తెలంగాణ మండలిలో తెదేపా ఖాళీ

6

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు తెలుగుదేశం వాణి లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుడుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, మరో సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఇద్దరూ పదవీ విరమణ చేయడంతో పార్టీ వాణి వినిపించేవారు లేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నవాళ్లలో కొందరు టిఆర్‌ఎస్‌లో చేరారు. మరికొందరు రిటైర్‌ అవుతున్నారు. దీంతో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. నిజానికి మరో ఐదుగురు ఎమ్మెల్సీలు టిడిపికి ఉన్నా,వారంతా తాము టిఆర్‌ఎస్‌ లో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు.దాంతో టిడిపికి ఒక సభ్యుడు కూడా లేనట్లయింది.పార్టీ మారినవారిలో కూడా బొడకుంటి వెంకటేశ్వర్లు,బాలసాని లక్ష్మీనారాయణ ,పట్నం నరేంద్ర రెడ్డి లు కూడా రిటైరవుతున్నారు. కొందరు ఈనెలాఖరుకు ,మరికొందరు వచ్చే నెలాఖరుకు రిటైర్‌ అవుతున్నారు. దీంతో ఇక తెలంగాణ మండలిలో మళ్లీ ఎన్నికలు జరిగి గెలిస్తే తప్ప టిడిపికి ఛాన్స్‌ కనిపించడం లేదు. పదిమంది శాసనమండలి సభ్యుల పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. మరో ఏడుగురు సభ్యుల పదవీకాలం మే ఒకటో తేదీతో ముగియనుంది. ఈ పది హేడు మంది శాసనమండలి సభ్యులకు మండలి చివరిరోజు శుక్రవారం వీడ్కోలు పలికారు. డి.శ్రీనివాస్‌తో పాటు కె.ఆర్‌.ఆమోస్‌, నాగపురిరాజలింగం, కె.యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్‌, వి.భూపాల్‌రెడ్డి ,భానుప్రసాద్‌రావు, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి రిటైరయ్యే వారిలో ఉన్నారు. వీరితో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, బోడకుంటి వెంకటేశ్వర్లు, పి.నరేందర్‌రెడ్డి, పొట్ల నాగేశ్వర్‌రావు, పీర్‌షబ్బీర్‌ అహ్మద్‌, అరికెల నర్సారెడ్డి, డాక్టర్‌ కె.నాగేశ్వర్‌, కపిలవాయి దిలీప్‌కుమార్‌, బి.వెంకట్రావుల ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తోంది. మార్చి 29న కొందరు, మే ఒకటో తేదీన మరికొందరు.. మొత్తంగా నెల రోజుల వ్యవధిలోనే పదిహేడుమంది సభ్యులు మాజీలుగా మారుతున్నారు. కాగా, ఇటీవలే ముగిసిన పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల్లో విజయం సాధించిన రామచందర్‌రావు (బీజేపీ), పల్లారాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌)లు కొత్త సభ్యులుగా వచ్చే సమావేశాలకు హాజరు కానున్నారు. మళ్లీ సమావేశాలు జరిగే నాటికి అటు ఎమ్మెల్యే కోటా, ఇటు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే శాసనమండలి సమావేశాల చివరి రోజైన శుక్రవారం చైర్మన్‌ స్వామిగౌడ్‌ జూబ్లీహాలు ప్రాంగణంలో మంత్రులు, సభ్యులతో ఫొటోషూట్‌ ఏర్పాటు చేయించారు. మండలి చైర్మన్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులంతా ఫొటోలు దిగారు. పదవీకాలం త్వరలో ముగియబోతున్న పలువురు ఎమ్మెల్సీలు ముందు వరుసలో చైర్మన్‌, మంత్రులు, విపక్షనేత డీఎస్‌తో కుర్చీల్లో కూర్చున్నారు. మిగతా ఎమ్మెల్సీలు వెనుక నిలబడ్డారు. అయితే ఈ గ్రూప్‌ ఫొటో తీసే సమయంలో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు షబ్బీర్‌, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు అక్కడలేరు. టీ బ్రేక్‌ సందర్భంగా విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన వారంతా.. ఫొటోలు తీయడం పూర్తయ్యాక వచ్చారు. దీంతో ఈ ముగ్గురూ విడిగా ఫోటో దిగారు.ప్రస్తుతం మారిన సాంకేతిక యుగంలో విడిగా తీసిన ఫొటోలను కూడా గ్రూపు ఫొటోలో జత చేయవచ్చని ఫోటోగ్రాఫర్‌ చెప్పడంతో.. తమ ఫోటోలనూ అందు లో కలపాలని చెప్పారు. ‘ఆఖరిరోజు సీఎం ఎలాగూ రాలేదు.. ఆయన ఫొటోను కూడా కలపవయ్యా..’ అని టీడీపీ సభ్యుడు అరికెల నర్సారెడ్డి అనడంతో నవ్వులు వెల్లివిరిసాయి.