‘తూర్పు’లో సరఫరా కాని గ్రామీణ నీటి సరఫరా

కాకినాడ,జూలై 5 : తూర్పుగోదావరి జిల్లాలోని 60 మండలాల్లో గ్రామీణ నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ పేరిట ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలతో చేపడుతున్న పథకాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసే కోట్లాది రూపాయల నిధులు పనుల జాప్యంతో మొదట వేసుకున్న అంచనా వ్యయం పదిరెట్లు పెరిగిపోతుంది. దీని వల్ల రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ వేస్తే కాని పనులు ప్రారంభించలేని దుస్థితి ఈ విభాగంలో ఎక్కువగా కనపడుతుంది.జిల్లాలోని 1105 గ్రామ పంచాయితీలలో ఉన్న శివారు ప్రాంతాల్లో కూడా మంచినీటి సరఫరాను అందించాల్సిన పరిస్థితి ఉంది.అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో కనీసం 25 శాతం కూడా మంచినీరు అందని పరిస్థితి నెలకొని ఉంది.శివారు ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలతో సమగ్ర మంచినీటి సరఫరా మంజూరు కాబడినా దీనికి కోటి రూపాయల నిధులు సరిపోనందు వలన మరలా 25 కోట్లు మంజూరుకు కొత్త ప్రతిపాదనలు పంపినా,ఇప్పటి వరకు ఈ నిధులు మంజూరు కార్యరూపం దాల్చలేదు.ఏజెన్సీలో ఉన్న  భూపతిపాలెం  రిజర్వాయరు నుండి 0.05 టి.ఎం.సి నీరు తీసుకోడానికి రిజర్వాయర్‌ ఇన్‌ టేక్‌ వెల్‌ నిర్మించారు.454 హేబిటేషన్స్‌ మంచి నీటి సరఫరా కోసం సి.పి.డబ్ల్యూ.ఎస్‌. స్కీము రూ.114 కోట్లతో జడేరు వాగు, పాములేరు వాగు,మూసురుమిల్లి రిజర్వాయర్‌ నుండి నీటిని తీసుకొనుటకు ప్రతిపాదనలు పంపారు.  దీనికి మూసురుమిల్లి రిజర్వాయర్‌ నుండి 0.022 టి.ఎం.సి. తీసుకొనుటకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు మంజూరు దశలో ఉన్నాయి. ఇది మంజూరు అయిన పిదప 0.022 టి.ఎం.సి నీరు మూసురుమిల్లి రిజర్వాయర్‌ నుండి తీసుకోనున్నారు.ఈ నీరు విడుదలైతే గాని ఏజెన్సీలో పూర్తి గ్రామాలకు సురక్షిత మంచినీరు అందని పరిస్థితి ఉంది.పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉప్పాడ గ్రామంలో లైలా రోడ్డు మంజూరై రోడ్డు వేయబోతున్నారని, ఈ రోడ్డు క్రింది నుండి ఎప్పుడో వేసిన పైపు లైన్లు ఉన్నాయని అవి పాడై పోయాయని, రోడ్డు పని ప్రారంభించే ముందే ఈ పైప్‌ లైన్లు మరమ్మతులు చేయాలని శాసన సభ్యురాలు వంగా గీతా కోరారు.