తెలంగాణ వచ్చి తీరుతుంది
: చిరంజీవి
నల్గొండ, జనవరి 01: తన జీవితం కాంగ్రెస్ పార్టీకే అంకితమని.. తెలంగాణ రావడం ఖాయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి తెలిపారు. హూజూర్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర రహదారుల శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ, కేంద్ర సామాజిక సహాయ మంత్రి బలరాం నాయక్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. సినిమా థియేటర్ సమీపంలోని స్థలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగసభలో మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, ఎంపి గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడారు. తొలుత 40 కోట్ల రూపాయలతో చేపట్టిన మొదటి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలి విడతగా వెయ్యి ఇళ్లను నిర్మించనున్నారు. రూ.5.30 కోట్లతో పట్టణంలోని రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్, రూ.39.50 కోట్లతో నూతన రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభింపజేశారు.
: ఉత్తమకుమార్‌రెడ్డి
నీతి, నిజాయితీలకు మారుపేరుగా అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నానని మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి కుంటుపడిందని, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ కొందరు అబద్దపు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు. తాను మాజీ సైనికోద్యోగుడ్ని అని, 1994 నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని, ఆనాటి నుంచి నేటి వరకు తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఆవశ్యకతను యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి ఎన్నోమార్లు వివరించానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో సోనియా ఆశీస్సులతో ఎన్నో సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నా మని చెప్పారు. ఇక ముందు కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు ఫీజులిస్తున్నాం, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, 90 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ప్రజలకు మేల చేసేందుకే తన జీవితం అంకితమని, తాను, తన భార్య అహర్నిశలు ప్రజల అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నామని, నియోజకవర్గ ప్రజల చలువ వల్లే తాను నేడు ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. నియోజకవర్గ ప్రజల మేలు ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజల అభివృద్ధికే తన జీవితం అంకితమని చెప్పారు.
అందరూ సహకరించండి : గుత్తా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేందుకు అందరూ సహకరించాలని కోరుతున్నానని ఎంపి గుత్తా సుకేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణ తప్ప తమకు మరొకటి వద్దన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని, తమ ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు.
అందరూ బాగుండాలి : సర్వే
నూతన సంవత్సరం సందర్భంగా అందరూ బాగుండాలి అని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. విద్యార్థులు బాగుండాలి.. 2013లో అందరి జీవితాలు బాగుండాలి అని వేడుకుంటున్నానన్నారు. ఆమె మృతితో యావత్ భారతదేశం తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆమె మృతి పట్ల సంతాపంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి, ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ వల్లే మేలు జరుగుతోంది : బలరాం
కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే తమ లంబాడా జాతికి మేలు జరుగుతోందని, ఆ పార్టీ వల్లే తాము బాగుపడుతున్నా మని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీల అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అహర్నిశలు ఎస్‌సి, ఎస్‌టి, బీసీ మైనారిటీ వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో శ్రమిస్తున్నారన్నారు. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సైతం పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. వారి వల్లే తనకు కేంద్రంలో అత్యున్నత స్థానం లభ్యమైందని, ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ఎప్పుడైనా.. ఎక్కడికైనా వస్తా : చిరంజీవి
కాంగ్రెస్ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న ప్రజలను చూసి ఓర్వలేక కొందరు అబద్దపు ప్రచారానికి పాల్పడుతున్నారని, వారి ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే తాను హూజూర్‌నగర్ వచ్చానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పి.. మోసకార్ల ఆట కట్టించేందుకు తాను ఎక్కడికైనా.. ఎప్పుడైనా వస్తానని చిరంజీవి చాలెంజ్ చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రజా రాజ్యం పార్టీ పెట్టానని, అయితే తనకు తగిన బలం చాలలేదని, కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే దాన్ని సాధించొచ్చని భావించి కాంగ్రెస్ పార్టీతో జత కట్టానని అన్నారు. ఆ పార్టీలో చేరాక తానునుకున్నది సోనియాగాంధీ చేసి చూపించా రని అన్నారు. సర్వే సత్యనారాయణకు, బలరాం నాయక్‌కు, తనకు అత్యున్నత స్థానాలు కట్టబెట్టి సోనియాగాంధీ తన హామీని నెరవేర్చుకున్నారన్నారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల వల్ల అందరూ లబ్ది పొందుతు న్నారన్నారు. మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి నిజాయితీపరుడు అని అభినందించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన టాలెంట్‌ను దగ్గర నుంచి పరిశీలించానన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న కృషి ఎంతో ఉన్నతమైనదన్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూ నేడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. నేడు శంకుస్థాపన చేసిన 1000 ఇళ్ల నిర్మాణాన్ని ఆరు నెలల్లోగా పూర్తి చేసి చూపిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇవ్వడంతోను పని విషయంలోను, ప్రజల విషయంలోను ఆయన చిత్తశుద్ది తేటతెల్లమవుతోందన్నారు. అలాంటి మంచి వ్యక్తి మీ ప్రతినిధిగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. జనవరి ఒకటో తేదీన మిమ్మల్నందర్ని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సమయం తక్కువగా ఉంది. మరోసారి వచ్చి మీతో మాట్లాడుతానని చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించారు.