తెలంగాణకు నిరంతర విద్యుత్ సరఫరా!
సీఎస్ రాజీవ్‌శర్మతో కేంద్ర బృందం భేటీ
హైదరాబాద్,మార్చి30(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కరెంటు కష్టాలు తీరనున్నాయా? తెలంగాణ రైతన్న విద్యుత్ బాధలు సత్వరమే గట్టెక్కనున్నాయా ? విద్యుత్ సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ కేంద్ర సహాయం కోరుతూ చేసిన కృషికి కేంద్రం తగు ఫలితాన్నివ్వనుందా? ప్రస్తుత పరిణామాలు చూస్తోంటే అవుననే అన్పిస్తున్నాయి. 24 గంటల విధ్యుత్ సరఫరా చేయాల్సిన రాష్ట్రాల ఖాతాలో తెలంగాణకు అవకాశం వచ్చింది. ఢిల్లీ,రాజస్ధాన్,ఏపీ తర్వాత కేంద్రం నిరంతర విద్యుత్ సరఫరా చేయాల్సిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్ధానం కల్పించారు. కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్న తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన విన్పపాన్ని కేంద్రం మన్నించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందం సీఎస్ రాజీవ్ శర్మతో పాటు విద్యుత్ అధికారులతో భేటీ అయింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 20లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. తెలంగాణలో యావత్ రైతాంగం విద్యుత్ పై ఆధారపడి సేద్యం చేస్తున్న పరిస్ధితుల్లో తమకు నిరంతరాయ కరెంటు ఇవ్వాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసారు. దీంతో కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా నేతృత్వంలో 11మంది ఉన్నతాధికారుల బృందం తెలంగాణకు వచ్చింది. విద్యుత్ సౌధలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్ కో, జెన్‌కో ఎండీ ప్రభాకరరావు, ఇందన కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో భేటీ అయింది. అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మతో భేటీ అయి సాధ్యాసాధ్యాలపై కూలంకషంగా జ్యోతి అరోరా బృందం చర్చించింది. వచ్చే 3ఏళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రాజెక్టుల ప్రణాళికల నమూనాను కేంద్రబృందానికి విద్యుత్ అధికారులు అందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుకు కేంద్రం సాయం పుష్కలంగా అందేట్లు చూడాలని కోరారు. ముఖ్యంగా సోలార్ పంపుసెట్ల వినియోగానికి పూర్తి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరినట్లు సమాచారం. ఇక2వేల మెగా వాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కూడా విద్యుత్ అధికారులు అభ్యర్ధించారు. ఏది ఏమైనప్పటికీ అన్ని కుదిరితే విద్యుత్ అన్ని కుదిరితే దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథ తెలంగాణలో అమలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.