తెలంగాణ నవశకం… ఓ నవయుగం

CC

పరపీడన నుంచి విముక్తి

ఏడాది బాలుడు, ఎన్నో విజయాలు

తెలంగాణ ఆవిర్భావం భవిష్యత్తుకు భరోసా

స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతికి ప్రశంసలు

తొలి యేడాదే లక్ష కోట్ల పైచిలుకు బడ్జెట్‌

ఏడాదిలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు

ప్రతిష్టాత్మకంగా మిషన్‌ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌ పథకాలు

సింగిల్‌ విండో విధానంతో పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్‌

విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కించిన సర్కారు

ఉద్యోగులకు, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు వరాలు

వృద్ధులు, వితంతువులకు 1000, వికలాంగులకు 1500 పెన్షన్‌

హైదరాబాద్‌లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ఐటీ దిగ్గజాల యూనిట్లు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌, జూన్‌1(జనంసాక్షి)  : అరవయేళ్ల సుదీర్ఘ స్వప్నం. ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్న ఉద్యమం, మరెందరో లాఠీలకు, తూటాలకు ఎదురు నిలిచి పోరాడిన ఉద్యమం. చివరకు ఉద్యమం గమ్యాన్ని ముద్దాడింది.పరపీడన నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వరాష్ట్రమై గర్జించింది. తెలంగాణ బిడ్డల భవిష్యత్తుకు భరోసానిచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఉద్యమం సాగినా 1969 ఉద్యమం అణచివేతకు గురికావడానికి కొందరు నేతలు కారణమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి నాడు వీళ్లు దాసులుగా మారటంతో ఉద్యమం నీరుగారింది. అలా నివురుగప్పిన నిప్పులా మారిన తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో మళ్లీ వేళ్లూనుకుంది. మేధావులు, విద్యావేత్తలు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దశాబ్దాలుగా వినిపిస్తూనే వచ్చారు. అలా ఉద్యమాన్ని నిలబెట్టి, ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసుకునే దిశగా ఒక కరిష్మా ఉన్న నేత కోసం వెతుకుతున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్‌ తదితరులకు ఒక ఉద్యమ సింహం దొరికింది. అదే కేసీఆర్‌. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జలదృశ్యంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి యావన్మంది తెలంగాణ బిడ్డలను ఉద్యమంవైపు మళ్లించారు. ఎందరో విద్యార్థులు, మేథావులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు అలా అందరూ ఏకమై వటవృక్షంలా మారేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల బలిదానాలు, ఎన్నో త్యాగాలు. చివరకు త్యాగాలు ఫలించినయి. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. జూన్‌2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నాడు కేంద్రంలో అధికారం సాగించిన సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి సంవత్సర కాలం గడిచింది. ఏడాదిలో తెలంగాణ సాధించిందేంటి? తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమనేత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచారు. మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నారా? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఇక ”బంగారు తెలంగాణ పునర్నిర్మాణం” నినాదాన్ని భుజానికెత్తుకున్న సర్కారు పనితీరు ఎలా వుంది. ఈ ఏడాదిలో ఏం జరిగింది? ఎన్నో అద్భుత చారిత్రక ఘట్టాలకు సాక్షీభూతమైన తెలంగాణ ఉద్యమం లక్ష్య సాధన దిశగా పయనిస్తోందా? ఏడాది పాలన, ఏడాది సంబురాల నేపథ్యంలో ఒక్కసారి పరిశీలిద్దాం. రాజధానితో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధించుకుని తెలంగాణ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదో విభిన్నమైన డిమాండ్‌. సాధారణంగా రాజధానికి దూరంగా ఉండే ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండు ఉంటుంది. కానీ తెలంగాణ అందుకు భిన్నం. సమైక్య రాష్ట్రం ఏర్పడక ముందున్న ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండుతో ఉద్యమం జరిగింది. మెజారిటీ సభ్యులున్న ఆంధ్రోళ్లను ఎదిరించి, వాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి మానీళ్లు, మానిధులు, మా ఉద్యోగాలు మాకే అంటూ నినదించి ఉద్యమకారులు తెలంగాణ కల సాకారం చేసుకున్నరు. ఇప్పుడు సర్కారు ముందున్న సవాళ్లు ఎన్నో. ఎన్నో పోరాటాలతో, మరెందరో త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం బంగారు తెలంగాణ నినాదంతో ముందుకెళ్తోంది. తెలంగాణ అభివృద్ధి, అస్థిత్వం, భద్రత ప్రధాన ఎజెండాలుగా ముందుకెళ్తున్న సర్కారు ఈ ఏడాదిలో సాధించిన ఫలితాలు నిజానికి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెల్‌ లక్ష కోట్లకు పైగా ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టం. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులివ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి అని  ఆంధ్రా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడిన అదే అసెంబ్లీ వేదికగా తెలంగాణ సర్కార్‌ లక్షకోట్ల పైచిలుకు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఓ చారిత్రక ఘట్టం. ఎన్నో ప్రజాకర్షక కార్యక్రమాలనూ తొలి సర్కార్‌ రూపొందించిందనే చెప్పాలి. ప్రభుత్వం రూపొందించే బడ్జెట్‌లో ప్రజల ప్రాధాన్యతను గుర్తించి నిధులు కేటాయించడానికి ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరుతో గ్రామస్థాయి నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. ఇక గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ దరిచేరాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన కార్యక్రమమే ”సమగ్ర కుటుంబ సర్వే”. ఒకే ఒక్క రోజులో అగస్టు 19న నిర్వహించిన సకల జనుల సర్వే ప్రపంచం నలుమూలలా ఉన్న తెలంగాణ బిడ్డలను ఇక్కడికి రప్పించింది. వివరాలు నమోదు చేసుకుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలుఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు వలసాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైతే, తిరిగి వాటిని పునరుద్ధరించేందుకు ”మిషన్‌ కాకతీయ” పేరుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టింది సర్కార్‌. ఈ కార్యక్రమానికి అమెరికాలోని మిషిగన్‌ తదితర యూనివర్సిటీల స్కాలర్స్‌ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణలోని మొత్తం 46వేల513 చెరువులను పునరుద్ధరించేందుకు సర్కారు నడుంబిగించింది. తెలంగాణలో నీటి వనరులను పెంచి సస్యశ్యామలం చేయాలనేదే తెలంగాణ సర్కారు ధ్యేయం. ఇక సాగు నీటితోపాటు తాగు నీరుపైన కూడా తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టింది. రాగల నాలుగేళ్లలో ఇంటింటికి మంచినీళ్లివ్వకుంటే మళ్ల ఎలక్షన్లల్ల ఓటు అడగమని నేరుగా ముఖ్యమంత్రి కేసీఆరే అంటున్నారు. దీన్నిబట్టే మంచినీళ్లకోసం రూపొందించిన వాటర్‌ గ్రిడ్‌ పథకం పట్స సర్కారుకున్న నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టింది తెలంగాణ సర్కారు. ఇక హైదరాబాద్‌కు తలమానికమైన హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు నడుంబిగించిన కేసీఆర్‌ సర్కారు వేగంగా పనులు సాగిస్తోంది. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చి దిద్దే ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఉచిత వైఫై సేవలు ప్రారంభించారు. ఐటీ మంత్రి అమెరికా పర్యటనకు వెళ్లి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల ప్రతినిధులతో ఇక్కడ యూనిట్లు నెలకొల్పేలా ఒప్పందాలు చేసుకుని వచ్చారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం కోసం స్వచ్చ హైదరాబాద్‌ చేపట్టారు. స్కైవేలు, ఆకాశ హర్మ్యాలు నిర్మించతలపెట్టారు. నాళాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇలా చారిత్రక హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు బృహత్‌ప్రణాళికలతో పనులు చేపడ్తున్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా బస్తీబాట పేరుతో పేదల అవసరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణ సర్కారు బూజుపట్టిన పాత పథకాలను సమూలంగా ప్రక్షాళన చేసింది. మేనిఫెస్టోలో ప్రకటించని ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ నేపథ్యంలో మరణించిన అమరవీరుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీని నిలబెట్టుకుంది. అయితే అమరుల సంఖ్య విషయంలో కేసీఆర్‌ సర్కారు విమర్శలపాలైంది. వెయ్యిమంది అమరులయ్యారని గతంలో చెప్పిన టీయారెస్‌ సర్కారు ఏర్పాటు చేసినంక 459 మంది మాత్రమే ప్రాణత్యాగం చేశారని లెక్కగట్టింది. ఇది కాస్త వివాదాస్పదమైంది. ఇక మహిళల భద్రత కోసం షీటీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళల మన్ననలు పొందింది టీయారెస్‌ సర్కారు. షీటీమ్స్‌ వల్ల మహిళల పట్ల నేరాలు తగ్గిపోయాయని చెప్పొచ్చు. ఇక బడుగులకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాక పేదలు బతుకు వెళ్లదీసేందుకు ఉపాధిగా ఉన్న ఆటోలు, ట్రాక్టర్లు, ట్రాల్‌ీలకు రవాణా పన్ను రద్దు చేసింది కేసీఆర్‌ సర్కారు. ఇక ఆసరా పేరుతో వృద్దులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పెన్షన్‌ అందిస్తోంది తెలంగాణ సర్కారు. వీటితోపాటు బీడీ కార్మికులకు 1000రూపాయల భృతి కల్పిస్తున్నరు. ఆహారభద్రత కార్డులతో అర్హులందరికీ రేషన్‌ సరఫరా చేస్తున్నరు. ఇక తెలంగాణకు తలమానికమైన యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం 200 కోట్లతో ఆగమ శాస్త్రం ప్రకారం యాదాద్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఇక దారిద్య్రరేఖకు దిగవనున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ‘కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌” పథకంతో వివాహ సమయంలో 51వేల రూపాయల తక్షణ నగదు సాయం అందజేస్తున్నారు. ఇక రహాదారుల అభివృద్ధికి 11వేల 470 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలీసు వ్యవస్థ బలోపేతానికి అన్ని పోలీస్‌ స్టేషన్లకు జీపీఎస్‌, కంప్యూటర్‌ వ్యవస్థ ఉన్న అత్యాధునిక వాహనాలను కొనుగోలు చేసింది సర్కారు. తెలంగాణ కళలకు పునరుజ్జీవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ‘తెలంగాణ సాంస్కృతిక సారధి” పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి భారీగా నిధులు కేటాయించింది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ,ఎస్టీలకు మూడెకరాల భూమి పథకం అమలుకు తీవ్రంగా కృషిచేస్తోంది. ఇవేకాక సర్కారు హరితహారం, ఉద్యోగులకు 43 శాతం ఇంక్రిమెంట్‌ ప్రకటించడం, ఆర్టీసీ కార్మికులకు 47 శాతం ఫిట్‌మెంట్‌ లాంటివి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. గర్భిణిలకు, బాలింతలకు పౌష్టికాహారం లక్ష్యంతో ‘ఆరోగ్యలక్ష్మి’ ఫథకాన్ని రూపొందించారు. ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ కమిషన్‌ ఏర్పాటు చేసిన సర్కారు స్థానిక సంస్థల ప్రజాఫ్రతినిధులకు భారీస్థాయిలో గౌరవ వేతనాలు పెంచింది. ఇక బాబు కుట్రల మూలంగా ఏర్పడిన విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెంకించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న సర్కారు తెలంగాణలో ఇప్పటికే 24 గంటల కరెంటు అందిస్తోంది. 2018 చివరికల్లా 23వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. సౌరవిద్యుత్‌కూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానంతో ముందుకొస్తోంది. సింగిల్‌ విండో పాలసీతో పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా విధానాలు రూపొందించడమేకాక నేరుగా సీఎం కేసీఆరే వాటిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ ఫార్మాసిటీ, సినిమాసిటీ, ప్రోటాన్‌ వ్యాలీ, టెక్స్‌టైల్‌ పార్క్‌ తదితర జోన్‌లను 115 కోట్లతో నిర్మించ తలపెట్టారు. ఇక నిరుద్యోగుల్లో ఆశలు పెంచుతూ రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాసని సర్కారు సంకల్పిస్తోంది. ఇక సర్కారులో జరిగిన మార్పు చేర్పుల్లో కీలకంగా చెప్పుకోవాల్సింది డిప్యుటీ సీఎం రాజయ్య బర్తరఫ్‌. దళితుడే ముఖ్యమంత్రి అన్న కేసీఆర్‌ చివరకు దళిత వర్గానికి చెందిన రాజ్యను బర్తరఫ్‌ చేయటం వివాదాస్పదమైంది. అయితే మరో దళిత నేత కడియం శ్రీహరికి ఆ పదవి కట్టబెట్టి వివాదం సద్దుమణిగేలా చేశారు కేసీఆర్‌. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇప్పటికీ తరచూ వివాదాలు చెలరేగుతునే వున్నాయి. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు అక్రమంగా నీటిని తరలించుకు పోయేందుకు చంద్రబాబు పోలీసులను పురమాయించిన ఘటన చూశాం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడటంలో ఈ సర్కారు చూపిన చొరవ మరే సర్కారు చూపి ఉండేవి కావేమో! హైదరాబాద్‌ శాంతిభద్రతల అంశంలో గవర్నర్‌ జోక్యాన్ని సహించేది లేదని తెలంగాణ సర్కారు ఖరాఖండిగా తేల్చి చెప్పింది. కేసీఆర్‌ సర్కారు పాలనలో ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం, సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికలు రూపొందడం ఆహ్వానించదగ్గ పరిణామం. అంతేకాక తన పనితీరుతోనే కాకుండా వాగ్ధాటితో ప్రతిపక్షాలను నోరు మూయించగలుగుతున్నారు కేసీఆర్‌. అయితే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ జేఏసీని, ఫ్రజాసంఘాలను, మీడియాను లెక్కచేయడం లేదనే అపవాదును సీఎం కేసీఆర్‌ కొన్ని విషయాల్లో మూటగట్టుకున్నారు.  అయితే విమర్శలను సమర్థవంతంగా తన పనితీరుతో తిప్పికొడుతున్నారు. ఇటీవలే ఒ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది తిరిగి కేసీఆర్‌కే తమ ఓటు వేస్తామని, ముఖ్యమంత్రిగా కేసీఆరే తమ నేత అని తేల్చారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దీనోత్సవం జరుపుకోవాల్సిన శుభసందర్భంలో ఒక చీకటి అధ్యాయం తెరపైకి రావడం రాష్ట్రంలోనేకగాక యావత్‌ దేశంలో సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని టీడీపీ కీలకనేత రేవంత్‌రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 5కోట్లు లంచమిచ్చేందుకు ఆన నివాసానికి వెళ్లి 50లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వజూపుతూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దేశ రాజకీయాల్లో వెలుగుచూడని ఇలాంటి చీకటి కోణాలెన్నో. ఇప్పటికే తెలంగాణ ద్రోహుల పార్టీగా కీర్తిగడించిన టీడీపీకి రేవంత్‌ ఎపిసోడ్‌తో తెలంగాణలో బిచాణా ఎత్తేయాల్సిన పరిస్థితి దాపురించింది.  సెటిలర్ల ఓట్లతో గెలిచిన నలుగురు, మరో ఒకరిద్దరు తప్ప టీడీపీ అంతా ఖాళీ అవటం పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఏదేమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమవుతున్న తరుణం. స్వరాష్ట్రంగా అవసరించిన తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్యవాన్ని ఘనంగా జురుపుకుంటోంది. ఇలాంటి వేడుకలు మరెన్నో ఘనంగా నిర్వహించుకోవాలని, తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలవాలని జనంసాక్షి కోరుకుంటోంది.