తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు
200 యూనిట్ల లోపు వాడే గృహాలు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు
హైదారబాద్,మార్చి27(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెరుగుదలకు విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4400 కోట్ల మేర సబ్సిడీని భరిస్తుండగా 800 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు ఇఆర్సి ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే గృహాలు,కుటీర పరిశ్రమలకు విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు.400 యూనిట్లు మించి అంతా ఒకే స్లాబ్ లో చార్జీలు వసూలు చేస్తారు.కోళ్ల పరిశ్రమకు విద్యుత్ చార్జీలలో యూనిట్ కు రెండు రూపాయిల చొప్పున రాయితీ ఇస్తున్నారు.గృహాలపై 1.3 శాతం మాత్రమే విద్యుత్ చార్జీలు పెరుగుతాయని చెబుతున్నారు. మొత్తం విూద నాలుగు శాతం పైగా విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయని అంచనా.ఎపిలో 941 కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలు పెంచగా,ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వంతు అయింది. ఇటీవలే ఎపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును ఈఆర్సీ చైర్మన్ అలీఖాన్ ధరల వివరాలను ప్రకటించారు. పెరిగిన స్లాబ్ రేట్స్ ప్రకారం.. 200 యూనిట్లలోపు గృహవినియోగదారులకు చార్జీల పెంపు ఉండబోదుని, దీంతో 80 లక్షల మందిపై ఎలాంటి చార్జీల భారం పబదన్నారు. రెండు వందలకు పైగా యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారులపై 1.3 శాతం మేర చార్జీల పెంపు ఉంటుందని చెప్పారు. అదేవిధంగా హెచ్‌టి, ఎల్టీ వినియోగదారులపై పెంపుదల భారం 4.42 శాతం చార్జీల భారం ఉంటుందని అలీఖాన్ వివరించారు. ఇకపోతే వ్యవసాయం కాటేజీ ఇండస్ట్రీకి చార్జీలు పెంచలేదన్నారు. మొత్తంగా విద్యుత్ చార్జీల పెంపు వల్ల ప్రజలపై రూ. 816 కోట్లు భారం పడనుందని తెలిపారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం రూ. 4,227 కోట్ల రాయితీ ఇస్తుందని, 400 యూనిట్ల తర్వాత ఒకే స్లాబ్ ఉంటుందని ఈఆర్సీ చైర్మన్ అలీఖాన్ వివరాంచారు.