తెలంగాణ ఇవ్వకుంటే..

కాంగ్రెస్‌ భూస్థాపితమే
ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం
లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష
లండన్‌ : తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితం కాక తప్పదని ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం పేర్కొన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌  ఆధ్వర్యంలో సోమవారం లండన్‌లోని నెహ్రూ విగ్రహం వద్ద తెలంగాణ సాధన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణపై చర్చలు కొనసాగుతాయని, దీనికి నిర్ణీత గడువు చెప్పలేమంటూ ఆజాద్‌, షిండేలు వ్యాఖ్యానించడంపై ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రుల డబ్బులకు ఆశపడి తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తుందన్నారు. ఎన్ని కుట్రలు కుత్రంతాలు చేసినా తెలంగాణ సాధించుకునే సత్తా తమ ప్రాంత ప్రజలకు ఉందన్నారు. వెంటనే హైదరాబాద్‌ను రాజధానిగా ప్రకటించి తెలంగాణ ఏర్పాటు కోసం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పి కేసీఆర్‌ నాయకత్వంలో 15 ఎంపీ, 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకుని రాష్ట్రం సాధించుకుంటామన్నారు. టీఈఎన్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ తల్లి బిడ్డల బలిదానాలతో తల్లడిల్లుతోందని, ఇంకా భరించే శక్తి తమకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఇవ్వకుంటే కోదండరాం ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాధన దీక్షలో టీఈఎన్‌ఎఫ్‌ను భాగస్వామ్యులను చేయడం అభినందనీయమన్నారు. టిజేఏసీ అనుబంధ ప్రవాస తెలంగాణ సంస్థగా అన్ని కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఉద్యమం కీలక దశ చేరుకుందని తెలంగాణ శక్తులన్నీ ఏకమై ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. యూకే నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ సాధన దీక్షను విజయవంతం చేసినందుకు వారిని అనిల్‌ కుర్మాచలం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ లండన్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ పెద్దిరాజు, సంయుక్త కార్యదర్శులు అశోక్‌ దూసరి, సిక్క చందు, హరి నవాపేట్‌, రాజేశ్‌, మల్లారెడ్డి, విష్ణురెడ్డి, శశిధర్‌ చేబర్తి, అబూజర్‌ మొహ్మద్‌, వెంకట్‌రెడ్డి, నిక్కిరావు, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.