తెలంగాణ వ్యతిరేకులకే అందలం కాంగ్రెస్ ఆంతర్యమేమిటో?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నింటా తెలంగాణ వ్యతిరేకులకు అగ్రతాంబూలమిస్తూ పది జిల్లాల ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటుంది? అదే సమయంలో తెలంగాణ కోరుకునేవారిని, తెలంగాణ గురించి మాట్లాడే వారిని విస్మరించడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తూ, ఎన్నికల సమయంలో హామీ ఇస్తూ వచ్చిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాట ఉత్తదేనా? అప్పటి గండం గట్టెక్కడానికే కాంగ్రెస్ ఇంతకాలం హామీల నాటకాటకాలాడుతూ వచ్చిందా అనే సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను ముసురుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణపై మాట ఇచ్చి తప్పడం కొత్తకాదు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో చేర్చి, రాష్ట్రపతితో చెప్పించి కూడా కాంగ్రెస్ పార్టీ తన పాత ధోరణినే కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులను ప్రోత్సహించడం, తెలంగాణ కోరుకునేవారిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం పరిపాటిగా మారింది. సోమవారం సాయంత్రం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఈ విషయాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. తెలంగాణకు వందశాతం వ్యతిరేకిగా పేరున్న ఏలూరి ఎంపీ కావూరి సాంబశివరావుకు కాంగ్రెస్ అధిష్టానం డబుల్ ప్రమోషన్ ఇచ్చింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడిగా నియమించిన మరుసటి రోజే కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించారు. సీనియర్ పార్లమెంటేరియన్‌గా ఆయనకు అవకాశం ఇచ్చారని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, ఒకానొక సందర్భంగా పదవి దక్కలేదని అలిగి పార్టీ వీడేందుకు కూడా కావూరి సిద్ధపడ్డారు. అప్పుడు అతడిని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ బుజ్జగించి తదుపరి విస్తరణలో మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకున్నారు. బ్యూరోక్రాట్‌గా ఉండి రాజకీయాల్లో ప్రవేశించిన జేసుదాసు శీలం తెలంగాణపై అందరిలా బాహాటంగా మాట్లాడకున్నా ఆయన రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునేవారే. అలాంటి ఇద్దరిని ఒకే రోజు కేబినెట్‌లోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి మాత్రం మొండి చేయి చూపింది. తెలంగాణ నుంచి కేబినెట్ బెర్త్ ఆశించిన గాంధీ కుటుంబ వీరవిధేయుడు వి.హనుమంతరావుకు కూడా చోటు కల్పించకుండా సీమాంధ్ర లాబీయింగ్‌కు పెద్దపీట వేసింది. తెలంగాణ నుంచి ఈసారి మంత్రివర్గంలో స్థానం ఆశించిన వారు సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్. వీరంతా బీసీ నాయకులే. కానీ ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించలేదు. వీరిలో అంజన్‌కుమార్, సురేశ్‌షెట్కర్ తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన దాఖలాలు లేవు. మధుయాష్కీ, పొన్నం వీర తెలంగాణవాదులుగా పేరున్నా ఇటీవల కాలంలో ఎందుకు గొంతు విప్పడం లేదు. అధిష్టానం ఏది చేసినా ఓకే అని చెప్పే హనుమంతుకు కూడా అవకాశం ఇవ్వలేదు. వీరంతా తెలంగాణ కోసం ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన వారే. తర్వాతికాలంలో వారి దృక్పథంలోనో ఇతరత్రా మార్పులు వచ్చి ఉండొచ్చు కానీ స్థూలంగా వారు తెలంగాణ కోరుకునేవారే. కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన జి. వెంకటస్వామి కుమారుడు పెద్దపల్లి డాక్టర్ జి. వివేకానంద, సీనియర్ పార్లమెంటేరియన్ మందా జగన్నాథం, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు తెలంగాణపై తేల్చాలని కోరితే పట్టించుకున్న నాథుడే లేడు. చివరికి వారు పార్టీని వీడాల్సిన పరిస్థితిని కల్పించారే తప్ప తెలంగాణపై ఏమీ చెప్పలేదు. కనీసం ఇంత వ్యవధిలోగా తేల్చుతామని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన అమలు చేయాలని కోరినా స్పందన లేదు. అదే సీమాంధ్ర ప్రాంతం వారు కోరిందే తడవుగా పలు పనులు చేసి పెడుతున్నారు. తెలంగాణలోని గిరిజన ప్రాంతాలను ముంచేసే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అదే తెలంగాణలోని ఎగువ ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ వనరుల దోపిడీకి పాల్పడితే.. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రజల ఆకాంక్షల వంచనకు ప్రయత్నిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారి సంఖ్య 13 కాగా వారిలో తొమ్మిది మంది సీమాంధ్ర ప్రాంతం వారే. జైరాం రమేశ్ మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై కేబినెట్‌లో కొనసాగుతున్నారు. 13 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే తెలంగాణ వారు. పది జిల్లాల ప్రజల తరఫున ముగ్గురికే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం, 13 జిల్లాలకు చెందిన తొమ్మిది మందికి పదవులు కట్టబెట్టింది. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలోనూ కాంగ్రెస్ పార్టీ అదే తీరు ప్రదర్శించింది. తెలంగాణకు చెందిన వి.హనుమంతరావు, సంజీవరెడ్డి, చిన్నారెడ్డికి చోటు కల్పించినా వీరిలో ఒక్కరు కూడా తెలంగాణ కోసం పోరాడిన వారు కాదు. 2004కు ముందు చిన్నరెడ్డి టీఆర్‌సీసీ కన్వీనర్‌గా పనిచేసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మంత్రి పదవి కట్టబెట్టిన తర్వాత తెలంగాణవాదాన్ని పక్కనబెట్టారు. కేబినెట్‌లో తెలంగాణపై గళం విప్పే అవకాశం ఉన్నా సీమాంధ్ర పెత్తందారులకు జీ హుజూర్ అన్నాడే తప్ప ప్రజాపక్షం వహించలేదు. సీమాంధ్ర ప్రాంతం నుంచి పూర్తిగా తెలంగాణ వ్యతిరేకులకు అవకాశం ఇస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ ప్రాంతానికి వస్తే మాత్రం స్తబ్దంగా ఉండేవారిని అందలం ఎక్కిస్తోంది. తెలంగాణ ప్రజల పక్షాన ముందుండి పోరాటం చేసే వారిని పూర్తిగా విస్మరిస్తూ తెలంగాణ కోరుకోవడమే తప్పనే సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి నియామకంలోనూ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ వ్యతిరేకులకే పెద్దపీట వేస్తుంది. ఇప్పటి వరకూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న గులాంనబీ ఆజాద్ సీమాంధ్ర నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కోగా, ప్రస్తుతం ఇన్‌చార్జిగా నియమించిన దిగ్విజయ్‌సింగ్ స్వతహాగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకి. తెలంగాణ ఏర్పడితే ఛత్తీస్‌గఢ్‌లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పలుమార్లు సీడబ్ల్యూసీ భేటీలో వ్యాఖ్యానించేవారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి నియమించడం తెలంగాణ వ్యతిరేక చర్యగానే ఈప్రాంత నాయకులు బావిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నింటా తెలంగాణ వ్యతిరేకులకు పెద్దపీట వేస్తూ తెలంగాణ కోరుకునేవారిని మాత్రం విస్మరిస్తోంది. దీనిని బట్టి తెలంగాణపై ఆ పార్టీ విధానమేమిటో స్పష్టమవుతోంది. ఇప్పుడు తేల్చుకోవాల్సింది పది జిల్లాల ప్రజలు మాత్రమే.