తెలంగాణ కొత్త డీజీపీగా ఏకే ఖాన్‌?

3

అనురాగ్‌ శర్మకు ఉద్వాసన!

సూర్యాపేట కాల్పులు, తదనంతర పరిణామాలపై సర్కారు గుర్రు

ప్రతిష్ట మసకబారటానికి డీజీపీ కారణమని భావిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13(జనంసాక్షి) : తెలంగాణ నూతన డీజీపీగా ఏకేఖాన్‌ను నియమించనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం, సిమీ కార్యకర్తల కాల్పుల్లో నలుగురు పోలీసులు చనిపోవడం, పోలీసులు వ్యవహరించిన తీరుతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందని ఇంటలిజెన్స్‌ వర్గాల నివేదికతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికకోసం కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నప్పుడు నగర పోలీసు కమిషనర్‌గా పనిచేయటమేకాక, తెలంగాణవాదుల ప్రశంసలందుకోవడంతోపాటు,. అప్పుడు జరిగిన కృత్రిమ మతకలహాల సందర్భంగా..ఇందులో కుట్రకోణం దాగి ఉందని ధైర్యంగా ప్రకటించి సీమాంధ్ర పాలకుల సర్కారును లెక్కచేయలేదు.ఆ సందర్భంగా ఉద్యమనేత కేసీఆర్‌ ప్రశంసలు కూడా అందుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. సూర్యాపేట కాల్పుల అనంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పోలీసు శాఖ… ఉగ్రకోణంలో పరిశీలించకుండా, యూపీ, బీహార్‌ దొంగల ముఠా పనిగా డీజీపీ అనురాగ్‌ శర్మ మీడియాతో పేర్కొనడమే కాకుండా, ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ఎన్‌ఐబీ, ఆంధ్రా డీజీపీ సిమీ కార్యకర్తలుగా పేర్కొన్న తర్వాతగానీ ఉగ్రకోణాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించలేదని ఆరోపణలు గుప్పుమన్నాయి. అర్వపల్లిలో బాహాటంగా తుపాకులు పట్టుకుని సిమీ కార్యకర్తలు తిరుగుతూ ఉంటే, ఐజీ, డీఐజీ స్థాయిలో ఉన్నతాధికారులు జిల్లాలోనే మకాం వేసి ఉండగా మళ్లీ దొంగలుగా భావించే పోలీసులను పురమాయించారు. దీంతో చేజింగ్‌ పార్టీ బుల్లెట్‌ ప్రూఫ్‌లు, కవచాలు, ముందస్థు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, ఉగ్రవాదులను తక్కువ అంచనా వేయటంతో మరో ఇద్దరు పోలీసులను బలివ్వాల్సి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌బాస్‌ అనురాగశర్మకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

నల్గొండ జిల్లా సూర్యపేట ఆర్టీసి బస్టాండ్‌లో జరిగిన సంఘటనతో పాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలను చక్కదిద్దడంలో అనురాగశర్మ పూర్తిగా విపలమయ్యారన్న ఆరోపణలు ఇటు అధికార పార్టీలో అటు విపక్షంలో వెల్లువెత్తడంతో ఆయనను డీజీపీ పదవి నుంచీ తప్పించి ఆ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మరో వారం రోజుల్లో అనురాగ్‌శర్మకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. డిజీపినీ మార్చడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పలువురు మంత్రులు, అధికార ప్రతినిధులు బాహాటంగానే ప్రకటనలు చేస్తుండడం అనురాగశర్మ మార్పుకు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సూర్యపేట బస్టాండ్‌లో పోలీసులపై దాడి జరిపి తుపాకిని ఎత్తుకెళ్ళింది దోపిడీ దొంగలని, ఉగ్రవాదుల ఆనవాలు ఎంతమాత్రం లేవని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ప్రకటించడాన్ని పోలీసు వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దోపిడీ దొంగలు పోలీసులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ఎలా జరుపుతారన్న విషయాన్ని డిజీపీ తెలుసుకోకపోవడం పట్ల అధికార పార్టీకి చెందని నేతలు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సూర్యపేట సంఘటన జరిగిన తర్వాత అదేరోజు రాత్రి జిల్లా వ్యాప్తంగా కూంబింగ్‌ నిర్వహించి జల్లెడ పట్టివుంటే అర్వపల్లి సంఘటన జరిగి ఉండేది కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లాలోని జానకీపురం వద్ద పోలీసులు నుంచి అపహరించిన కార్బైన్‌ను చేతపట్టుకొని భయానక వాతావరణం సృష్టించి కాల్పులకు తెగపడ్డారని విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎస్సై సిద్ధయ్య, కానిస్టేబుల్‌ నాగరాజులు చనిపోయిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే డిజీపీ అనురాగశర్మను తప్పించే అంశానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గరవ్నర్‌ నర్సింహన్‌ను కలిశారు. గవర్నర్‌ దృష్టికి డిజీపీ మార్పు అంశాన్ని కేసీఆర్‌ తీసుకువెళ్ళారని సమాచారం.

అనురాగశర్మను తప్పిస్తే డిజీపీగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబి) డైరెక్టర్‌ జనరల్‌ అబ్దుల్‌ ఖయ్యుంఖాన్‌ (ఏకే ఖాన్‌)ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అనంతపురం జిల్లాకు చెందిన ఏకే ఖాన్‌ తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కవిూషనర్‌గా, ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.  ఉగ్రవాదలు దాడిచేసి పోలీసులను హతమార్చిన నల్గొండ జిల్లా ఎస్పీగా ఖాన్‌ పనిచేశారు. గూడచార వ్యవస్థ పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ఏకేఖాన్‌ను డీజీపీగా ఎంపిక చేస్తే రాష్ట్రంలో నల్గొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయవచ్చన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సూర్యాపేట హైటెక్‌ బస్టాండు వద్ద కానిస్టేబుళ్లు, ¬ంగార్డులపై కాల్పులకు తెగబడింది యూపీ, బీహార్‌ గ్యాంగ్‌ సభ్యులుగా అనుమానిస్తున్నట్లు, వాళ్లను సిమీ ఉగ్రవాదులుగా గుర్తించడంలో, ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమయ్యారు. ఇదే అంశంపై నల్గొండ జిల్లా ఎస్పీ ప్రభాకర్‌ రావు పై వేటు పడింది. ఈ నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మపై కూడా వేటు పడనుందని సమాచారం.