తెలంగాణ నిరంతర విద్యుత్ సరఫరా ప్రణాళిక భేష్
కేంద్ర విద్యుత్ మంత్రి పీయుష్ గోయల్
హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ
విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయించాలని కోరిన సీఎం
హైదరాబాద్,జూన్4(జనంసాక్షి): తెలంగాణలో నెలకొల్పనున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని, నార్త్‌గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్‌కు ట్రాన్స్‌మిషన్ కారిడార్‌ను పూర్తిచేయాలని సిఎం కేసీఆర్ కోరారు. కేంద్ర విద్యుత్‌శాఖా మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొగ్గు కేటాయింపులు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంపై ప్రధాని మోదీకి రాసిన లేఖలను పీయూష్ గోయల్‌కు కేసీఆర్ అందజేశారు. చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌కు ఒప్పందం చేసుకున్నామని, ట్రాన్స్‌మిషన్ లైన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం.. మంత్రి గోయల్‌కు వివరించారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. నార్త్ గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్‌కు కారిడార్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ కేసీఆర్ డిగిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదికే కోతలు లేని విద్యుత్ సరఫరాపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌తో గోయల్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సౌర విద్యుత్ విధానం బాగుందని గోయల్ ప్రశంసించారు. 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావడాన్ని అభినందించారు. ఒకే ఏడాది 2,500 మెగావాట్ల సౌర విద్యుత్‌కు సిద్ధం కావడం ఏ రాష్ట్రంలో లేదని గోయల్ స్పష్టం చేశారు. బొగ్గు కేటాయింపు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణంపై గోయల్‌కు సీఎం లేఖలు రాశారు. చత్తీస్‌గఢ్‌తో మరో వెయ్యి మెగావాట్ల ఒప్పందం చేసుకుంటామని గోయల్‌కు సీఎం చెప్పారు. ట్రాన్స్‌మిషన్ల లైన్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని సీఎం కోరారు. ఈ భేటీలో విద్యుత్ శాఖ రాష్ట్రమంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపి కవిత పాల్గొన్నారు.
12న కేసీఆర్ దిల్లీ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 12న దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు ఉమాభారతి, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్‌తో ఆయన భేటీ కానున్నారు. రాష్టాన్రికి సంబంధించిన పలు అంశాలపై ఆయన కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.
ప్రాజెక్టులపై సిఎం కెసిఆర్ సవిూక్ష
మరోవైపు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల ప్రాజెక్టులపై సవిూక్ష నిర్వహించారు. సమావేశానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీటి పారుదల శాఖకు సంబంధించిన చేపట్టాల్సిన ప్రాజెక్టులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ నెల 11న పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుపై కూడా చర్చించినట్లు సమాచారం. మిషన్ కాకతీయ పనుల ప్రగతిపైనా చర్చించారు. ఇదిలావుంటే శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో 3,300 కుటుంబాలకు, ఖైరతాబాద్ నియోజకవర్గం ఎన్‌బీటీ నగర్‌లో 7 వేల కుటుంబాలకు సీఎం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.