తెలంగాణపై తేల్చేస్తారా?
యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తున్నాయా? అనే ప్రశ్నకు కాస్త అటూ ఇటుగానైనా అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంత నాయకులు నిజాం కాలేజీ మైదానం నుంచి తెలంగాణ సాధన సమరనాథాన్ని వినిపించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముందుగా సభ పెట్టి ఇదే ప్రజల అభిమతంటూ బలమైన ఆకాంక్షను వ్యక్త పర్చడం వెనుక అధిష్టానం పెద్దల ప్రోద్భలముందని సమాచారం. హైదరాబాద్ స్టేట్‌ను, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సభ పెట్టించింది. ఆ సభ ద్వారానే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఆవశ్యకతను తమ పార్టీ ప్రతినిధుల ద్వారా చెప్పించింది. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఒక్కటే. అప్పుడు పాలకులకు, పాలితులకు మధ్య చెప్పలేనంత ఖాళీ ఉండేది. నాయకులు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసి చెప్తేగాని చాలా విషయాలు ఎవరికీ తెలిసేవి కాదు. ఇప్పుడు అలా కాదు, సమాచారం క్షణాల్లో ప్రజల ముంగింట్లో ఉంటుంది. మీడియా విస్తృతి వల్ల సమాచారమే కాదు తొక్కిపెట్టాలని చూసిన చేదు నిజాలు కూడా బహిర్గతమవుతున్నాయి. ఆ రోజు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగు మాట్లాడేవారంత ఒక రాష్ట్రంలో ఉండాలని, అది అవశ్యమని చెప్పారు. అప్పటి వరకూ క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయాలతో సంబంధం లేకుండా అదే ప్రజల అభిమతమని కూడా తేల్చేశారు. తెలంగాణ ప్రజల్లో ఎక్కువశాతం మందితో సంబంధం లేకుండానే విలీన ప్రక్రియ ముగిసిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే ప్రజలు తెలంగాణ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమాలు నడిపి చూపించారు. తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు కలిసి 42 రోజుల పాటు నిర్వహించిన సకల జనుల సమ్మె చారిత్రాత్మకం. రాష్ట్రంతో పాలు పలు ప్రాంతాలకు వెలుగుదివ్వెలందించే సింగరేణి బొగ్గు గనుల్లో తట్టాచెమ్మాస్ కదల్లేదు. ఒక్క బొగ్గు పెళ్లకూడా వెలికి రాలేదు. ఆర్టీసీ బస్సు చక్రాలు డిపోలు దాటి ముందుకు కదల్లేదు. వైద్యులు కూడా నల్లరిబ్బన్లు గుండెలపై ధరించే సేవలందించారు. పది జిల్లాల ప్రజలు తమ జీవనాన్ని తామే స్తంభింపజేసుకున్నారు. ఊళ్లకు ఊళ్లు రైలు పట్టాలపైకి వచ్చి ఉత్తర – దక్షిణ భారతాల మధ్య సంబంధాలను ఆపేశారు. ఊరూరు, గడప గడప తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరు మార్గాన ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకొని వేలాడారు. తెలంగాణ సాధన కోసం చేసిన ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయేది 2009 సంవత్సరం. విద్యార్థుల నేతృత్వంలో సాగించిన పోరుకు కేంద్ర ప్రభుత్వం తలవంచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రకటించింది. సీమాంధ్ర పెత్తందారులు పన్నిన కుట్రతో కపట ఉద్యమంతో కేంద్రం తన ప్రకటన నుంచి వెనక్కి వెళ్లింది. ఆరోజు నుంచి కాంగ్రెస్, టీడీపీలను తెలంగాణ ప్రజలు బహిష్కరించినంత పనిచేశారు. తర్వాతికాలంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. 2010 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ అర్బన్, సిర్పూర్ నియోజకవర్గాల్లో డిపాజిట్ దక్కగా మిగతా స్థానాల్లో కనీసం గౌరవ ప్రధమైన ఓట్లు కూడా దక్కలేదు. ఆ తర్వాతి ఉప ఎన్నికల్లో ఆయా పార్టీల పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారింది. తెలంగాణపై ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమాలు సాగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకు వేళ్లాడ్డమే తప్ప ప్రజల ఆకాంక్షలపై పెదవి విప్పలేదు. పై పెచ్చు కొందరు నాయకులు జై తెలంగాణ అని ఉద్యమించే వారికి తమ మందిమాగదులతో దాడులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుసరిస్తున్న దాటవేత ధోరణిని నిరసిస్తూ సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు సహా ఎంపీలు మందా జగన్నాథం, డాక్టర్ జి. వివేకానంద, ఓ మాజీ మంత్రి పలువురు నేతలు కొద్ది కాలం క్రితం పార్టీని వీడారు. అంతకుముందు ఇద్దరు మంత్రులు పదవులు వదులుకున్నారు. వారిలో ఒక మాజీ మంత్రి సహా ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి ఉద్యమ పార్టీలో చేరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై గొంతు విప్పలేదు. యూపీఏ ప్రభుత్వమూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ సమస్యను ఎన్నికల వరకూ సాగదీసి అప్పుడు ఏదో ఒకటి చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకోవచ్చనే ధోరణి కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో టీ జేఏసీ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. చలో అసెంబ్లీ జరుగకుండా చూస్తామన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నాలు సఫలం కాలేదు. పది జిల్లాల్లో దాదాపు 15 వేల మందిని బైండోవర్లు, అరెస్టులు చేసినా, అసెంబ్లీకి చూట్టూరా ఐదంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేసినా తెలంగాణవాదులు వాటన్నింటినీ ఛేదించుకొని దూసుకువచ్చారు. అసెంబ్లీ ఎదుట టీ జేఏసీ, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రయత్నాలు బెడిసికొట్టడం, తీవ్ర నిర్బంధం మధ్య కూడా ప్రజలు అసెంబ్లీ ఎదుట ఆందోళన నిర్వహించడం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉనికికే సవాల్ విసిరింది. చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు సీమాంధ్ర సర్కారు సాగించిన ధమనకాండ మామూలుది కాదు. దానికి తాలుకూ ఫలితాలు 2014 ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనికి ఏదో ఒక ముగింపు ఇవ్వాలని తలచింది. అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఓ సభ నిర్వహింపజేసింది. ఆ వేదికపై నుంచి ప్రజల అభిమతాన్ని ఆవిష్కరించింది. తెలంగాణకే కాదు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకే వ్యతిరేకి అని ముద్రపడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణపై స్పందించారు. గతంలో చాలా మంది చాలా డెడ్‌లైన్లు పెట్టినందున తెలంగాణపై తానెలాంటి గడువు పెట్టబోనని పేర్కొన్నాడు. 2004 ఎన్నికల తర్వాత రెండో ఎస్సార్సీ వేయాల్సి ఉన్నా తాము విఫలమయ్యామని, తెలంగాణ సమస్యకు త్వరలోనే ముగింపు వస్తుందని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకిగా పేరున్న గవర్నర్ నర్సింహన్ కూడా తెలంగాణ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ప్రకటించాడు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో వ్యూహంలో భాగమేనని పార్టీ వర్గాలే మీడియాకుల లీకులిస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణపై తేల్చేస్తుంది అనే సంకేతాలే వస్తున్నాయి. మరి ఇది ఎంతమేరకు నిజమవుతుందో త్వరలోనే తేలుపోనుంది.