తెలంగాణ ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

1

– 9 ప్రాజెక్టులను చేర్చండి

– పీఎంకేఎస్‌వైై కమిటీ సమావేశంలో మంత్రి హరీశ్‌

న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి):తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌ వై) సబ్‌ కమిటీ సమావేశంలో విజ్ఞప్తి చేశామని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. తెలంగాణ నుంచి 9 ప్రాజెక్టులు పీ.ఎం.కే.ఎస్‌.వై లో చేర్చాలని కోరినమన్నారు. ఢిల్లీలో జరిగిన జలమంథన్‌ సమావేశం తర్వాత వివరాలను ఆయన విూడియాకు వెల్లడించారు. నాబార్డు నుంచి ఎఫ్‌ఆర్బీఎం పెంచి అదనంగా రుణాలు ఇచ్చే అంశాన్ని చర్చించామన్నారు. మొదటి దఫా నిధులను ఆర్థిక సంవత్సరం మొదట్లో ఇవ్వాలని నిర్ణయించామని, ఏప్రిల్‌ కల్లా 50శాతం నిధులు ఇవ్వగలిగితే రాష్ట్రాలు పురోభివృద్ధిని సాధించగలగుతాయని చెప్పామని హరీష్‌ రావు వివరించారు. పీ.ఎం.కే.ఎస్‌.వై మొదటి దశలో 60 ప్రాజెక్టులను తీసుకోవాలని కమిటీ యోచిస్తోందని చెప్పారు. గిరిజన, కొండ ప్రాంతాలు, వామపక్ష ప్రభావ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం 60శాతం గ్రాంట్లు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసిందని హరీష్‌ రావు తెలిపారు. 2012 మార్చి 31 నాటికి ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు అదనంగా 20శాతం డీపీఆర్‌ పరిగణలోకి తీసుకోవాలని చెప్పినమన్నారు. ఈ నెల 28లోపు అన్ని రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని కోరినమని చెప్పారు. రాజస్థాన్‌ లోని సుచార్‌ ప్రాజెక్టు పనితీరును ఏప్రిల్‌ 9న అధ్యయనం చేయనున్నామని, ఏప్రిల్‌ 10న రాజస్థాన్‌ లో జలమంథన్‌ తదుపరి సమావేశం ఉంటుందని హరీష్‌ రావు ప్రకటించారు. మిషన్‌ కాకతీయపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను మంత్రి హరీష్‌ రావు ఖండించారు. కాంగ్రెస్‌ నేతలు మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో రూ. 1700 కోట్లు జేబులు నింపుకున్నారని విమర్శించారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులను తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తోందని, తెలంగాణ పనితీరును అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని హరీష్‌ రావు గుర్తుచేశారు.