తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్
పొన్నాలకు ఎమ్మెల్సీ, జానాకు ఢిల్లీ పిలుపు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా మాజీ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను తొలగించి ఉత్తం కుమార్ రెడ్డిని నియమించడం విశేషం. పైలట్‌గా పనిచేసిన ఉత్తమ్ వివాదాలకు దూరంగా ఉంటారు. అంతేగాకుండా అధిష్టానానికి దగ్గరగా ఉన్నారు. ఒకప్పుడు పైలట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకుని వెలతారో చూడాలి. అలాగే సిఎల్‌పి నాయుకుడిగా మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని ఆలోచనచేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే జానాను ఇప్పటికిప్పుడు మారుస్తారా లేదా అన్నదిచూడాలి. . వీరిని మారుస్తారని ఊహాగానాలు వస్తున్న తరుణంలో సడన్‌గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్ణయం తీసుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్సచేసే క్రమంలో వీరి మార్పు అనివార్యమైనట్లుగా కనిపిస్తోంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన ఉత్తం కుమార్ రెడ్డి ప్రస్తుతం వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారు. గత కొంతకాలంగా పొన్నాల ను తొలగించవచ్చని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ మార్పు జరిగింది. కాగా జానారెడ్డిని కూడా ఢిల్లీ రావాలని అధిష్టానం పిలవడం చర్చనీయాంశం అయింది. ఆయనను కూడా మార్చి మల్లుకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీలో పార్టీ వాణిని గట్టిగా వినిపించకపోవడంతో పాటు ఒకే జిల్లాకుచెందిన వారిని రెండు పదవుల్లో కొనసాగించడం ఇష్టం లేక మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం ఉద్వాసన పలికింది. అధిష్ఠానం పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి ఉదయమే దిల్లీ వెళ్లారు. ఇక మల్లు కూడా వివిధ సమస్యలపై తన వాణిని గట్టిగా వినిపిస్తున్నారు. ఇది ఆయనకు ప్లస్‌గా మారింది.