తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుదాం

3

అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా ఎగరాలి

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌7(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ భేటీలో మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జూన్‌ 2 నుంచి 8 వరకు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వేడుకల చివరి రోజున హైదరాబాద్‌ లో ముగింపు వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సచివాలయంలో గంటకు పైగా జరిగిన సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆవిర్భావ దినం సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించింది. వేడుకల కోసం రూ. 20 కోట్లు కేటాయించింది. ఇందులో జిల్లాకు కోటికి తక్కువ కాకుండా వెచ్చించాలని సూచించింది. రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుంది. విద్యార్థులకు వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించనుంది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించనుంది. రాష్ట్రస్థాయిలో రూ. 1 లక్ష 116, జిల్లా స్థాయిలో రూ. 50,116, మండల స్థాయిలో రూ. 10,116 నగదు పారితోషికంతో గౌరవించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3,620 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పవర్‌ లూమ్స్‌ కు 50 శాతం సబ్సిడీని మరో ఐదేళ్లు కొనసాగించాలని నిర్ణయించింది. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీస్‌ కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచింది. తీవ్రవాద కార్యకలాపాల వల్ల ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారాన్ని నిర్ణయించేందుకు ¬ం మంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు.