తెలంగాణకు మళ్లీ ధోఖా – ఆడితప్పిన కాంగ్రెస్
సంప్రదింపులు ఇంకా కొనసా……..గాలన్న ఆజాద్
నిర్ణయానికి సమయం కావాలన్న షిండే
న్యూఢిల్లీ, జనవరి 27 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను ధోఖా చేసింది. గత నెల 28న నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని, ఇక నిర్ణయం ప్రకటించడమే మిగిలి ఉందన్న కేంద్ర ప్రభుత్వం సరిగ్గా నెల రోజుల తర్వాత ఎడుపుగొట్టు ప్రకటన చేసింది. మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులకు తొత్తుగా వ్యవహరిస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ఆదివారం సాయంత్రం తన నివాసం
పదుట మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకా సంప్రదింపులు కొనసాగాలని, సీఎం, పీసీసీ చీఫ్ సహా మూడు ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలను పిలిపించి మాట్లాడాల్సి ఉందన్నారు. తెలంగాణ సమస్య ఎప్పట్లోగా పరిష్కారమవుతుందో హోం మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందని చెప్పాడు. ఆ తర్వాత హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే జారీ చేసిన ప్రకటన ఆజాద్ వ్యాఖ్యలకు కొనసాగింపుగానే ఉంది. సంప్రదింపులు ఇంకా పూర్తికాలేదని నిర్ణయానికి మరికొంత సమయం కావాలని కోరాడు. వారిద్దరి ప్రకటనలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కేంద్రం సీమాంధ్రుల ఒత్తిడికి, డబ్బు సంచులకు తలొగ్గిందని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఆజాద్, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేశారు. నెల రోజుల్లోగా తేల్చేస్తామన్న షిండేకు ముఖం లేకనే మీడియా ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రగిలే ఉద్యమానికి, జరిగే ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్య ధోరణికి, అహంకారానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.