తెలంగాణవాదులకే ఎందుకు అనుమతివ్వరు?
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ప్రజాస్వామ్యంలో హక్కుల సాధన కోసం ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది. రాజ్యాంగమే పౌరులకు ఈ హక్కును కట్టబెట్టింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కును హరిస్తోంది. శాంతిభద్రతలను సమస్యగా చూపి తమ ఆకాంక్షలు చాటుకునే అవకాశాన్ని కాలరాస్తోంది. తెలంగాణ ఉద్యమంలో 1969లో మినహా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నది లేదు. కేవలం హింసనే సాకుగా చూపి అప్పటి సీమాంధ్ర సర్కారు పెద్దలు 369 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారు. ఆ తర్వాత కూడా తెలంగాణ సాధన కోసం ఉద్యమం సాగుతూనే ఉంది. పది జిల్లాల ప్రజలు వెనుదిరిగి చూడకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. 1969లో విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం ఇప్పటికీ వారి మార్గనిర్దేశనంలోనే సాగుతోంది. తెలంగాణను దాదాపుగా సాధించుకున్నామనుకున్న 2009 డిసెంబర్ 9 ప్రకటనకు ముందూ, తర్వాత ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పోషించిన పాత్ర ఇంత అని చెప్పలేం. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి గడప ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటోంది. స్వపరిపాలన, ఆత్మగౌరవమే లక్ష్యంగా పోరుదారిన నడుస్తోంది. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కొళ్లగొట్టారు. ఉపాధి అవకాశాలను లాక్కున్నారు. హైదరాబాద్ నగరాన్నే తాము అభివృద్ధి చేశామంటూ ఇప్పుడు బీరాలు పలుకుతున్నారు. భారత దేశానికి స్వతంత్రం రాకపూర్వమే హైదరాబాద్ ప్రపంచ శ్రేణి నగరం. హైదరాబాద్ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించిన కుతుబ్‌షాహీ నవాబులు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ఇప్పటి అసెంబ్లీ, భవనం హైకోర్టు సహా ముఖ్యమైన భవనాలన్నీ అసఫ్‌జాహీ నవాబులు నిర్మించినవే. ఆ రోజుల్లోనే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఉన్న నగరం. అలాంటి హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామంటూ దోపిడీ వర్గాలు అబద్ధాలు వల్లెవేస్తుంటే గుండె మండి ప్రత్యేక పోరును ఉధృతం చేశారు. సీమాంధ్రుల పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలోని తాగునీటి వనరులు పనికిరాకుండా పోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఉపాధి లేక తెలంగాణ ప్రజలు బొగ్గుబాయి, బొంబాయి, దుబాయికి వలస వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. సీమాంధ్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని, తెలంగాణ జిల్లాల్లోని సహజ వనరులు, భూములు కొళ్లగొట్టి పరిశ్రమలు పెట్టుకొని తమ ప్రాంతం వారికే ఉద్యోగాలిచ్చుకున్నారు. కొందరు తెలంగాణ వాసులకు పని కల్పించిన నాలుగో తరగతి ఉద్యోగుల స్థాయిని దాటనివ్వలేదు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సీమాంధ్ర పెత్తందారులు చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. ప్రజాస్వామ్యబద్ధంగా , భారత సార్వభౌమత్వానికి లోబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తుంచి వేయాలనే సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రజాస్వామికంగా పౌరులకు సంక్రమించిన హక్కులను హరిస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం పౌర ఉద్యమాలు నిర్వహించడం పరిపాటి. ఒకే అంశంపై వివిధ స్థాయిల్లో ఉద్యమాన్ని సాగించిన సంఘాలు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం సహజం. అలాంటి ఎన్నో నిరసనలకు పాలకులు, పోలీసులు గతంలో అనుమతిచ్చారు కూడా. కానీ తెలంగాణవాదులనే శత్రువులుగా పరిగణిస్తూ ప్రతి కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నారు. అడుగడుగునా నిర్బంధాలు పెడుతున్నారు. పాలకులు ఎంతగా అణచాలనే చూస్తే ఉద్యమం అంతగా బలంగా ఎగస్తోంది. గతంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మిలియన్ మార్చ్, సాగరహారానికి అనుమతి నిరాకరించినా భారీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు చలో అసెంబ్లీకి తరలిరావడానికి గడప గడప సిద్ధమవుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటి వరకూ ముందు వరసలో ఉన్న వాళ్లను గుర్తించి పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తెలంగాణవాదులను అడ్డుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ గడ్డం పోలీసు వలయంలో ఉంది. ప్రజల హక్కును హరించేందుకు సిద్ధపడ్డ పాలకులు అప్రజాస్వామికంగా పౌరులను అరెస్టు చేసి ఠాణాల్లో నిర్బంధిస్తున్నారు. తద్వారా రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నారు. పోలీసులు, సర్కారు అనుమతివ్వనంత మాత్రాన, అడుగడుగునా నిర్బంధాలు పెట్టినంత మాత్రాన అసెంబ్లీ ముట్టడికి ఎవరూ రారనుకోవడం ప్రభుత్వ అవివేకమే అవుతుంది. సర్కారు కుట్ర పటాపంచలయ్యేందుకు మరో 48 గంటల గడువే ఉంది. ఈలోగా సర్కారు చలో అసెంబ్లీకి అనుమతి ఇచ్చి ప్రజల ఆకాంక్షలను చాటుకునే అవకాశమివ్వాలి. అణచివేయాలని చూస్తే లొంగే స్థితిలో తెలంగాణ ఉద్యమం లేదు. పాలకులు పట్టింపులకు పోతే మొదటికే మోసం వస్తుంది. ఇది నిజం.. ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకొని తెలంగాణ ప్రజలు నిరసన తెలుపుకునే అవకాశం కల్పించాలి.