తెలుగు నేల నుంచే రాజకీయ సునావిూ

దేశంలో రాజకీయ పునరేకీకరణకు తెలుగు వల్లభులే కీలక భూమిక పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. నివురుగప్పిన నిప్పులా కేంద్రంపై ఉన్న వ్యతిరేకతను రాజకీయ సునావిూ సృష్టించేందుకు ఇద్దరు చంద్రులు తమదైన శైలిలో కార్యాచరణకు దిగారు. నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు మండబోతున్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ చాపకింద నీరులా మెల్లగా తన పనికానిచ్చే పనిలో ఉన్నారు. ఒక్కో నేతను కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ..వారిలో ఒకడిగా మార్పునకు కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కెసిఆర్‌ పలువురు ప్రముఖులను కలసి వారిలో నిద్రాణంగా ఉన్న కేంద్ర వ్యతిరేకతను తట్టి లేపారు. కలసి నడుద్దామని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ పిలుపుతో ఇప్పటికే రాజకీయ కార్యాచరణ మొదలయ్యింది. కర్నాటక వ్యవహారాలను కేవలం జెడిఎస్‌ కోణంలోనే చూస్తూ తొలి విజయంగా భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడం ద్వారా ఫెడరల్‌ స్ఫూర్తికి ప్రాణం పోసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజెపియేతర పక్షాలను ఒక్కతాటిపైకి తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల సత్తా చాటాలని చూస్తున్నారు. రాష్ట్రాల ఆర్థిక అధికారాలపై కేంద్రం దాడి చేస్తోందని, దీన్ని అన్ని రాష్ట్రాలు  కలిసికట్టుగా అడ్డుకోవాలని ఇప్పటికే ప్రతిపాదించారు. ప్రభుత్వం తీసుకునే నిర్మాణాత్మకమైన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడేలా, నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యతను కేంద్రం బదిలీ చేయడం ద్వారా నిజమైన సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆర్థిక నిపుణులు, మేధావులు భావిస్తున్నారు. అయితే  బిజెపి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. దేశస్థాయిలో మూస పద్ధతిలో ఉన్న కొన్ని ఉపయోగకరంగా లేని చట్టాలను రాజ్యాంగపరంగా సవరించాల్సి ఉందన్న భావన ఉంది. ప్రస్తుత ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలు, ఏకపక్ష పోకడల వల్ల కేంద్రాలకు, రాష్ట్రాలకు మధ్య అపనమ్మకం, అవిశ్వాసం పెరుగుతున్నాయి.  ఆ విధానాలు జులుం ప్రదర్శించేవిగా ఉన్నాయన్న భావన అన్ని పార్టీల నేతల్లో బలంగా ఉంది. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు రాష్ట్రాల ఆర్థిక ప్రతిపత్తికి గొడ్డలిపెట్టులా ఉన్నాయని ఇటీవల కేరళ,ఆంధ్రాలో జరిగిన సమావేశాల్లో వెల్లడయ్యింది. దీనిపై తెలుగుదేశం మార్గదర్శ కాలను సవరించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చింది. మొత్తంగా తుట్టె కదిలింది. ఇది ఇంతటితో ఆగకుండా పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మహానాడు వేదికగా మూడు రోజులు జరిగిన సంబరంలో కేంద్రం విధానాల పైనే ప్రధానంగా చర్చ సాగింది. గతంలో ఎప్పుడూ ఇంతగా కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకే  రాష్ట్రాల హక్కుల పరిరక్షణకు కంకణబద్ధం కావాలని తెలుగుదేశం మహానాడు తీర్మానించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించేందుకు కేంద్రం పెత్తందారీ తనాన్ని రూపుమాపాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను టిడిపి తరుఫున చంద్రబాబు చేపట్టాలన్నీ మహానాడు తీర్మానించింది. మహానాడు మూడోరోజు మంగళవారం పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2019లో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి చంద్రబాబు కీలకంగా మారే సంకేతాలున్నాయని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి ప్రజాస్వామ్య వాదులంతా సహకరించాలని కోరారు. కర్నాటకలో జెడిఎస్‌ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి రాజకీయ నేతలంతా హాజరుకావడం దేశంలో రాజకీయ పునరేకీకరణకు ప్రత్యక్ష తార్కాణమని పేర్కొన్నారు. జాతీయ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పాలనే సజావుగా సాగుతోందని 
నమ్ముతున్నారని, ఆ దిశగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని వివరించారు. మోడీ, అమిత్‌షా నిరంకుశగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారన్నారు. బిజెపి తీరుతో విసిగిన ప్రజలు అనేక ఉప ఎన్నికల్లో బిజెపిని ఘోరంగా ఓడిస్తున్నారని ప్రకటించారు. సమాఖ్య వ్యవస్థపైనా, ప్రజాస్వామ్యంపైనా రాజ్యంగం పైనా జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు నిరసించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న ¬దా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేసిందని తెలిపారు. బిజెపి అనుసరిస్తున్న తీరు మధ్యయుగం నాటి ఫ్యూడలిజంలా ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. దక్షిణాదిపై దండయాత్ర చేస్తామం టున్నారని, కర్నాటక ఎన్నికలు దీనికి గేట్‌వేగా పేర్కొన్నారని, ఇదేమన్నా విదేశీ తరహా దండయాత్రా అని ప్రశ్నించారు. ఒక సంప్రదాయం గానీ, నిబంధనగానీ అనుసరించకుండా రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారని, బిజెపి నాయకులు వినాష్‌ పురుష్‌లుగా దాపురించారని తెలిపారు. నియంతృత్వ ధోరణితో ఎమ్మెల్యేలను కొనొచ్చనే ఆలోచనతో కర్నాటకలో యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేసి అభాసు పాలయ్యారని తెలిపారు. సహకార సమాఖ్య రాష్ట్రం ఏర్పాటే ముందున్న లక్ష్యమని తెలిపారు.  రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం కేంద్రానికి 97 అంశాలు, రాష్టాల్రు 66, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు పొందుపరిచారని, గత 69 సంవత్సరాల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వివిధ పార్టీలకు చెందిన సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన పరిస్థితుల్లో శాస్త్రీయ విధానంలో నిధుల బదిలీ జరగడం లేదని తెలిపారు.  పెద్దనోట్లను రద్దు చేస్తామని చెప్పి రెండువేల రూపాయల నోటు తీసుకురావడం ద్వారా మరింత బ్లాక్‌మనీకి అవకాశం కల్పించిందని తీర్మానించారు. జిఎస్‌టిపైనా వ్యాపారులు ఆందోళనలు చేపట్టారన్నారు. కేంద్రం తీరుతో బ్యాంకులు దివాళా దిశగా వెళుతున్నాయని చెప్పారు. మొత్తంగా ఇద్దరు చంద్రులు వేసే అడుగులు జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది కాబోతున్నాయి.
————–