తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు కోటి ఆశలు

5

5A

 

జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి

ప్రజలతో మమేకమవ్వండి

కలెక్టర్లకు,ఎస్పీలకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్దేశం

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జనంసాక్షి): నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్కారుపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌లను ఆయన ఆదేశించారు. కొత్త రాష్ట్రం..కొంగొత్త ఆశలు…ఎన్నో సమస్యలతో సతమతమైన ఈ ప్రాంత ప్రజల ఆశలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న తరుణంలో, అందుకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కలెక్టర్లకు పిలుపునిచ్చారు. భయంకర పీడన, ఒత్తిడిలో నలిగిన ప్రాంతం తెలంగాణ. జవిూందార్లు, జాగీర్‌దారుల పాలనలో తెలంగాణ చాలా సమస్యలు ఎదుర్కొందన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని వివరించారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని అధికారులకు దిశానిర్థేశర చేశారు. వివిధ సమస్యలను ప్రజల దృక్కోణంలో పరిష్కరించే విధంగా ముందుకు వెళుతున్నామని, దానికి అనుగుణంగా అధికారులు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా వాటర్‌ గ్రిడ్‌, మిషన్‌ కాకతీయ,పరిశ్రమల ఏర్పాటు, ల్యాండ్‌ బ్యాంక్‌, హరితహారం,పేదలకు ఇళ్లు, విద్యుత్‌ ఉత్పత్తి తదితర అంశాలపై భవిష్యత్‌ ప్రణాళికను ఆవిష్కరింపచేశారు. హైదరాబాద్‌లోని ¬టల్‌ మారియట్‌లో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. పార్లమెంట్‌ చట్టం ఆమోదం పొందడంతో 2014 జూన్‌ 2న కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలిపారు. అన్ని మతాలు, కులాల ప్రజలు ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని తెలిపారు. వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. సీఎంగా, మంత్రులుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఎందరో వచ్చారు పోయారని తెలిపారు. ఎవరున్నా పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యం కూడా పేదల సంక్షేమమని పేర్కొన్నారు. అనేక చర్చలు జరిపి పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని అందులో ఇచ్చిన హావిూలను నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నామని వివరించారు. అనేక సమస్యలు పేదలను పట్టి పీడిస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం వేరు..తాము వేరు అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉందని అది మారాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు.జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు.ప్రజల ఆశలు నెరవేర్చాలని , ప్రజలు ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేకుండానే అదికార యంత్రాంగం స్పందించాలని ఆయన అన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాద్యత మనందరిపై ఉందని, పదవులు వస్తుంటాయని, పోతుంటాయని,కాని ఎంత బాగా పనిచేశామన్నది ముఖ్యమని కెసిఆర్‌ అన్నారు.తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని ఆయన స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనే తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ఎజెండా అని ఆయన అన్నారు. సమావేశానికి మంత్రులు, శాఖాధిపతులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.  ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ¬టల్‌ మారియట్‌లో జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు సదస్సు కొనసాగనుంది. సీఎస్‌ రాజీవ్‌శర్మ, పార్లమెంటరీ సెక్రటరీలు, వివిధ శాఖల అధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఎస్పీలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనర్లు హాజరయ్యారు.

మంచినీటి సమస్య నివారణకే వాటర్‌ గ్రిడ్‌

రాష్ట్రంలో మంచినీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని చేపట్టిందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించాలన్న ఉదాత్త ఆశయంతో దీనిని చేపట్టామన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇంటింటికి మంచినీటిని అందిస్తామని తాను ప్రజలకు చెప్పానని సీఎం అన్నారు. ఇంటింటికి తాగునీరు అందించక పోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. నాగరిక సమాజంలో ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అన్నారు. మంచినీటి కోసం ఎంతయినా ఖర్చుచేసి నీరు అందిస్తామని అన్నారు. ఈ పథకం రూపకల్పన జరిగిందని అన్నారు. నీటిని ప్రజల ముంగిటకు తీసుకుని వెళ్లాలన్నదే దీని లక్ష్యమన్నారు.

మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ

రైతుల పంటలకు సాగునీరు అందించేందుకు మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టామని తెలిపారు. మిషన్‌ కాకతీయలో అందరూ భాగస్వాములవుతున్నారని వెల్లడించారు. మిషన్‌ కాకతీయ పనులు వేగంగా జరుగుతున్నాయని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు. 1956కు ముందు తెలంగాణలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని కానీ సమైక్య పాలనలో చెరువుల విధ్వంసం జరిగి రైతులకు సాగునీరు అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వాటిని పునరుద్దరించేందుకే మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయని, మైనర్‌ ఇరిగేషన్‌ వ్యవస్థ దెబ్బతిందని వివరించారు. పరిశ్రమల కోసం కలెక్టర్లంతా ల్యాండ్‌ బ్యాంక్‌ స్థిరీకరించాలని సూచించారు. హరితహారం ఒక బృహత్తర కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. నర్సరీలలో పెంచుతోన్న మొక్కలను గ్రామగ్రామానికి సరఫరా చేయాలని తెలిపారు.

కరెంట్‌ కోతలకు చెక్‌

ఇకపై రాష్ట్రంలో కరెంట్‌ కోతలు ఉండవని ధైర్యంగా చెబుతున్నామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో విద్యుత్‌ ఉత్పత్తి కోసం రూ.91 వేల 5 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు.విద్యుత్‌ శాఖ అధికారుల పక్కా ప్రణాళికతో విద్యుత్‌ కోతలను అధిగమించామని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకు అనుగుణంగా మనమంతా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని తెలిపారు. శాంతిభద్రతలు లేకుంటే ఏవిూ లేనట్టేనని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌ కావొద్దని సూచించారు. ప్రజలకు మంచి పనులు చేస్తూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. మంచి పనిచేయడంలో ఉన్న సంతృప్తి ఎందులోనే లేదన్నారు.తెలంగాణ రాష్టాన్రికి పెద్ద చరిత్ర ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గతంలో తెలంగాణలో భయానక వాతావరణం ఉండేదని తెలిపారు. సాయుధ పోరాటం, నక్సలిజం సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటుండేదని పేర్కొన్నారు. ఎంతో దుఖఃకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవన్నారు. వీటన్నిటిని అధిగమించడానికి కృషి చేయాల్సి ఉందన్నారు.