తెలంగాణ కులగణన భూకంపం సృష్టించింది

` అన్ని కాంగ్రెస్‌ పాలితరాష్ట్రాల్లో నిర్వహిస్తాం: రాహుల్‌
` ఆర్‌ఎస్‌ఎస్‌,భాజపాలు ఓబీసీల చరిత్రను చెరిపివేశాయి
` భారత ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలు
` అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోంది
` వారి ప్రయోజనాలను కాపాడటం కోసం నేను చేయగలిగినంత చేయలేకపోయాను
` ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నా..
` బాగిదారి న్యాయ మహా సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ
న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. అలాంటి వారికి అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని ఆరోపించారు.దిల్లీలో జరిగిన బాగిదారి న్యాయ మహా సమ్మేళనం కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారని దుయ్యబట్టారు. ‘’2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఈ రెండు దశాబ్దాల కాలం వెనుదిరిగి చూసుకుంటే.. ఓబీసీల ప్రయోజనాలను కాపాడటం కోసం నేను చేయగలిగినంత చేయలేకపోయానని అనిపిస్తోంది. ఆ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాలని అనుకుంటున్నా. సమస్యలు సరిగా అర్థం చేసుకుంటేనే పరిష్కారం సాధించగలం. అందుకోసం చరిత్ర తెలుసుకోవాలి. దేశంలో దళితుల చరిత్రను అంబేడ్కర్‌ అర్థం చేసుకున్నారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది. భాజపా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశపూర్వకంగా ఆ చరిత్రను చెరిపేశాయి’’ అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘’ఓబీసీలు ఉత్పాదకశక్తికి ప్రతీకలు. కానీ, వారి శ్రమకు తగిన ఫలితాలను అందుకోలేకపోతున్నారు. అన్ని రంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్‌ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారు? మీడియా రంగంలో వారికి స్థానం ఎక్కడుంది? కుల గణన కూడా ఎప్పుడో చేయాల్సింది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో మేం తప్పకుండా కులగణన పూర్తిచేస్తాం’’ అని కాంగ్రెస్‌ ఎంపీ తెలిపారు.
ప్రాంతీయ భాష ముఖ్యమే కానీ..
ఈ సందర్భంగా భాషా వివాదంపైనా రాహుల్‌ స్పందించారు. ‘’అభివృద్ధిలో విద్యే ప్రాధాన్యం. ఇంగ్లిష్‌ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయి. భాజపా నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతీయ భాషలూ ముఖ్యమే. దానితో పాటు ఆంగ్ల ప్రాధాన్యాన్నీ అర్థం చేసుకోవాలి’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.