తెలుగులో దర్యాప్తులు


నేర న్యాయ పాలనలో భాషది అత్యంత కీలకస్థానం. బాధితుల విషయంలో, ముద్దాయిల విషయంలో భాష అత్యంత ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. తాను ఇచ్చిన నివేదిక ప్రకారమే కేసు నమోదు అయిందా? కేసు ఎలా దాఖలైంది? ముద్దాయిపై కేసు కొట్టివే యడానికి కారణం ఏమిటి? ఈ విషయాలు బాధితులకి తెలియా లంటే ఆ వివరాలు బాధితులకు తెలిసిన భాషలో వుండాలి. అదే విధంగా ముద్దాయి విషయంలో కూడ భాష చాలా ప్రముఖమైన పాత్రని పోషిస్తుంది. తనమీద ఏ నేరం మోపబడింది, ఏ ఏ సాక్షు లు తనకు వ్యతిరేకంగా సాక్షం చెప్పారు. వారి సాక్ష్యాలను కోర్టు ఎందుకు విశ్వసించింది. ఈ విషయాలను అర్థం చేసుకోవాలంటే అవి ముద్దాయికి తెలిసిన భాషలో వుండాలి.నేర పరిశోధనలో మొ ట్టమొదటి అడుగు ప్రథమ సమాచార నివేదిక. దాని ద్వారా దర్యాప్తు, విచారణ ఆ తరువాత శిక్ష వేసే అవకావం వుంది. నేర విషయంలో పోలీసు అధికారి దర్యాప్తు మొదలుపెట్టి సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైన పత్రం – ప్రథమ సమాచార నివేదిక. ఇక్కడి నుంచి మొదలైన నేర ప్రక్రియ ఆ కేసులో వచ్చే తీర్పుతోనో, పోలీసులు కేసును మూసి వేయడంతోనో అంతమవుతుంది.నేరం జరిగిన తరువాత బాధితులు గానీ ఆ నేర సమాచారం తెలిసిన వ్యక్తులు గాని రక్షకభట నిలయానికి వెళ్లి పోలీసు అధికారికి ఆ సమాచారాన్ని నివేదిస్తారు. అక్షరాస్యులైన వ్యక్తులు ఆ సమాచారాన్ని రాతపూర్వకంగా పోలీసులకి అందజేస్తారు. అక్షరంజ్ఞానం లేని వ్యక్తులు దాన్ని నోటి మాట ద్వారా అందజేస్తారు. మౌఖికంగా అందజేసిన సమాచారాన్ని పోలీసు అధికారి నమోదు చేసి దాన్ని వాళ్లకి చదివి విన్పించాలి. ఆ బాధ్యత పోలీసు అధికారిపై వుంటుంది. నేర సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తులు ఇచ్చిన భాషలోనే నమోదు చేసి విన్పించినప్పుడు అది వాళ్లకు స్పష్టంగా అర్థమ వుతుంది. సాధారణంగా పోలీసులు వాళ్లు చెప్పిన భాషలోనే వాటిని నమోదు చేస్తారు. ఈ నేర సమాచారం ఆధారంగా ప్రథమ సమా చార నివేదికను విడుదల చేయాలి. ఆ తరువాత ఈ సమాచార ప్రతిని ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి అందజేయాలి. అందజేసినట్టు సంతకం తీసుకోవాలి. ఈ ప్రథమ సమాచార నివేదిక నమూనాలు ఎక్కువ శాతం ఇంగ్లిష్‌లో వుంటున్నాయి. కొన్ని పోలీసు స్టేషన్లలో రెండు భాషల్లో వుంటున్నాయి. రెండు భాషల్లో వున్నప్పటికీ ఎక్కువశాతం దాన్ని ఇంగ్లిష్‌లోనే నమోదు చేస్తున్నారు. ఇది చాలా సులువుగా తప్పించవచ్చు. దీని వల్ల పోలీసులకి ఎలాంటి ఇబ్బంది వుండదు. బాధితులకి, నేర సమాచారం ఇచ్చిన వ్యక్తులకి మేలు జరిగే అవకాశం ఉంది.దర్యాప్తులో భాగంగా పోలీసులు సాక్ష్యులని విచారిస్తారు. సాక్షులు విచారణని తెలుగులోనే చేస్తారు. సాక్షులు తెలుగులోనే చెబుతారు. సాక్షులు చెప్పిన విషయాలని వాళ్లు చెప్పిన విధంగా, తెలుగులో రాయడం సులువు. కానీ ఆ విధంగా సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని టైపు చేయడం సులవన్న విధంగా కొంత మంది పోలీసు అధికా రులు ఇంగ్లిష్‌లోకి అను వాదం చేస్తున్నారు. ఇది అవసరం లేదు. ఇప్పుడు తెలుగుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అంతర్జాలంలో అందుబాటులో ఉంది. అధికార భాషాసంఘం కూడా సాఫ్ట్‌వేర్‌ని అంద జేస్తుంది. నిజానికి తెలు గులో చెప్పిన విషయా లన్నీ ఇంగ్లిష్‌లోకి అను వందించడం శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని పోలీసు అధికా రులు తక్షణం వదిలిపె ట్టాల్సిన అవసరం ఎంతై నా ఉంది.దర్యాప్తు పూర్తి అయిన తరువాత పోలీసులు తగు నివేదికను కోర్టుకి సమర్పిస్తారు. ముద్దాయిలపై పోలీసులు అభియోగాన్ని దాఖలు చేసినప్పుడు దాన్ని అభియోగ పత్రమని (చార్జిషీట్‌) కేసుని ముగించినప్పుడు తుది నివేదిక అవి వాడుకలో అంటున్నాం. చాలా వరకు దర్యాప్తు తెలుగులో వుంటుంది. సాక్షుల వాంగ్మూలాలు తెలుగులో వుంటాయి. నేరస్థుల పంచనామా తెలుగులో వుంటుంది. ముద్దాయి నేరాంగీకార పత్రం తెలుగులో వుంటుంది. శవ పంచాయితీ నివేదిక తెలుగులో వుంటుంది. ఇవన్నీ తెలుగులో వున్నప్పటికీ ముద్దాయిని అరెస్టు చేసి కోర్టు పంపినప్పుడు పంపించే రిమాండ్‌ నివేదిక ఇంగ్లిష్‌లో ఉంటుంది. పోలీసులు దాఖలు చేసే అభియోగ పత్రం ఇంగ్లిష్‌లో వుంటుంది. దర్యాప్తు పూర్తిగా తెలుగులో వున్నప్పుడు, అన్ని కార్యకలాపాలు తెలుగులోనే జరిగినప్పుడు రిమాండ్‌ నివేదికను, అభియోగపత్రాన్ని ఇంగ్లిష్‌లో దాఖలు చేయడంలో ఎలాంటి ఔచిత్యం కన్పించడం లేదు. ఇవి రెండు తెలుగులో రాయడం పోలీసు అధికారులకి చాలా సులువైన విషయం. సులువుగా చేసే పనిని ఇంగ్లిష్‌లోకి అనువా దం చేసి పోలీసులు ఇబ్బందులకి లోనవుతున్నారు. వాళ్లు ఇబ్బందు లకి లోను కావడమే కాకుండా బాధితులని, ముద్దాయిని కూడా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇవి రెండు తెలుగులో వుంటే వారు సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం వుంటుంది. దర్యాప్తు పూర్తిగా తెలుగు భాషలో జరిగినప్పుడు తెలుగులో ఇవి దాఖలు చేయడం పోలీసులకి సులువైన పని. ఈ రెండు కార్యకలాపాల్లో వాళ్లు సుప్రీంకోర్టు, హై కోర్టు తీర్పులని ఉదహరించాల్సిన పనిలేదు. చట్టాలలోని అంశాలని, నిర్వచనాలని చెప్పాల్సిన పనిలేదు. ఇలాం టి పరిస్థితుల్లో తెలుగులో తయారు చెయ్యడం కష్టమైన పనికాదు. ఏవైనా పదాలు, పదబంధాలని తెలుగులో చెప్పడం. అనువదిం చడం కొంతకాలం కష్టంగా వుండవచ్చు.అందుకని అరెస్టు, రిమాండ్‌, పోలీసు కస్టడీ లాంటి పదాలను కొంతకాలం అదే విధంగా ఉపయోగిస్తే తప్పేమీ లేదు. కాలక్రమంలో వీటికి తెలుగు నుంచి అనువాదాలు వస్తాయి. అనువాదాలు కాకుండా కొత్త పదా ల సృష్టికూడా జరగవచ్చు.
ఈ పని చెయ్యడం వల్ల పోలీసుల పని సులభమే కాకుండా వాళుబాధితులకి ముద్దాయిలకి మేలు చేసిన వాళ్లవుతారు. మరో రకంగా సమాజానికి మేలు చేసిన వాళ్లవుతారు. తమపై ఏ నేరం మోపారో ముద్దాయిలు సులువుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. దానికి తగినట్టుగా వాళ్లు తగు రక్షణని తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. తాము ఇచ్చిన సమాచార ఫలితం తుది నివేదిక ఏ విధంగా వచ్చిందో తెలుసుకోవడానికి బాధితులకి అవకాశం చిక్కు తుంది.ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. ఏ భాషకూడా మాతృభాష స్థానాన్ని పొందలేదు. మాతృభాషలో వ్యక్తీకరించినంత సులువుగా ఇతర భాషల్లో వ్యక్తీకరించలేం. రెండు పేజీల్లో ఇంగ్లిష్‌లో చెప్పే విషయాన్ని రెండు పేరాల్లో చెప్పగలం.ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈ అభియోగపత్రాలని ఎక్కువ గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలోని అధికారులు దాఖలు చేస్తారు. వాళ్లకి తమ భాషలో వీటిని రాయడం చాలా సులువు. ఈ విషయా న్ని ప్రభుత్వం పోలీసు అధికారులు గుర్తించి తగు సూచనలు చేయాలి.