తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం వెల్లడిస్తాం

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, ప్యాకేజీలు చర్చకు రాలేదు
కృష్ణ కమిటీ నివేదిక మా ముందుంది : షిండే
న్యూఢిల్లీ, జనవరి10 (జనంసాక్షి) :
అఖిలపక్షంలో చెప్పిన విధంగా నెలరోజుల గడువులోగా తెలంగాణపై కచ్చితమై ప్రకటన చేస్తామని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతంగా ప్రకటించడం, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం ఇప్పటి వరకు చర్చకు రాలేదన్నారు. అయితే తెలంగాణ ఇస్తామనో ఇవ్వమనో తాము చెప్పలేదని అన్నారు. నెలవారీ సమీక్షలో భాగంగా శాస్త్రి భవనంలో షిండే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అంశంపై స్పందించారు. గత డిసెంబర్‌ 28న అఖిల పక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు చెప్పింది తాము విన్నామని అన్నారు. తాము చెప్పాల్సింది త్వరలో చెప్తామన్నారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పామన్నారు. అంతేకానీ ఇస్తామనో ఇవ్వమనో తాము చెప్పలేదన్నారు. సమస్య పరిష్కారానికి గడువు ఉందన్నారు. ఆ లోగా తేల్చుతామన్నారు. నెలలోగా అన్న తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ అంశంపై చాలామంది నుంచి సమాచారం వస్తోందన్నారు. తాను కూడా వివరాలు తెలుసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణపై సమాచారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా తమ ముందుందన్నారు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని, రాత్రిపూట ద్విచక్రవాహనాలపై గస్తీ చర్యలు చేపడుతున్నామని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వివరణ ఇచ్చారు. పోలీసు స్టేషన్లలో మహిళా సహాయకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై భద్రత చర్యలకు సంబంధించి ఎన్జీవోలు, మాజీ సైనికుల సేవలు వినియోగించుకుంటామన్నారు. నక్సల్స్‌ తమ దాడి వ్యూహాలను తరచూ మారుస్తున్నారని, ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని షిండే అన్నారు. పాఠశాల, కళాశాలలు పూర్తయిన తర్వాత విద్యార్థులు నేరుగా ఇంటికి వెళ్లాలని ఆయన సూచించారు. మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను పరీక్షించామన్నారు. పోలీసు నైట్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను కూడా పెంచామని షిండే చెప్పారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల పైన గస్తీ చర్యలు చేపట్టామన్నారు.