తెలంగాణ కోసం మరో బలిదానం
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
మంచిర్యాలలో ఘటన.. రాయికల్‌లో విషాదం
రాయికల్, జనవరి 28 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పూటకోమాట మాట్లాడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇక రాదు, మన బతుకులు మారవనే దిగులుతోనే యువత ఆత్మబలిదానాలకు పాల్పడుతూనే ఉంది. సోమవారం ఆజాద్ ప్రకటనతో కలత చెంది ఎల్లారెడ్డిపేట మండలం నాగంపేటలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహేశ్ పరిస్థితి మరింత విషమించగా, మంగళవారం జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయికల్‌కు చెందిన భారతపు శేఖర్(32) కారుడ్రైవరుగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. రెండురోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఆదివారం రాత్రి తెలంగాణపై కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు కలతచెంది కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వదు, మన బతుకులు మారవని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే శేఖర్ మనస్తాపానికి గురై మంచిర్యాలలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ బలిదానంతోనైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకుల్లో మార్పు రావాలని తెలంగాణవాదులు కోరుతున్నాడు. శేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతో రాయికల్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు మణిచరణ్, కూతురు అక్షయ ఉన్నారు. శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి తెలంగాణకోసం మంచిర్యాలలో రైలు కిందపడి ఆత్మబలిదానం చేసుకున్న శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రాయికల్ జేఏసీ నాయకులు, ఆటోటాక్సి డ్రైవర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శేఖర్ బలిదానంతోనైనా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు కనువిప్పు కలిగి తమ పదవులకు రాజీనామాలు చేసి రాష్ట్రంకోసం ఉద్యమించాలన్నారు.