచా వందలాది కుటుంబాల్లో చీకట్లను నింపింది.ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఆలయంలో జరుగుతున్న ‘విూనా భరణి’ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఆలయంలో జరిగే వేడుకల్లో ప్రతియేడు బాణాసంచా ప్రదర్శన, పోటి నిర్వహిస్తారు. ఈ సారి అనుమతి లేకున్నా ఆలయ కమిటీ, అధికారులు పోటీని నిర్వహించారు. ఇందుకోసం పది లక్షల బాణాసంచ తీసుకొచ్చి ఆలయం పక్కనే గల మైదానంలో భద్రపరిచారు. బాణాసంచా ప్రదర్శనను దాదాపు 10 వేల మంది భక్తులు తిలకిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచ భద్రపర్చిన చోట నిప్పు రవ్వలు పడడంతో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి మైదానంలోని రెండు భవనాలు సైతం కూలిపోయాయి. భయంతో భక్తులు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం మరింత పెరిగింది. మృతదేహాలను, క్షతగాత్రులను త్రివేండ్రం మెడికల్ కళాశాల, కొల్లం జనరల్ ఆస్పత్రి సహ సవిూపంలోని పది ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లను ఉపయోగించారు. అయితే అనుమతి లేకున్నా ఎందుకు బాణాసంచాకు అనుమతించారన్నది ఇక్కడ గమనించాలి. ఆలయాల్లో భక్తికన్నా ఆడంబరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది సామాన్యుల ప్రాణాలకు భరోసా లేకుండా చేసింది. ఇలాంటి ఘటనలపై విచారణ చేసి తీసుకోవల్సిన జాగ్రత్తలపైనే ప్రధానంగా దీష్టి సారించాలి. వడదెబ్బకు మృత్యువాత పడకుండా చూసుకునే అవకాశం ఉన్నా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమదా ల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు స్పందించిన తీరుగానే జరగకుండా చర్యలపై దృష్టి సారించాలి. అప్పుడే ప్రమాదలకు దూరంగా ఉంటామని గుర్తుంచుకోవాలి.