తెలంగాణకు అన్యాయం

5
– ఎలాంటి హామీలు నెరవేర్చలేదు

– లోక్‌సభలో ఎంపీ జితేందర్‌ రెడ్డి

న్యూఢిల్లీ,మార్చి15(జనంసాక్షి):విభజన చట్టంలోని తెలంగాణకు సంబందించిన అంశాలను నెరవేర్చలేదని లోక్‌ సభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత ఎపి జితేందర్‌ రెడ్డి అన్నారు. లోక్‌ సభలో వెంకయ్య నాయుడు మాట్లాడిన తర్వాత జితేందర్‌ రెడ్డి స్పందిస్తూ ఏపీకి ఇచ్చిన పలు సంస్థల జాబితాను మంత్రి చదివారని,కానీ తెలంగాణకు ఎలాంటి హావిూ నెరవేర్చలేదని అన్నారు. పారిశ్రామిక కారిడార్‌, వెనుకబడిన ప్రాంతాలకు రాయితీలు, గిరిజన విశ్వ విద్యాలయం, ఎన్‌.టి.పిసి.కేంద్రం ఇలా చట్టంలోని ఏ అంశం కూడా తెలంగాణకు సంబందించి పూర్తి చేయలేదని అన్నారు ఆంద్రకు ఏమి ఇచ్చారో వాటన్నింటిని తెలంగాణకు కూడా ఇవ్వాలని జితేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. వచ్చేసారి తెలంగాణకు సంబందించిన డిమాండ్లు కూడా నెరవేర్చి ఆ జాబితాను కూడా వెంకయ్య నాయుడు చదవాలని కోరారు. విబజన చట్టాన్ని ఎపిలోనే ఏకపక్షంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో తెలంగాణ నష్టపోతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి రెండు సంవత్సరాలైనా ఇంకా హైకోర్టు విభజన విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకపోవడం శోచనీయమన్నారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేకపోతే దేశానికి మంచిది కాదని అన్నారు.  ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని జితేందర్‌రెడ్డి కోరారు. ఒక రాష్ట్రంపై పక్షపాత దోరణి చూపడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంపట్ల కేంద్రం అనుసరిస్తోన్న పక్షపాత వైఖరిని ఎండగట్టారు.  ఎయిమ్స్‌, హార్టీకల్చర్‌ వర్సిటీ, ట్రైబల్‌ వర్సిటీ, నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ ¬దా, హైకోర్టు విభజన వంటి హావిూలను నెరవేర్చలేదని విమర్శించారు. రెండు రాష్టాల్రను సమానంగా చూడాలని జితేందర్‌రెడ్డి కోరారు.